కేంద్ర మంత్రి ఉమాభారతికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2 సభ్యుడిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని నియమించడం సమ్మతం కాదని రాష్ట్రం కేంద్రానికి స్పష్టం చేసింది. ‘కృష్ణా’ నీటి కేటాయింపుల వివాదంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి చెందిన జడ్జినే సభ్యుడిగా నియమించడం ప్రాథమిక న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ప్రస్తుతం నామినేట్ చేసిన సభ్యుడి నియామకంపై పునరాలోచించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి సోమవారం లేఖ రాశారు.
‘ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా చేయాలి, నీటి లోటు ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్ ఎలా ఉండాలన్నది తేల్చాలి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు ఈ వివాదం కేవలం ఏపీ, తెలంగాణకే పరిమితం అంటున్నాయి. నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలని మేం (తెలంగాణ రాష్ట్రం) కోరుతున్నాం. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కర్ణాటక పిటిషన్‌లో భాగస్వామి అవుతుంది. ఈ సమయంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన జడ్జినే ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించడం సమ్మతం కాదు’ అని లేఖలో విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. న్యాయబద్ధమైన కేటాయింపులు జరగాలంటే జడ్జి నియామకాన్ని వెనక్కు తీసుకునేలా చూడాలని కోరారు.
కర్ణాటక జడ్జి సమ్మతం కాదు
Published Tue, Sep 22 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement