కృష్ణా జలాలపై తేల్చేదెప్పుడు? | river Krishna To In relation to the The original | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలపై తేల్చేదెప్పుడు?

Published Fri, Oct 16 2015 2:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కృష్ణా జలాలపై తేల్చేదెప్పుడు? - Sakshi

కృష్ణా జలాలపై తేల్చేదెప్పుడు?

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలకు సంబంధించి అసలు పాత్రధారి కేంద్ర ప్రభుత్వమేనని, వివాదం సృష్టించి నిశ్శబ్దంగా ఉంటే ఎలాగని కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ పెట్టుకున్న అర్జీపై కేంద్రం వైఖరేమిటని నిలదీసింది. దీనిపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలంటూ విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
 
కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. మళ్లీ అన్ని రాష్ట్రాల వాదనలు వినాలని లేదా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ల సి.పంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తొలుత తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.

‘‘కృష్ణా పరీవాహక ప్రాంతంలో మా జనాభా 24 శాతం ఉన్నా.. మాకు అందుతున్న నీరు 12.5 శాతమే. సాగునీరు అందుతున్న భూములూ తక్కువే. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు తిరిగి వినేలా చేయాలని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్-3 కింద కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాం. ఆ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం ఏడాదిలోపు చర్చల ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ దాన్ని పరిష్కరించాలి.

కానీ కేంద్రం అలా పరిష్కరించనందునే మేం సుప్రీంను ఆశ్రయించాం. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో మేం ఉన్నట్టే గానీ ఒక్క చుక్క నీరూ మాకు దక్కడం లేదు. ఐదు కోట్ల మంది ప్రజల దాహార్తి తీరాల్సి ఉంది. మా రైతుల జీవనాధారం ప్రశ్నార్థకమైపోయింది..’’ అని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై స్పందించిన జస్టిస్ మిశ్రా.. ‘‘మీ విభేదాలు ఎవరితో?’ అని ప్రశ్నించారు. పరీవాహక ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలతోనూ తమకు విభేదాలున్నాయని వైద్యనాథన్ బదులిచ్చారు.

దీంతో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-84 ప్రకారం నదీ జలాల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ వింటుంది కదా?’ అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. ఆ కౌన్సిల్‌కు తగిన పరిధి లేదని వైద్యనాథన్ వివరించారు. ‘సెక్షన్-89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్యే వివాదం పరిష్కరించాల్సి ఉంది కదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా... ‘‘ప్రాజెక్టు వారీ నిర్దిష్ట కేటాయింపులు జరపాలని సెక్షన్-89 చెబుతోంది. కానీ పైరాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరపని పరిస్థితుల్లో కేవలం ఏపీ, తెలంగాణ మధ్యే ఎలా చేస్తారు?’’ అని న్యాయవాది వివరించారు.

దీనికి జస్టిస్ మిశ్రా ఏకీభవిస్తూ ‘సెక్షన్ 89 పరిమితంగా ఉంది. మీరు మీరు కొట్లాడుకోండి అన్న రీతిలో ఉంది..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ‘మీరు తెలంగాణకు మద్దతు ఇస్తున్నారా? విభేదిస్తున్నారా?’ అని ఏపీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘మహారాష్ట్ర, కర్ణాటకలతో పోరాడాల్సి వస్తే ఇద్దరం కలిసి పోరాడతాం..’ అని చెప్పారు.
 
నష్టపోతున్నాం..
వైద్యనాథన్ వాదన వినిపిస్తూ.. ‘‘ఐదు కోట్ల మంది దాహార్తి తీరాల్సి ఉంది. మా గొంతుక వినిపించే వేదిక ఇవ్వాలని అడుగుతున్నాం. మహారాష్ట్ర 150 టీఎంసీలను విద్యుదుత్పత్తి కోసం వాడుకుని సముద్రంలోకి వృథాగా వదులుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రాష్ట్రం వాడుతున్న నీళ్లలో 65 శాతందాకా నది బేసిన్‌లో లేని ప్రాంతాలకు మళ్లిస్తోంది. కర్ణాటక కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మా అవసరాలను గుర్తించలేదు. నీళ్లు, నియామకాల కోసమే రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు కూడా మా గొంతుక వినిపించని పక్షంలో మాకు రాష్ట్రం వచ్చి ప్రయోజనమేమిటి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
వివాదం సృష్టించి నిశ్శబ్దంగా ఉంటే ఎలా?
ఈ సందర్భంలో జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. ‘తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై మీ వైఖరి ఏమిటి?’ అని కేంద్రం తరఫు న్యాయవాది మోహనను ప్రశ్నించారు. దీంతో ‘‘సెక్షన్ 89 ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. తమ పరిధి ఏమిటని ఆ ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని కూడా అడిగింది. సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ, ఏపీల మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరపాల్సి ఉందని కేంద్రం చెప్పింది..’’ అని మోహన వివరించారు.

దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు వివాదాన్ని సృష్టించి నిశ్శబ్దంగా ఉంటే ఎలా? అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం-1956లోని సెక్షన్-3 కింద కేంద్రానికి తెలంగాణ పెట్టుకున్న అర్జీపై మీ వైఖరి ఏమిటి?.. మీరే ప్రధాన పాత్రధారి. మీ వైఖరి స్పష్టంగా ఉండాలి..’’ అని పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణలో తగిన అఫిడవిట్ దాఖలు చేస్తామని మోహన బదులిచ్చారు. అనంతరం కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ వాదిస్తూ.. ఈ వివాదం రెండు కొత్త రాష్ట్రాల మధ్యేనని పేర్కొన్నారు.

మహారాష్ట్ర తరపు న్యాయవాది అంధ్యార్జున వాదిస్తూ.. ‘‘150 టీఎంసీలు విద్యుదుత్పత్తికి వాడుతున్నారంటూ తెలంగాణ చేసిన వ్యాఖ్యలకు ఈ పిటిషన్‌కు సంబంధమేంటి?’’ అని ప్రశ్నించారు. దీనికి వైద్యనాథన్ బదులిస్తూ అన్నీ రికార్డుల్లో ఉన్నవే చెప్పానని వివరించారు. రెండు గంటల పాటు వాదనలు జరిగిన అనంతరం ధర్మాసనం విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement