ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీలు కట్టారా?
నిర్మాణంలో డిజైన్లను మార్చితే అప్రూవల్స్ తీసుకున్నారా?
బ్యారేజీల డిజైన్, క్వాలిటీ, నిర్మాణంలోని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో విడివిడిగా అయ్యర్ కమిటీ భేటీ
సమాచారంలోని నిజాల నిర్ధారణ కోసం వేర్వేరు విభాగాలతో క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది.
ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు.
డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం..
బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు.
కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు..
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్‌ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.
సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్
ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు.
జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్‌ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది.
మాజీ ఈఎన్సీలు దూరం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment