గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం.
2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌పై హత్య కేసు నమోదైంది.
2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు.
2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది.
2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు.
2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు.
2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు.
2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.
2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.
2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు.
1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్‌లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు.
1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు)
ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు
Comments
Please login to add a commentAdd a comment