30న ‘కృష్ణా’ నీటిపై సుప్రీంలో విచారణ
* ఏపీ, కర్ణాటక పిటిషన్‌లపై వాదనలు
* తెలంగాణను ప్రతివాదిగా చేర్చడంతో హాజరుకానున్న రాష్ట్ర అధికారులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ)లపై ఈ నెల 30న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కర్ణాటక వేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా ఏపీతోపాటు తెలంగాణను సైతం చేర్చడంతో రాష్ట్రాధికారులు ఈ వాదనలకు హాజరుకానున్నారు.
ఏపీ తన ఎస్‌ఎల్పీలో బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలుచేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని...అందువల్ల దాన్ని కొట్టేసి, కొత్తగా తీర్పునిచ్చేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను అభ్యర్థించింది. నాలుగు రాష్ట్రాల వాదనలు విని నీటి పునఃపంపిణీ చేయాలని పిటిషన్‌లో కోరింది. అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఆ చట్టంలోని 5 (2) అధికరణ కింద వెలువరించిన తీర్పుపై మూడ్నెల్లలోగా సంబంధిత రాష్ట్రాల వివరణలు కోరి, వీటిపై విచారణ జరిపి తదుపరి నివేదికను 5 (3) అధికరణ కింద ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి.
ఈ తీర్పు, స్పష్టత, వివరణలను కలిపి కేంద్రం 6 (1) అధికరణ ప్రకారం గెజిట్‌ను ప్రచురించాల్సి ఉంటుంది. అయితే బ్రజేష్ ట్రిబ్యునల్ 5 (2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంను ఆశ్రయించగా, విచారణను కొనసాగించించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పును మాత్రం గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంను ఆశ్రయించి గెజిట్‌ను త్వరితగతిన ప్రచురించాలని కోరింది. ప్రస్తుత వివాదం కేవలం ఏపీ, తెలంగాణల మధ్యేనని చెబుతూ వస్తోంది.
తుది తీర్పును కలిపి గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. ఈ రెండు పిటిషన్లపై 30న సుప్రీంకోర్టు విచారించనుంది. కర్ణాటక పిటిషన్‌లో తెలంగాణను సైతం ప్రతివాదిగా చేర్చినందున వారు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి వాదనలు వినిపంచాలన్న దానిపై మంగళవారం నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. నీటి కరువు పరిస్థితుల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి తమకు నీటిని విడుదల చేయాలని, దిగువ రాష్ట్రమైన ఏపీకి మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తాము నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని తెలంగాణ పేర్కొంటోంది.
ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టుల నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని, కనుక అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని ట్రిబ్యునల్‌ను మళ్లీ కోరాలని అధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. కాగా, వచ్చే నెల 3న బాబ్లీ కేసు మరోమారు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణపై సుప్రీం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో తమకు అవకాశం ఇచ్చి ఏపీని తొలగించాలని తెలంగాణ కోరుతుండగా, తమనూ కొనసాగించాలని ఏపీ కోరుతోంది.