మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్‌లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం.
అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు.
దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా
సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు
► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని
► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి.
► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది
► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది.
► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది.
కేంద్రం మూడంచెల వ్యవస్థ
బిపర్‌జోయ్ మహా తుపాను గుజరాత్‌లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది.
ఫలితాలు ఇలా..!
ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment