‘కృష్ణా’బేసిన్ వెలుపల ఉన్న పెన్నా, రామిలేరు, బుడమేరు, మూసి తదితర నదుల పరిధిలోని ప్రాంతాల్లో కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1)
క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఏపీ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : ‘కృష్ణా’బేసిన్ వెలుపల ఉన్న పెన్నా, రామిలేరు, బుడమేరు, మూసి తదితర నదుల పరిధిలోని ప్రాంతాల్లో కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) అనుమతించిన మేరకే ‘కృష్ణా’ జలాలను సాగుకు వినియోగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల పంపంకంపై కేడబ్ల్యూడీటీ–2లో గురువారం విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా ఏపీ తరఫున సాక్షి కేవీ సుబ్బారావు (నీటి పారుదల నిపుణులు)ను తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ముఖ్యంగా కృష్ణా బేసిన్ వెలుపల వినియోగిస్తున్న కృష్ణా జలాలు, పెన్నా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాలపై వైద్యనాథన్ ప్రశ్నలు సంధించారు. విచారణ అక్టోబరు 12, 13 తేదీలకు వాయిదా పడింది. ఈ రెండు రోజుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏపీ తరఫు సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఏపీ నుంచి ముగ్గురిని తెలంగాణ ప్రభుత్వం క్రాస్ ఎగ్జామిన్ చేయనుండగా.. తెలంగాణ నుంచి ముగ్గురిని ఏపీ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి, న్యాయవాది గుంటూరు ప్రభాకర్ హాజరయ్యారు.