అవగాహన కుదిరేనా?
కృష్ణా జలాల పంపకంపై నేడు తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల వాటా లెక్కలు, వినియోగ అంశాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి పారుదల అధికారులు మంగళవారం భేటీ కానున్నారు. కేంద్ర ఆదేశాల మేరకు ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్వహణ, జలాల వినియోగంపై ఒప్పందానికి వచ్చేలా ఈ చర్చలు సాగే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ తదితరులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.
ఈ భేటీలోని అభిప్రాయం ఆధారంగా కేంద్రం తుది నిర్ణయం ప్రకటిస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి. కేఆర్‌ఎంబీ ముసాయిదా నోటిఫికేషన్‌పై ఆమోదముద్ర వేసి, బోర్డుకు అధికారాలు కట్టబెట్టి.. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలోకి తేవాలంటూ ఏపీ పట్టుబట్టడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో గత ఏడాది 13 టీఎంసీలను అధికంగా వినియోగించుకున్న నేపథ్యంలో వాటిని ఈ ఏడాది సర్దుబాటు చేయాలని, పట్టిసీమ, పోల వరం ద్వారా తెలంగాణకు 90 టీఎంసీల వాటా దక్కుతుందని అంటోంది. అయితే దీనిపై ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. ఇవే అంశాలపై మంగళవారం మరోమారు చర్చించే అవకాశం ఉంది.
ఒకవేళ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో నీటి పంచాయతీని సీడబ్ల్యూసీ రిటైర్డు చైర్మన్లు ఏబీ పాండ్య, ఏకే బజాజ్, సురేష్ చంద్రలతో కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ పరిష్కరించనుంది. కృష్ణా జలాల తాత్కాలిక పంపకంతోపాటూ కేఆర్‌ఎంబీ పరిధి, విధి విధానాలు, నిర్వహణపై త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, కేఆర్‌ఎంబీకి అధికారాలు అప్పగించడంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది.