rammohan reddy
-
మీ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీ ఆర్కు మతిభ్రమించి సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రామ్మోహన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, కమల్‌తో కలిసి మాట్లాడారు. చెల్లెలు కవిత జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్‌కు బుర్ర పనిచేయడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారని, పార్లమెంటు ఎన్నికల్లో చేయడానికి కేటీఆర్ దగ్గర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. జేబుదొంగ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజల జేబులు కొట్టి దోచుకున్న రూ.వేల కోట్లను కల్వకుంట్ల కుటుంబం నుంచి కక్కిస్తామని చెప్పారు. ‘దొంగలు కాబట్టే చెల్లి తీహార్ జైల్లో ఉంది. నువ్వు కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. ఫోన్‌ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతోంది. ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరించి మీరు చేసిన వసూళ్ల జాబితా వస్తుంది సిద్ధంగా ఉండు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టలేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. -
'పోలీస్ కావాలనుకొని ఎమ్మెల్యేనయ్యాను'
తండ్రి ఆశయాలు.. నమ్మిన సిద్ధాంతాలను ఒంట బట్టించుకున్నారాయన. పోలీస్ అధికారి కావాలనే సంకల్పం చిన్ననాటి నుండే దృఢంగా ఉన్నా.. తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవకు అంకితమైన తన తండ్రీ, తమ్ముడు నక్సలైట్ల తూటాలకు బలవడంతో ఆరు నెలల పాటు మంచంపట్టారు. ప్రజాసంక్షేమం.. అభివృద్ధి గురించి తరచూ తన తండ్రి చెప్పిన మాటలు.. తపన ఆయన్ను ప్రశాంతంగా నిద్రపోనీయలేదు. తండ్రి ఆశయం కోసం.. జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన్ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. నాన్న ఆశయమే తన లక్ష్యమని చెబుతున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ఈ వారం పర్సనల్ టైం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మాది నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రం. నేను పుట్టింది అక్కడే అయినా తర్వాత మక్తల్‌లో స్థిరపడ్డాం. నాన్న చిట్టెం నర్సిరెడ్డి, అమ్మ సుమిత్రారెడ్డి. నాన్న స్వాతంత్య్ర సమరయోధులు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలందించారు. మేం ఇద్దరం అన్నదమ్ములం.. ఇద్దరు చెల్లెళ్లు. తమ్ముడు వెంకటేశ్వర్‌రెడ్డి ఇప్పుడు లేరు (చనిపోయారు). చెల్లెళ్లకు పెళ్లిళ్లయ్యాయి. 1986లో రంగారెడ్డి జిల్లాకు చెందిన సుచరితతో నాకు వివాహమైంది. మాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయి చాణక్యకు పెళ్లయింది. హైదారాబాద్‌లో ఎల్ఈడీ బల్బుల తయారీ కంపెనీ ఉంది. రెండో బాబు పృథ్వీష్ ఎంబీఏ చదివాడు. పోలీస్ అధికారి కావాలనే కోరిక తీరలే చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ అధికారి కావాలనే కోరిక ఉండె. పోలీసులను చూస్తే చాలు.. వారి స్థానంలో నేనున్నట్లు ఊహించుకునేవాడిని. ధన్వాడలో ఆరోతరగతి వరకు చదివా. ఉన్నత చదువుల కోసం 1970లో నాన్న మమ్మల్ని హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడే డిగ్రీ పూర్తి చేశా. అప్పటికే పోలీస్ కావాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. కానీ ఇంట్లో నన్ను పోలీస్‌గా కాకుండా ప్రజలకు సేవచేసే ఓ ప్రజాప్రతినిధిగా చూడాలనుకున్నారు. అప్పట్లో ఓ సారి ఎస్ఐ రిక్రూట్మెంట్లో పాల్గొన్నా రాలె. తర్వాత చదువు మానేసి 1984 నుంచి వ్యాపారంలోకి దిగా. నాన్న వెంట రాజకీయాల్లో తిరుగుతుంటే అసలు లీడర్ అంటే ఏంటో..? నాకు తెలిసింది. జనానికి బాగు చేయాలనే నాన్న తపన.. నాన్నపై జనానికి ఉన్న గౌరవ, మర్యాదలు నా దృష్టిని రాజకీయాలవైపు మళ్లించాయి. నా జీవితంలో అదో దుర్దినం అది ఆగస్టు 15, 2005.. స్వాతంత్య్ర దినం. ఆ రోజు దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జాతీయ పండుగ నిర్వహించుకుంటున్న సందర్భం. నారాయణపేటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మా నాన్న ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక ఎస్సీవాడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపుకాసిన నక్సలైట్లు కాల్పులు జరిపారు. వారి తూటాలకు నాన్న, నా తమ్ముడు వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు.. గన్మెన్లు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో ఆరు నెలల వరకు నేను కోలుకోలేక మంచానపడ్డా. భార్య సుచరిత, కుటుంబ సభ్యులు నన్ను వెన్నుతట్టి నడిపించారు. కాంగ్రెస్ అధిష్టానం నన్ను పిలిచి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది. అప్పుడు తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేనయిన. రెండోసారి 2014లో అదే పార్టీ నుంచే పోటీ చేసి మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచా. చివరికి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను 2016లో టీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది. ‘సంగంబండ’ సంతృప్తినిచ్చింది 2004లో మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగునీరందించేలా సంగంబండ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 2005లో ఆయన చనిపోయిన తర్వాత పనులు పడకేశాయి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచి కాల్వలు తవ్వించిన. 2009 ఎన్నికల్లో నేను ఓడిపోయాక ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2014లో గెలిచినా నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున నిధులు రాలేదు. 2016లో కేసీఆర్ పిలిచి నాన్న ప్రారంభించిన ప్రాజెక్టు పూర్తి చేద్దామన్నారు. టీఆర్ఎస్ చేరిన తర్వాత పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నాన్న ప్రారంభించిన పనులు పూర్తి కావడం సంతృప్తినిచ్చింది. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుంది ఎమ్మెల్యేగా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు చాలా మంది ముసలివాళ్లతో మాట్లాడతా. వారిలో సగానికి పైగా మంది నాతో వారి బాధలు చెప్తారు. వారు పడుతున్న ఇబ్బందులు వింటుంటే కళ్లలో నీళ్లొస్తాయి. కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను ఆఖరి మజిలీలోనైనా బాగా చూసుకోని వారి కొడుకులు, కూతుళ్లపై కోపం వస్తుంది. ఓ ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్న. అంతేకాదు ఉన్నత ఆశయాలు.. ప్రజాసేవే పరమావధిగా భావించిన నా తండ్రికి M öడుకుగా సమాజంలో ఆదరణకు నోచుకోని వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. నారాయణపేట ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలా? లేదా మహబూబ్నగర్లోనా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. జనంలో చైతన్యం వస్తోంది మా నాన్న సర్పంచ్‌గా.. సమితి ప్రెసిడెంట్‌గా.. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా ఎన్నో ఏళ్లపాటు ప్రజలకు సేవలందించారు. నేనూ నాన్నతో కలిసి ఎక్కువగా తిరిగేవాడిని.. పలు సందర్భాల్లో ఏదైనా పని ఉంటే తాను వెళ్లకుండా నన్ను పంపేవారు. అప్పట్లో ఏ ఊరికి వెళ్లినా.. అక్కడి పెద్ద మనిషిని పిలిచి మాట్లాడి వచ్చేవాళ్లం. ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఊరి పెద్ద మనుషులతో చర్చించేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమస్యలపై జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి చైతన్యం రావడం అభివృద్ధికి నాంది. కొండంత ధైర్యం రాజకీయ, వ్యక్తిగత జీవితంలో నాకెన్నో సమస్యలున్నాయి. తల్లిదండ్రులు ఉన్నంతకాలం నాకు ధైర్యానిచ్చేవారు. ఇప్పుడు నా బలం అంతా మా ఆవిడే. నాకు ఏ సమస్య వచ్చినా సుచరితతో చెప్తా. అర్ధాంగిగా నా కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది. నాన్న, తమ్ముడు చనిపోయినప్పుడు నేను మంచాన పడ్డా. జీవితంలో ఏదీ సాధించలేననే భావన ఉండేది. కానీ సుచరిత నన్ను మామూలు మనిషిని చేసింది. నాన్న మీద ఉన్న ప్రేమను జనానికి పంచాలని చెప్పింది. ఆమె నా భార్య కావడం అదృష్టంగా భావిస్తున్నా. మామయ్యే మార్గదర్శి.. మామయ్య అంటే మా ఆయనకు ఎంతో ఇష్టం. మామయ్యే ఆయనకు మార్గదర్శి. ఎప్పుడు.. ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక రూపంలో మామయ్య ప్రస్తావన కచ్చితంగా తెస్తారు. ఎప్పుడూ జనానికి ఏం చేయాలనే ఆలోచనలో మా ఆయన ఉంటారు. వారికి మంచి చేయాలనే నిస్వార్థ రాజకీయ కుటుంబానికి కోడలిగా అయినందుకు ఎంతో గర్వపడుతున్నా. ప్రజా జీవితంలో వ్యక్తిగతం అనే ప్రస్తావన రావొద్దనేది మా ఆయన భావన. ఎమ్మెల్యే అయిన తర్వాత కుటుంబానికి పరిమిత సమయమే కేటాయిస్తున్నారు. ప్రజాసేవలోనే ఎక్కువగా గడుపుతారు. అమెరికా తిరిగొద్దామని పదేళ్ల క్రితం నిర్ణయించుకున్నాం. అయినా ఇంతవరకు వెళ్లలేకపోయాం. వీసా గడువు పూర్తయ్యేలోగా అక్కడికి వెళ్లి రావాలని ఉంది. – సుచరిత, ఎమ్మెల్యే భార్య -
రుణమాఫీపై సీఎం మాటలు పచ్చి అబద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసిందన్న సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్ధమని సీఎల్పీ కార్యదర్శి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులందరికీ ఇంకా బ్యాంకుల్లో వడ్డీ అలాగే మిగిలి ఉందని, వడ్డీ మాఫీ చేస్తానని గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన సీఎం ఇప్పుడు రైతులెవరూ తమకు దరఖాస్తు పెట్టుకోలేదనడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు. బుధవారం సీఎం ప్రకటనతో రైతుల్లో కదలిక మొదలైందని, పరిగి ప్రాంతంలోని రైతులు తమ బ్యాంక్ ఖాతా లావాదేవీల వివరాలను తనకు పంపుతున్నారని ఆయన చెప్పారు. తనకు అందిన బ్యాంక్ స్టేట్మెంట్స్లో వడ్డీని రైతులే చెల్లించినట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తమ బ్యాంక్ స్టేట్మెంట్స్ అందించాలని కోరారు. రైతుల నుంచి వివరాలు అందాక అసెంబ్లీలో సీఎంకు అందజేస్తామని, వడ్డీ మాఫీపై ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోవాలని అన్నారు. -
'దుర్భాషలాడిన ఎమ్మెల్యేను తొలగించండి'
కరెంటు బిల్లు కట్టనందుకు పవర్ కట్ చేసిన లైన్మెన్ను దుర్భాషలాడిన పరిగి ఎమ్మెల్యే టీ రాం మోహన్ రెడ్డిను కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన్ మైనార్టీల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం బహిరంగ లేఖ రాసింది. పార్టీకి చెందిన కొంతమంది నేతలు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న దళిత బహుజన్లు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బహిరంగ సభలు విఫలమవడానికి ప్రధానకారణం పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డేనని చెప్పింది. ఒక సామాజికవర్గానికి రాం మోహన్ కొమ్ముకాయడం వల్లే చీలికలు వస్తున్నాయని పేర్కొంది. ఆయన ప్రవర్తన కారణంగా పార్టీలోని సీనియర్ నాయకులంతా వలసపోతున్నారని.. దళితల బహుజనుల సంగతి ప్రత్యేకంగా చెప్పవసరం లేదని లేఖలో తెలిపింది. రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి అధిష్టానం దృష్టికి తీసుకురాకతప్పడం లేదని.. పరిస్ధితి చేయిదాటిపోతోందని పేర్కొంది. గురువారం విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిని కులం పేరుతో రాం మోహన్ రెడ్డి దూషించారని తెలిపింది. ఎమ్మెల్యేను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. -
1200 పుస్తకాల్లో వైఎస్ చరిత్ర నిక్షిప్తం
ఆత్మకూరు రూరల్ వైఎస్ రాజశేఖరెడ్డి పేరులో ఉండే వైఎస్ అనే రెండు అక్షరాలు ఏమని సూచిస్తాయంటే చాలా మంది అది యెడుగూరి .. సందింటి .. అని చెప్ప గలుగుతారు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఆయన తండ్రి పుల్లారెడ్డిల ఇంటి పేరు యెడుగూరి మాత్రమే అని రామ్మోహన్ రెడ్డి చెప్పగలుగుతాడు. ఎందుకంటే పులివెందుల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన ఈయన వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమాని. వైఎస్ఆర్ జీవితంలో చదువు, వివాహం, రాజకీయ ప్రస్తానం.. పాదయాత్రలు ఒకటేమిటి సమస్త చరిత్రనంతా ఆయన 1200 పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. వివిధ పత్రికల్లో 1977 నుంచి అచ్చయిన వైఎస్ఆర్ కార్యక్రమాల క్లిప్పింగ్‌లన్నీ వరసగా చేర్చి అవసరమైన చోట నోట్స్ రాశారు. వైఎస్ఆర్ ఏడో వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్ఆర్ స్మతివనానికి వచ్చి రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను అనంతపురంలో నివసిస్తున్నానని చెప్పారు. స్మృతివనంలో వైఎస్ఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాల చిత్రాలను, ఆయన చరిత్రను ప్రదర్శనగా ఉంచాలన్నారు. వైఎస్ రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి పులివెందుల మండలంలోని బలపనూరు గ్రామంలో ఒక సందులో చివర ఇంట్లో నివసించడం వల్లే ఇంటి పేరులో ‘సందింటి ’అని వచ్చి చేరిందని ఆయన చెప్పారు. వైఎస్సార్ జీవితంలో తారసపడ్డ చాలా మంది వ్యక్తులను..వారి వారసులను కలిసి వారి అభిప్రాయాలను కూడా రికార్డు చేసినట్లు చెప్పారు. -
'అవసరం అయితే బిచ్చమెత్తుకుంట'
హైదరాబాద్: ఆఖరికి బిచ్చమెత్తుకుంటాం కానీ టీఆర్ఎస్ పార్టీలోకి మాత్రం వెళ్లబోమని కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. తాను రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటానని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు టీఆర్ ఎస్ పార్టీ తిలోదకాలిస్తోందని అన్నారు. కుటుంబంలో చిచ్చుపెట్టి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రామ్మోహన్‌రెడ్డి తో వెంటనే రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో విలువలున్న నేత తమ తండ్రి నర్సిరెడ్డి అని, రామ్మోహన్ రెడ్డి నిర్వాకంతో తన తండ్రి ఆత్మ క్షోభిస్తోంది. తనకు తన తండ్రి ఆశయాలకు రామ్మోహన్ రెడ్డి మచ్చతెచ్చారని అన్నారు. నియోజకవర్గం లో కార్యకర్తలెవరూ కూడా రామ్మోహన్ వెంట వెళ్ళలేదని అన్నారు. -
కర్ణాటక జడ్జి సమ్మతం కాదు
కేంద్ర మంత్రి ఉమాభారతికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2 సభ్యుడిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని నియమించడం సమ్మతం కాదని రాష్ట్రం కేంద్రానికి స్పష్టం చేసింది. ‘కృష్ణా’ నీటి కేటాయింపుల వివాదంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి చెందిన జడ్జినే సభ్యుడిగా నియమించడం ప్రాథమిక న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ప్రస్తుతం నామినేట్ చేసిన సభ్యుడి నియామకంపై పునరాలోచించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి సోమవారం లేఖ రాశారు. ‘ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా చేయాలి, నీటి లోటు ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్ ఎలా ఉండాలన్నది తేల్చాలి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు ఈ వివాదం కేవలం ఏపీ, తెలంగాణకే పరిమితం అంటున్నాయి. నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలని మేం (తెలంగాణ రాష్ట్రం) కోరుతున్నాం. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కర్ణాటక పిటిషన్లో భాగస్వామి అవుతుంది. ఈ సమయంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన జడ్జినే ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించడం సమ్మతం కాదు’ అని లేఖలో విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. న్యాయబద్ధమైన కేటాయింపులు జరగాలంటే జడ్జి నియామకాన్ని వెనక్కు తీసుకునేలా చూడాలని కోరారు. -
పాలమూరు బంద్
మహబూబ్‌నగర్: జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై దాడిని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే.. పార్టీ కార్యకర్తలు బస్సుల రాక పోకలను అడ్డుకుంటున్నారు. దీంతో పలు బస్‌డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలోని గద్వాల, అచ్చంపేట, షాద్‌నగర్, వనపర్తి, మహబూబ్‌నగర్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో జిల్లాలోని 9 డిపోలకు చెందిన 894 బస్సులు రోడ్డెక్కలేదు. -
'అధికారమదంతో గూండాయిజం సరికాదు'
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడిని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారమదంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూండాయిజం చేయడం సరికాదని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దాడి ఘటన స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే బాలరాజుపై కేసు నమోదు చేయాలని జానారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
అభివృద్ధే ధ్యేయం
దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు. కానీ ప్రస్తుతం ఆ పల్లెలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నాయి. అలాంటిదే మక్తల్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానస్థితిలో ఉన్నాయి. పారిశుద్ధ్యం పడకేసింది.. రాత్రివేళ దోమలబాధ అంతాఇంత కాదు. అనేక సమస్యలు తిష్టవేసిన లింగంపల్లిని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి స్థానికుల సమస్యలు తెలుసుని.. పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సంభాషణ ఇలా సాగింది. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి: అన్నా నమస్తే..! బాగున్నారా? పొలం లో ఏ పంట వేసినవ్? ఉప్పరి సాధు: ఎమ్మెల్యే సారూ బాగున్నాం. ఈ సారి పత్తి చేను వేసినం. పంట ఆశించినంతగా రాలేదు. పెట్టుబడి కూడా మీద పడ్డది. పండిన పంటకు రేటు కూడా సరిగా రావడంలేదు. రామ్మోహన్‌రెడ్డి: పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందా? ఉప్పరి సాధు: ఎక్కడ సారూ పేపర్ల క్వింటాలుకు రూ.4050 ఇస్తరంటున్నరు కానీ.. మార్కెట్ల ఆ రేటు రావడంలేదు. క్వింటాలుకు రూ.3,700 మాత్రమే అత్యధికధర పలుకుతుంది. పత్తిని మార్కెట్‌కు తీసుకుపోనికే బాగా ఇబ్బంది అవుతుంది. అది ఇదీ అంటూ మా నెత్తిననే ఏస్తరు. ఇట్లయితే రైతుకు ఏం లాభముండదు. రామ్మోహన్‌రెడ్డి: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మొన్ననే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడిన. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సరేనా..! అమ్మా మీరు చెప్పండి మీ ఇబ్బందులేంటి? కుర్వ సాబమ్మ: సారూ మాకు పింఛన్ ఇస్తలేరు. ఐదేండ్ల సంది ఇచ్చి ఇప్పుడేమో ఇస్తలేరు. సర్కారొళ్లను అడిగితే లేని లేని కానూలు తీస్తుండ్రు. మీరైనా వాళ్లకు చెప్పి పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. రామ్మోహన్‌రెడ్డి: ఏమ్మా.. మీరంతా కూడా పింఛన్ రానోల్లేనా? సూగమ్మ: అవును సారూ.. మాకు ఎవరికీ కూడా పింఛన్ రాలేదు. ఐదేండ్ల నుంచి ఇచ్చిన పింఛను ఇప్పుడెందుకు ఇయ్యరు. నాకు పింఛన్ బుక్ కూడా ఉంది. అయినా ఇయట్లేదు. నాకు కాళ్లు నడవనికే రావు.. నిలబడనికే రాదు. రామ్మోహన్‌రెడ్డి: మీకు భూమి ఎక్కువుందనో, లేదా మీ కొడుకులకు నౌకర్లు ఉన్నవని చెప్పి కట్ చేసిండ్రా ఎట్లా? హనుమంతు: అయ్యా.. నాకు ఆరుగురు కొడుకులున్నరు. నాకు ఏడున్నర ఎకరాలుంది. అది మొ త్తం వాళ్లే దున్నుకుని బతుకుతున్నరు. నాకు ఎవ రు కూడా పెడ్తలేరు. మొన్నటి దాకా 200 రూపా లు పింఛన్ వస్తే కాసింత ఆసరా ఉండేది. ఇప్పు డు పింఛన్ బంద్ చేసిండ్రు. కొడుకులు పట్టించుకుంటలేరు. రేషన్‌కార్డును కూడా తీసేసిండ్రు. రామ్మోహన్‌రెడ్డి: ఏం సర్పంచ్‌గారు ఇంతమందికి పింఛన్లు బంద్ అయితే మీరెందుకు అడగలేదు? మొదట్లో ఎంత మందికి పింఛన్లు వస్తుండే... ఇప్పుడు ఎంత మంది ఉన్నరు? వెంకట్రాములు గౌడ్: అన్నా..! సారొళ్లకు ఎంత చెప్పినా వింటలేరు. గతంలో లింగంపల్లిలో పింఛలన్నీ కలిపి 200 వరకు ఉండేవి. ఇప్పుడు 114 మందికి మాత్రమే మంజూరు చేసిండ్రు. విచారణకు వచ్చిన ఆఫీసరు అందరికీ కోత విధించిండు. రేషన్‌కార్డులు కూడా 600 ఉంటే, ఇప్పుడు 300లే మంజూరైనయి. నేను మస్తుగా చెప్పి చూసినా వినలేదు. కొడుకులు ఏరువడి అలగ బతుకుతున్నా.. అందరినీ కలిపి సమగ్ర కుటుంబ సర్వే అని అందరికీ కోత విధించిండు. ప్రభుత్వం చేస్తున్న పనులకు పబ్లిక్, మేము చాన ఇబ్బంది పడుతున్నం. రామ్మోహన్‌రెడ్డి: సరే ఈ పింఛన్ల లొల్లి చాన పెద్దగా ఉంది. నేను మాట్లాడుత గానీ... ఊళ్లో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలున్నాయి? పిల్లలు ఎంత మంది ఉంటరు? వెంకట్రాములుగౌడ్: ఈ ఊళ్లో రెండున్నాయి. పిల్లలు నాకు కరెక్టుగా తెల్వదు గానీ.. వంద వరకు ఉండొచ్చు. అన్నా.. అంగన్వాడీ ఈ పక్కనే ఉంది. చూద్దాం పదా..! రామ్మోహన్‌రెడ్డి: ఏమ్మా మీ సెంటర్లో ఎంత మంది పిల్లలు ఉన్నరు. వారికి మెనూ ప్రకారం ఇస్తుండ్రా? భాగ్యలక్ష్మి: సార్.. మా దగ్గర మొత్తం 36 మంది పిల్లలు ఉన్నారు. వారికి ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని కూడా అందజేస్తున్నాం. పిల్లలకు ఇక్కడే వండి పెడుతున్నాం. గర్భిణలుకు ఇంటికి పంపిస్తున్నాం. రామ్మోహన్‌రెడ్డి: ఏమ్మా మధ్యాహ్న భోజనాలు పిల్లలకు మంచిగా పెడుతుండ్రా? లేదా? సుశీలమ్మ(మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు): ఎమ్మెల్యే సారూ.. మేం అట్లాఇట్లా కాదు. మా వంటలు సూపర్ ఉంటయి. రామ్మోహన్‌రెడ్డి: ఏం పాప మీకు మధ్యాహ్నభోజనం మంచినగనే పెడుతున్నారా? వారం వారం గుడ్డు ఇస్తారా? సుధ: మంచిగనే పెడుతరు. గుడ్డు కూడ ఇస్తరు. రామ్మోహన్‌రెడ్డి: నేను ఎవరో మీకు తెలుసా? జయశ్రీ: తెలుసు.. నీవు మా ఎమ్మెల్యేవు.. రామ్మోహన్‌రెడ్డి సారు కదూ! రామ్మోహన్‌రెడ్డి: గుడ్.. లింగంపల్లి పిల్లలు ఉషారుగా ఉన్నరు. ఏం హెడ్మాస్టర్ గారు.. స్కూల్లో ఎలాంటి సమస్యలున్నాయి? దేవేంద్రప్ప: పాఠశాలకు ప్రధానంగా ప్రహరీ గోడ లేదు. తాగునీటి సౌకర్యం లేదు. విద్యార్థు ల సంఖ్యాపరంగా చూస్తే టాయిలెట్ల రూంలు సరిపడా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రామ్మోహన్‌రెడ్డి: ఏం పెద్దాయన నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొప్పుల హనుమంతు: ఏం చెప్పమంటవు సారూ... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడత ది. నీకు తెల్వంది ఏముంది. మాకు ఇళ్లు బిల్లు లు రాక చాన ఇబ్బంది అవుతుంది. బయట అ ప్పు పుడతలేదు. రెండు రూంలు వేసుకుందమంటే సర్కారొళ్లు పైసలు ఇస్తలేరు. తిరిగి, తిరి గి అలిసిపోతున్నా. కొద్దిగ మీరైనా కొట్లాడి నాకు ఇళ్లు పైసలు ఇప్పియిండ్రి. రామ్మోహన్‌రెడ్డి: చెప్పండమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నర్సమ్మ: మా చేన్ల కాడికి పోనింకె బాటనే లేదు. చాన ఇబ్బంది అవుతుంది. బండిబాట లేక గిం జలు తీసుకొచ్చుకోనింకే కూడా ఇబ్బింది పడుతున్నం. రామ్మోహన్‌రెడ్డి: ఊళ్లో కరెంట్ ఉంటదా? వ్యవసాయానికి ఏడు గంటల పాటు కరెంట్ ఇస్తున్నారా? ఉప్పరి తిప్పన్న: సారూ.. కరెంట్ చాన సమస్య అయింది. అది ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వదాయే. ఈ సారి కరెంటు సరిగా లేక పంటలు పాడయ్యాయి. ఇళ్లకు అయితే పొద్దుగాల పోతే మళ్లీ పొద్దుమిక్కల ఇడుస్తరు. ఒక్కోసారి రాత్రిపూట కూడా కరెంట్ ఉండదు. రామ్మోహన్‌రెడ్డి: ఊళ్లో తాగనీకే నీళ్లు ఉన్నాయా? సోమప్ప: నీళ్లు అవో, ఇవో వస్తయి కాని, ఈ మొరీలు చూడండి. ఎట్ల తయారైయి. నడవనిం కె రాదు. ఏడాదంతా పారుతనే ఉంటది. రాత్రిపూట దోమలకు తట్టుకోలేక సచ్చిపోతున్నం. రామ్మోహన్‌రెడ్డి: సర్పంచ్ గారు గ్రామానికి ఏం నిధులు రాలేదా? వెంకట్రాములు గౌడ్: లేదు సార్. 13వ ఆర్థిక సంఘం కింద కొన్ని నిధులు వచ్చినయి. వాటిని చిన్న చిన్న పనులు చేసినం. రామ్మోహన్‌రెడ్డి: ఊళ్లో ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి? వెంకట్రాములుగౌడ్: సార్.. ఊరి చెరువు మరమ్మతు చేయాలె. 250 ఎకరాలకు సాగునీరు అందించే చెరువు.. సరిగా పట్టించుకోక చెరువు మొత్తం పూడిపోయింది. కంపచెట్లు మొలిచినవి. ఊళ్లో బోర్లు వేద్దామన్నా 15 నుంచి 20 ఫీట్ల లోతున మొత్తం బండ ఉంది. ఊరి మొత్తంలో మూడు బోర్లు మాత్రమే ఉన్నయి. కాస్త చెరువు పూడిక తీపిస్తే బాగుపడుతం. రామ్మోహన్‌రెడ్డి: ఇప్పటికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువులను పూడిక తీపిస్తమని చెప్పింది. త్వరలో పనులు మొదలవుతయి. చెరువుల నుంచి తీసిన ఒండు మట్టిని పొలాలకు తరలించండి. పంటలు కూడా మంచిగ పండుతయి. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హామీలు లింగంపల్లి ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోయింది. ఎమ్మెల్యేగా ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకునేందుకు అండగా ఉంటాను. డ్రైనేజీ, సీసీరోడ్లు, తాగునీరు, వీధిలైట్ల వంటి సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తా.ఈ ఊరి రైతులు రైల్వేలైన్‌లో భూములు కోల్పోయారు. వీరికి వెంటనే పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటా. గ్రామంలో చాలామందికి అర్హత ఉన్నా పింఛన్లు రాకపోవడం దురదృష్టకరం. వారందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటా.