ఆగమైన బతుకులు | Never missed a drought. | Sakshi
Sakshi News home page

ఆగమైన బతుకులు

Published Mon, Dec 29 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

ఆగమైన బతుకులు

ఆగమైన బతుకులు

అదో మెట్టప్రాంతం.. ఎప్పుడూ కరువు ఛాయలే. జలయజ్ఞంలో భాగంగా అక్కడ రిజర్వాయర్ కడుతున్నారని తెలిసి రైతులు ఎంతో సంతోషించారు. సాగునీటితో భూములన్నీ సారవంతమవుతాయని, తాము నష్టపోయినా... మిగతా రైతులన్నా బాగుపడతారని భావించి తమ ఇళ్లు, భూములు అప్పగించారు. అలా గౌరవెల్లి రిజర్వాయర్‌కు పునాదిరాయి పడి ఇప్పటికి ఆరేళ్లయింది. అధికారులు పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పేరిట ఊరినంతా బొందలగడ్డలు చేశారు. ఇళ్లచుట్టూ మట్టి తవ్వారు.
 
  వానాకాలం ఇళ్ల చుట్టూ నీరు చేరి బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఆ ఊరితో అనుబంధాన్ని పెంచుకుని, మట్టిలో మట్టిగా బతుకుతున్న ఆ కష్టజీవులను ఇప్పుడు కదిలిస్తే ఉబికివస్తున్న కన్నీళ్లు... పంటిబిగువున అణుచుకున్న బాధలే కనిపిస్తాయి. ఊళ్లో పనిలేక... పైసలు లేక మరెక్కడికీ పోలేక వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి ముంపు బాధితుల హృదయాలను తడిమారు. వారి గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
 
 న్యాయం చేస్తాం
 జలయజ్ఞంలో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టుకు అనుసంధానంగా 2007లో గౌరవెల్లి, గండిపెల్లి, ఓగుళాపూర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు గడిచినా ఇంకా మధ్యమానేరు ప్రాజెక్టు పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఈ నియోజకవర్గంలో లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఓగులాపూర్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ తట్టెడు మట్టి కూడా తియ్యలేదు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు వచ్చిన ప్రాంతానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని నిర్ణయించినందున పరిహారం పంపిణీ చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఇళ్లకు సైతం రూ.36 కోట్లు మంజూరయ్యాయి. ఇళ్లు కోల్పోతున్నవారికి డబ్బులు అందించేలా కృషి చేస్తాం. పొలాల్లోనే ఇళ్లు కట్టుకున్న విషయంలో అధికారులను పంపించి పరిశీలన చేసి అందరికీ డబ్బులు వచ్చేలా చూస్తాం. అందరికీ న్యాయం చేస్తాం.
 - వొడితెల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
 
 గ్రామస్తుల డిమాండ్లు
 వ్యవసాయ భూములకు నూతన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలి. ఆంధ్రాలో లాగా ఎకరానికి రూ.25 లక్ష లు చెల్లించాలి. భూసేకరణ పూర్తిస్థాయిలో చేపట్టి రైతులకు పరిహారం అందించాలి.మునుగుతున్న ఇళ్ల ధరలను పెంచి జనవరి లోగా అందరికీ డబ్బులు పంపిణీ చేయాలి.ముంపు గ్రామంలోని అందరికీ ఒకేచోట నివాసాలు ఏర్పాటు చేయాలి.ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలి.ప్రతీ ఇంటికో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కల్పించాలి.
 
 వొడితెల సతీశ్‌కుమార్ : మీ పేరేంటయ్యా?
 బొడిగ బాలయ్య : నా పేరు బొడిగ బాలయ్య సార్. మాకు మస్తు బాధలున్నయ్ సారు. ఐదేళ్లకిందట డ్యాం కడుతమని మట్టి తీసిండ్రు. మాకు పైసలు మాత్రం ఇయ్యలే. తవ్వుకున్న బాయిలు పోయినయ్. పత్తి ఏత్తే వానలు కొట్టి మొత్తం నట్టమైనా మాకు పైసలు ఇయ్యరట. మిమ్నల్ని ఎవుసం ఎవలు చేసుకొమ్మన్నరని మామీదికే గరమైతండ్రు. డ్యాంల మునిగిపోతున్నయని బ్యాంకోల్లు లోన్లు కూడా ఇత్తలేరు. మమ్ముల్ని బతుకుమంటరా? సావుమంటరా?
 సతీశ్‌కుమార్ : మీ ఇబ్బందులేంటి?
 బొడిగె కొంరయ్య : ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి ఆరేళ్లయింది. ముగ్గురు ఎమ్మెల్యేలు మారిండ్రు. ముగ్గురు ఆర్డీవోలు, ముగ్గురు ఎమ్మార్వోలు మారిండ్రు. తెనుగపల్లె, గుడాటిపల్లోళ్లకు ఇండ్ల జాగలు చూపిత్తమని చెప్పిండ్రు. ఇండ్ల జాగలు ఇయ్యలె. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కూడా మంచిగ చేత్తలేరు. గవర్నమెంట్‌కు చెప్పినం. స్పెషల్ కలెక్టర్ దగ్గరికి పోతే పైసల్ వచ్చినయని చెప్పిండ్రు. ఇత్తరని ఆశపడ్డం కానీ, ఇప్పటిదాకా ఇయ్యలే. లక్షలు పెట్టినా గిట్లాంటి భూమి దొరకదు. ఈ భూములకు ఎకరానికి పది లక్షలు ఇయ్యాలె.
 
 సతీశ్‌కుమార్ :  ఏం పనులు చేసుకుంటున్నరు?
 బొడిగె మల్లయ్య : ఇరవై ఏండ్లనుంచి డ్యాం వస్తంది... డ్యాం వస్తంది అన్నరు. వైఎస్ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టి పని మొదలువెట్టిండు. ఆరేండ్లయింది. ఇప్పటిదాకా పని పూర్తికాలె. డ్యాంల పోని పొలాలను అమ్ముదామంటే కొనేటోళ్లు లేరు. ఎవుసం లేదు. ఏం లేదు. పనికిపోదామంటే ఇక్కడ ఏం పనిలేకుండా అయ్యే. ఎట్లాగూ డ్యాంల మునుగుతందని ఉపాధి పని కూడా ఈడ ఇత్తలేరు. ఊర్లపొంట తిరిగి పనులు చేత్తన్నం. మమ్ముల్ని ముంచుతరో... తేల్తరో తెల్తలేదు.
 
 సతీశ్‌కుమార్ : భూములకు ఏం ఇవ్వాలే?
 ఎల్లరెడ్డి : బాయిలు, బొందలు తవ్వుకుని పొలాలన్నీ అచ్చుగట్టుకున్నం. డ్యాం వత్తదని సెప్పి మెల్లమెల్లగ బుదురకిచ్చి మా భూములన్నీ తీసుకున్నరు. మా బతుకులన్నీ కరాబైనయ్. మా ఊరికి పిల్లనిచ్చేటోళ్లు లేరు. ఈడి పిల్లను చేసుకునేటోళ్లు లేరు. ఇక్కడ పనిలేదు. అవతల కైకిలి లేదు. తిప్పలయితంది. మీరన్న న్యాయం చేసి మా భూములకు మంచి ధర కట్టియ్యాలె.
 
 సతీశ్‌కుమార్ : మీకు ఇళ్ల స్థలాలు ఎక్కడ చూపించారు?
 బోడ మల్లారెడ్డి : ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జప్పన ఇయ్యాలె. రామవంబోటికి ఇండ్లు ఇత్తమని అంటండ్రు. జంగల్ల ఉండుమంటే మాకు దిక్కెవడు. దీమెవలు. జంగల్ల కాకుండా ఊరికి దగ్గరన్న కాడ జాగలు ఇయ్యాలె.
 
 సతీశ్‌కుమార్ : ఇళ్ల డబ్బులు ఎంతమందికి రాలేదు?
 బొజ్జపురి బాబు : ఇళ్లకు డబ్బులు ఇస్తమని అంటండ్రు గనీ... ఇచ్చుడయితే లేదు. 687 ఇండ్లకు పైసలియ్యాలె. ఇళ్లకు అవార్డు కూడా సేసిండ్రు. పైసలు వచ్చినయని సెప్పుతండ్రు గనీ... ఇప్పటిదాకా ఇయ్యలే.
 
 సతీశ్‌కుమార్ : గవర్నమెంట్ స్కీంలు అందుతున్నాయా?
 కంప రవి : ఎవుసం పోయింది. చేద్దామంటే పని కూడా లేదు. ఈడ పనిలేదని పట్నం పోతే ఇక్కడి రేషన్‌కారట్ తీసేసిండ్రు. పని లేకనే పోతిమి. కారట్ తీసేత్తె ఎట్ల? గిట్ల సర్కారోళ్లు మమ్ములను కష్టపెడుతండ్రు.
 
 సతీశ్‌కుమార్ : మీ డిమాండ్లేంటి?
 గుర్రం ఎల్లారెడ్డి : మా భూములకు అప్పుడు రెండు లచ్చల పదివేలు ధర కట్టిండ్రు. కానీ, పైసలియ్యలె. ఇప్పుడు కొత్త రేట్లు కట్టిత్తమని అంటండ్రు. మా ఇండ్లకు కూడా కొత్త రేట్లు కట్టియ్యాలె. కొత్త జీవోను మాకూ వర్తింపజేయాలె.
 
 సతీశ్‌కుమార్ : పరిహారం విషయమై అధికారులేమంటండ్రు?
 నల్ల మహేందర్‌రెడ్డి : నాలుగెకరాల భూమి ఉంటే డ్యాంల రెండెకరాలు పోయింది. పైసలు ఇప్పటిదాక ఇయ్యలె. ఎవలను అడిగినా సప్పుడు జేత్తలేరు. మా భూమినంత అంగడంగడి సేసిండ్రు. జర మీరే మాకు పైసలు ఇప్పియ్యాలె.
 
 సతీశ్‌కుమార్ : మీ ఊరికి ఏం కావాలె?
 తాట్ల యాదమ్మ, సర్పంచ్ : మా ఊరి జనానికి గవర్నమెంట్ సాయం జెయ్యాలె. మీరు మా ఊరోళ్లకు అండగా ఉంటే మా ఇబ్బందులన్నీ పోతయ్.
 
 సతీశ్‌కుమార్ : మీ కష్టాలు ఎవరికన్నా చెప్పారా?
 పిట్టల జ్యోతిబస్ : మా కష్టాలు ఎందరికి ఎన్ని మాట్ల సెప్పినమో లెక్కలేదు. మాది పన్నెండెకరాల ఎవుసం. మూడు బాయిలు... ఒక బోరు. మొత్తం డ్యాంల పోయినయ్. పైసలు మాత్రం ఇంకా ఇయ్యలె. స్పెషల్ కలెక్టర్ దగ్గరికి పోతే ఓఎస్డీ అంటండు. మంత్రి దగ్గరికి పోతే పైసలు ఇత్తమని చెప్పిండు. ఇప్పటికి మా ఊళ్లె 36 కోట్లు పంచాలె. ఇండ్ల పైసలు కూడా ఇత్తలేరు. దయచేసి మమ్ముల్ని ఆదుకోండ్రి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement