నెట్టెంపాడు ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆ పథకం ‘గట్టు’న పడింది. కృష్ణా నదీజలాల ఆధారంగా చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకం తుది డిజైన్ ఖరారైనట్లు తెలుస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. రెండ్రోజుల కిందట ఈ ఎత్తిపోతలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో చర్చించిన సీఎం 1.5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించాలని సూచించినట్లు తెలిసింది.
నిజానికి గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టు ఎత్తిపోతలకు రూ.554 కోట్లతో రెండేళ్ల కిందటే అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల సమయంలో 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఈ పథకం శంకుస్థాపన సమయంలో నీటిని తీసుకునే ప్రాంతాన్ని రేలంపాడు నుంచి జూరాలకు మార్చాలని సీఎం సూచించారు.
దీనితోపాటే రిజర్వాయర్‌లో నీటినిల్వ కనీసంగా 15 టీఎంసీల మేర ఉండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు ఇంజనీర్లు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదనలు వేశారు. అయితే బడ్జెట్ భారీగా పెరుగుతుండటం, జూరాల నుంచి నీటిని తీసుకునే క్రమంలో దూరం పెరిగి, లిఫ్టింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు.
మొదటగా ప్రతిపాదించినట్లే..: మొదటగా ప్రతిపాదించినట్లే రేలంపాడు నుంచి నీటిని తీసుకోవాలని, అయితే 0.60 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచికలపాడుకు కాకుండా నేరుగా రాయపురం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. దీనికి సుమారు రూ.వెయ్యి కోట్లతో అంచనా వేశారు.
అయితే 3 టీఎంసీల రిజర్వాయర్‌తో 1,300 ఎకరాల మేర భూసేకరణ అవరాలు ఉండటం, ఇందులో భారీగానే ప్రైవేటు భూమి ఉండటంతో మళ్లీ దీన్ని 1.5 టీఎంసీలకు కుదించాలని తాజాగా నిర్ణయించినట్లుగా తెలిసింది. అలా అయితే భూసేకరణ అవసరాలు తగ్గడంతోపాటు మరో రూ.150 కోట్ల మేర తగ్గి రూ.850 కోట్ల వ్యయమే అవుతుందని తేల్చారు. ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలత తెలిపినట్లుగా ఇరిగేషన్ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment