జలవిద్యుత్ మొత్తం ఎత్తిపోతలకే
మూడేళ్లల్లో 20 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలి
ఇంధనశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన
హైదరాబాద్: భవిష్యత్ లో జలవిద్యుత్ మొత్తాన్ని ఎత్తిపోతల పథకాలకే ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 2081.8 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఎత్తిపోతల పథకాలకే పరిమితం చేసేలా, వచ్చే మూడేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఎత్తిపోతల పథకాలకు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని అంచనా. కృష్ణా, గోదావరి నదుల మీద మరిన్ని జలవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సర్వే చేయాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న 8 వేల మెగావాట్ల విద్యుత్‌తో పాటు తెలంగాణ జెన్‌కో 6 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల ఏర్పాటు, విభజన చట్టం హామీ మేరకు రామగుండం వద్ద ఏర్పాటుకానున్న ఎన్‌టీపీసీ యూనిట్ 4 వేల మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కలిపి మొత్తం 20 వేల మెగావాట్లకు చేరుకోవాలని కేసీఆర్ అన్నారు.
సురేశ్ చందాపై కేసీఆర్ ఆగ్రహం...బదిలీవేటు
ఇంధనశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ సురేశ్ చందాపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధనశాఖ వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్న విషయాన్ని చెప్పనందుకు సీఎం ఆగ్రహించినట్టు తెలిసింది. దీంతో ఆయనపై బదిలీ వేటు పడింది. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ చందాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలో పీపీఏలపై జరిగిన సమావేశం గురించి వివరించేందుకు మంగళవారం సచివాలయంలో సీఎంను సురేశ్‌చందా కలిశారు. పీపీఏల రద్దుపై తెలంగాణ వాదనలకే సీఈఏ కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. అయితే, తనకు చెప్పకుండానే ఢిల్లీ వెళ్లినందుకు సీఎం ఆయనపై ఆగ్రహించినట్టు తెలిసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఇంధన శాఖ పూర్తి బాధ్యతలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషికి అప్పగిస్తున్నట్లు సీఎస్ రాజీవ్‌శర్మ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
బడ్జెట్‌పై ఆగస్టు 1 నుంచి కసరత్తు...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసిఆర్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి కసరత్తు పారంభించనున్నారు. ఆగస్టు రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో తొలి వారంలో సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.