Reserviours
-
‘గట్టు’ ఎత్తిపోతల కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆ పథకం ‘గట్టు’న పడింది. కృష్ణా నదీజలాల ఆధారంగా చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకం తుది డిజైన్ ఖరారైనట్లు తెలుస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. రెండ్రోజుల కిందట ఈ ఎత్తిపోతలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో చర్చించిన సీఎం 1.5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించాలని సూచించినట్లు తెలిసింది. నిజానికి గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టు ఎత్తిపోతలకు రూ.554 కోట్లతో రెండేళ్ల కిందటే అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల సమయంలో 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఈ పథకం శంకుస్థాపన సమయంలో నీటిని తీసుకునే ప్రాంతాన్ని రేలంపాడు నుంచి జూరాలకు మార్చాలని సీఎం సూచించారు. దీనితోపాటే రిజర్వాయర్‌లో నీటినిల్వ కనీసంగా 15 టీఎంసీల మేర ఉండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు ఇంజనీర్లు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదనలు వేశారు. అయితే బడ్జెట్ భారీగా పెరుగుతుండటం, జూరాల నుంచి నీటిని తీసుకునే క్రమంలో దూరం పెరిగి, లిఫ్టింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. మొదటగా ప్రతిపాదించినట్లే..: మొదటగా ప్రతిపాదించినట్లే రేలంపాడు నుంచి నీటిని తీసుకోవాలని, అయితే 0.60 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచికలపాడుకు కాకుండా నేరుగా రాయపురం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. దీనికి సుమారు రూ.వెయ్యి కోట్లతో అంచనా వేశారు. అయితే 3 టీఎంసీల రిజర్వాయర్‌తో 1,300 ఎకరాల మేర భూసేకరణ అవరాలు ఉండటం, ఇందులో భారీగానే ప్రైవేటు భూమి ఉండటంతో మళ్లీ దీన్ని 1.5 టీఎంసీలకు కుదించాలని తాజాగా నిర్ణయించినట్లుగా తెలిసింది. అలా అయితే భూసేకరణ అవసరాలు తగ్గడంతోపాటు మరో రూ.150 కోట్ల మేర తగ్గి రూ.850 కోట్ల వ్యయమే అవుతుందని తేల్చారు. ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలత తెలిపినట్లుగా ఇరిగేషన్ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే.. చేసిన పనులకు బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇకపై ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)కే అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాంట్రాక్ట్ ఏజెన్సీలు నమ్మడంలేదు. చాలాఏళ్ల కిందట చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. పైగా, ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అధికారమున్నా నిధులు సున్నా రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిలో గేట్లు, జనరేటర్లు, రోప్‌వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపుమొక్కల తొలగింపు, పెయింటింగ్, గ్రీజింగ్, గ్యాంట్రిక్ క్రేన్లు, ఎలక్ట్రీషియన్, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటివన్నీ ఓ అండ్ ఎంలో భాగంగా చేపట్టాలి. వీటి నిర్వహణకు ఏటా రూ.280 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను గ్రీన్‌చానల్‌లో విడుదల చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చింది. అత్యవసర పనులకు వ్యక్తిగత స్థాయిలోనే నిధులు విడుదల చేసే అధికారాన్ని ఈఎన్సీ మొదలు ఈఈల వరకు కట్టబెట్టింది. కోటి వరకు ఈఎన్సీ (జనరల్), రూ.50 లక్షల వరకు సీఈ, రూ.25 లక్షల దాకా ఎస్ఈలకు, రూ.5 లక్షల వరకు ఈఈలకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి విడుదలైన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్ ఎంకు సంబంధించిన బిల్లులు రూ.20 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సైతం... ఈ ఏడాది 19 డివిజన్ల పరిధిలో 613 రకాల ఓ అండ్ ఎం పనులను రూ.65 కోట్లతో చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే చాలాచోట్ల ఇంజనీర్లు టెండర్లు పిలుస్తున్నా స్పందన రావడం లేదు. నాగార్జునసాగర్ పరిధిలో రూ.35 లక్షల సివిల్ పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి టెండర్ పిలిచారు. ఎస్సారెస్పీ పరిధిలో మరమ్మతులు, మట్టి పనులకు రూ.50 లక్షలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లలో ఉలుకూపలుకూలేదు. ఇక జూరాల పరిధిలో మెకానికల్ పనులు, హెడ్‌రెగ్యులేటర్, షట్టర్ల పనులకు రూ.25–30 లక్షలతో మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవో 20 కింద పంప్‌హౌస్‌ల నిర్వహణ నిమిత్తం రూ.100 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసినా, నిధుల విడుదల ఉంటుందా.. ఉండదా.. అనే సంశయం మాత్రం వారిని వెంటాడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
ఆగమైన బతుకులు
అదో మెట్టప్రాంతం.. ఎప్పుడూ కరువు ఛాయలే. జలయజ్ఞంలో భాగంగా అక్కడ రిజర్వాయర్ కడుతున్నారని తెలిసి రైతులు ఎంతో సంతోషించారు. సాగునీటితో భూములన్నీ సారవంతమవుతాయని, తాము నష్టపోయినా... మిగతా రైతులన్నా బాగుపడతారని భావించి తమ ఇళ్లు, భూములు అప్పగించారు. అలా గౌరవెల్లి రిజర్వాయర్‌కు పునాదిరాయి పడి ఇప్పటికి ఆరేళ్లయింది. అధికారులు పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పేరిట ఊరినంతా బొందలగడ్డలు చేశారు. ఇళ్లచుట్టూ మట్టి తవ్వారు. వానాకాలం ఇళ్ల చుట్టూ నీరు చేరి బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఆ ఊరితో అనుబంధాన్ని పెంచుకుని, మట్టిలో మట్టిగా బతుకుతున్న ఆ కష్టజీవులను ఇప్పుడు కదిలిస్తే ఉబికివస్తున్న కన్నీళ్లు... పంటిబిగువున అణుచుకున్న బాధలే కనిపిస్తాయి. ఊళ్లో పనిలేక... పైసలు లేక మరెక్కడికీ పోలేక వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి ముంపు బాధితుల హృదయాలను తడిమారు. వారి గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. న్యాయం చేస్తాం జలయజ్ఞంలో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టుకు అనుసంధానంగా 2007లో గౌరవెల్లి, గండిపెల్లి, ఓగుళాపూర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు గడిచినా ఇంకా మధ్యమానేరు ప్రాజెక్టు పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఈ నియోజకవర్గంలో లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఓగులాపూర్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ తట్టెడు మట్టి కూడా తియ్యలేదు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు వచ్చిన ప్రాంతానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని నిర్ణయించినందున పరిహారం పంపిణీ చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఇళ్లకు సైతం రూ.36 కోట్లు మంజూరయ్యాయి. ఇళ్లు కోల్పోతున్నవారికి డబ్బులు అందించేలా కృషి చేస్తాం. పొలాల్లోనే ఇళ్లు కట్టుకున్న విషయంలో అధికారులను పంపించి పరిశీలన చేసి అందరికీ డబ్బులు వచ్చేలా చూస్తాం. అందరికీ న్యాయం చేస్తాం. - వొడితెల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే గ్రామస్తుల డిమాండ్లు వ్యవసాయ భూములకు నూతన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలి. ఆంధ్రాలో లాగా ఎకరానికి రూ.25 లక్ష లు చెల్లించాలి. భూసేకరణ పూర్తిస్థాయిలో చేపట్టి రైతులకు పరిహారం అందించాలి.మునుగుతున్న ఇళ్ల ధరలను పెంచి జనవరి లోగా అందరికీ డబ్బులు పంపిణీ చేయాలి.ముంపు గ్రామంలోని అందరికీ ఒకేచోట నివాసాలు ఏర్పాటు చేయాలి.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలి.ప్రతీ ఇంటికో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కల్పించాలి. వొడితెల సతీశ్‌కుమార్ : మీ పేరేంటయ్యా? బొడిగ బాలయ్య : నా పేరు బొడిగ బాలయ్య సార్. మాకు మస్తు బాధలున్నయ్ సారు. ఐదేళ్లకిందట డ్యాం కడుతమని మట్టి తీసిండ్రు. మాకు పైసలు మాత్రం ఇయ్యలే. తవ్వుకున్న బాయిలు పోయినయ్. పత్తి ఏత్తే వానలు కొట్టి మొత్తం నట్టమైనా మాకు పైసలు ఇయ్యరట. మిమ్నల్ని ఎవుసం ఎవలు చేసుకొమ్మన్నరని మామీదికే గరమైతండ్రు. డ్యాంల మునిగిపోతున్నయని బ్యాంకోల్లు లోన్లు కూడా ఇత్తలేరు. మమ్ముల్ని బతుకుమంటరా? సావుమంటరా? సతీశ్‌కుమార్ : మీ ఇబ్బందులేంటి? బొడిగె కొంరయ్య : ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి ఆరేళ్లయింది. ముగ్గురు ఎమ్మెల్యేలు మారిండ్రు. ముగ్గురు ఆర్డీవోలు, ముగ్గురు ఎమ్మార్వోలు మారిండ్రు. తెనుగపల్లె, గుడాటిపల్లోళ్లకు ఇండ్ల జాగలు చూపిత్తమని చెప్పిండ్రు. ఇండ్ల జాగలు ఇయ్యలె. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కూడా మంచిగ చేత్తలేరు. గవర్నమెంట్‌కు చెప్పినం. స్పెషల్ కలెక్టర్ దగ్గరికి పోతే పైసల్ వచ్చినయని చెప్పిండ్రు. ఇత్తరని ఆశపడ్డం కానీ, ఇప్పటిదాకా ఇయ్యలే. లక్షలు పెట్టినా గిట్లాంటి భూమి దొరకదు. ఈ భూములకు ఎకరానికి పది లక్షలు ఇయ్యాలె. సతీశ్‌కుమార్ : ఏం పనులు చేసుకుంటున్నరు? బొడిగె మల్లయ్య : ఇరవై ఏండ్లనుంచి డ్యాం వస్తంది... డ్యాం వస్తంది అన్నరు. వైఎస్ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టి పని మొదలువెట్టిండు. ఆరేండ్లయింది. ఇప్పటిదాకా పని పూర్తికాలె. డ్యాంల పోని పొలాలను అమ్ముదామంటే కొనేటోళ్లు లేరు. ఎవుసం లేదు. ఏం లేదు. పనికిపోదామంటే ఇక్కడ ఏం పనిలేకుండా అయ్యే. ఎట్లాగూ డ్యాంల మునుగుతందని ఉపాధి పని కూడా ఈడ ఇత్తలేరు. ఊర్లపొంట తిరిగి పనులు చేత్తన్నం. మమ్ముల్ని ముంచుతరో... తేల్తరో తెల్తలేదు. సతీశ్‌కుమార్ : భూములకు ఏం ఇవ్వాలే? ఎల్లరెడ్డి : బాయిలు, బొందలు తవ్వుకుని పొలాలన్నీ అచ్చుగట్టుకున్నం. డ్యాం వత్తదని సెప్పి మెల్లమెల్లగ బుదురకిచ్చి మా భూములన్నీ తీసుకున్నరు. మా బతుకులన్నీ కరాబైనయ్. మా ఊరికి పిల్లనిచ్చేటోళ్లు లేరు. ఈడి పిల్లను చేసుకునేటోళ్లు లేరు. ఇక్కడ పనిలేదు. అవతల కైకిలి లేదు. తిప్పలయితంది. మీరన్న న్యాయం చేసి మా భూములకు మంచి ధర కట్టియ్యాలె. సతీశ్‌కుమార్ : మీకు ఇళ్ల స్థలాలు ఎక్కడ చూపించారు? బోడ మల్లారెడ్డి : ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జప్పన ఇయ్యాలె. రామవంబోటికి ఇండ్లు ఇత్తమని అంటండ్రు. జంగల్ల ఉండుమంటే మాకు దిక్కెవడు. దీమెవలు. జంగల్ల కాకుండా ఊరికి దగ్గరన్న కాడ జాగలు ఇయ్యాలె. సతీశ్‌కుమార్ : ఇళ్ల డబ్బులు ఎంతమందికి రాలేదు? బొజ్జపురి బాబు : ఇళ్లకు డబ్బులు ఇస్తమని అంటండ్రు గనీ... ఇచ్చుడయితే లేదు. 687 ఇండ్లకు పైసలియ్యాలె. ఇళ్లకు అవార్డు కూడా సేసిండ్రు. పైసలు వచ్చినయని సెప్పుతండ్రు గనీ... ఇప్పటిదాకా ఇయ్యలే. సతీశ్‌కుమార్ : గవర్నమెంట్ స్కీంలు అందుతున్నాయా? కంప రవి : ఎవుసం పోయింది. చేద్దామంటే పని కూడా లేదు. ఈడ పనిలేదని పట్నం పోతే ఇక్కడి రేషన్కారట్ తీసేసిండ్రు. పని లేకనే పోతిమి. కారట్ తీసేత్తె ఎట్ల? గిట్ల సర్కారోళ్లు మమ్ములను కష్టపెడుతండ్రు. సతీశ్‌కుమార్ : మీ డిమాండ్లేంటి? గుర్రం ఎల్లారెడ్డి : మా భూములకు అప్పుడు రెండు లచ్చల పదివేలు ధర కట్టిండ్రు. కానీ, పైసలియ్యలె. ఇప్పుడు కొత్త రేట్లు కట్టిత్తమని అంటండ్రు. మా ఇండ్లకు కూడా కొత్త రేట్లు కట్టియ్యాలె. కొత్త జీవోను మాకూ వర్తింపజేయాలె. సతీశ్‌కుమార్ : పరిహారం విషయమై అధికారులేమంటండ్రు? నల్ల మహేందర్‌రెడ్డి : నాలుగెకరాల భూమి ఉంటే డ్యాంల రెండెకరాలు పోయింది. పైసలు ఇప్పటిదాక ఇయ్యలె. ఎవలను అడిగినా సప్పుడు జేత్తలేరు. మా భూమినంత అంగడంగడి సేసిండ్రు. జర మీరే మాకు పైసలు ఇప్పియ్యాలె. సతీశ్‌కుమార్ : మీ ఊరికి ఏం కావాలె? తాట్ల యాదమ్మ, సర్పంచ్ : మా ఊరి జనానికి గవర్నమెంట్ సాయం జెయ్యాలె. మీరు మా ఊరోళ్లకు అండగా ఉంటే మా ఇబ్బందులన్నీ పోతయ్. సతీశ్‌కుమార్ : మీ కష్టాలు ఎవరికన్నా చెప్పారా? పిట్టల జ్యోతిబస్ : మా కష్టాలు ఎందరికి ఎన్ని మాట్ల సెప్పినమో లెక్కలేదు. మాది పన్నెండెకరాల ఎవుసం. మూడు బాయిలు... ఒక బోరు. మొత్తం డ్యాంల పోయినయ్. పైసలు మాత్రం ఇంకా ఇయ్యలె. స్పెషల్ కలెక్టర్ దగ్గరికి పోతే ఓఎస్డీ అంటండు. మంత్రి దగ్గరికి పోతే పైసలు ఇత్తమని చెప్పిండు. ఇప్పటికి మా ఊళ్లె 36 కోట్లు పంచాలె. ఇండ్ల పైసలు కూడా ఇత్తలేరు. దయచేసి మమ్ముల్ని ఆదుకోండ్రి.