
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్
న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో పదవీవిరమణ పొందననున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్‌కు అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయి. దేశంలోని అత్యంత కీలకమైన, భారీ ట్రిబ్యునల్‌కు అమితవ రాయ్ చైర్మన్‌గా నియమితులవుతారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సంకేతాలిచ్చారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ)ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన సుప్రీంకోర్టు బాధ్యతలనుంచి రిటైరవటం బాధాకరం.
కానీ ఆయన సేవలను మనం వదులుకోలేం. త్వరలోనే ఓ కీలకమైన ట్రిబ్యునల్‌లో ముఖ్యమైన బాధ్యతలు అందుకోనున్నారు’ అని కేకే పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలపై ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయనున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు, ఎన్జీటీ చైర్మన్ స్వతంత్రకుమార్ పదవీకాలం కూడా ఇటీవలే ముగిసింది. కాగా, న్యాయమూర్తులందరూ ఐకమత్యంగా ఉండాలని.. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు కొన్ని శక్తులు పన్నుతున్న కుట్రను తిప్పికొట్టాలని వీడ్కోలు సమావేశంలో జస్టిస్ అమితవ కోరారు.