న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. ఐరాస, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడాని అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఇటీవల ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానం ఇచ్చారు.
‘ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఐరాస కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనం ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నాం. దానిని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం. ఐరాస సంస్కరణలకు తాము(అమెరికా) కచ్చితంగా మద్దతు ఇస్తాం. అయితే ఎలాంటి సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనల తమ వద్ద లేవు. కానీ, ఐరాసలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం’ అని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
ఇక... జనవరిలో ఐక్యరాజ్యసమితి పనితీరుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. అదీకాక.. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు.
‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.
ఇక.. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించారు. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోకపోవటం గమనార్హం. అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కటం లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ పొరుగుదేశం చైనా అడ్దుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment