'దుర్భాషలాడిన ఎమ్మెల్యేను తొలగించండి'
Published Fri, Mar 3 2017 9:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కరెంటు బిల్లు కట్టనందుకు పవర్ కట్ చేసిన లైన్‌మెన్‌ను దుర్భాషలాడిన పరిగి ఎమ్మెల్యే టీ రాం మోహన్ రెడ్డిను కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన్ మైనార్టీల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శుక్రవారం బహిరంగ లేఖ రాసింది. పార్టీకి చెందిన కొంతమంది నేతలు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న దళిత బహుజన్‌లు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బహిరంగ సభలు విఫలమవడానికి ప్రధానకారణం పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డేనని చెప్పింది.
ఒక సామాజికవర్గానికి రాం మోహన్ కొమ్ముకాయడం వల్లే చీలికలు వస్తున్నాయని పేర్కొంది. ఆయన ప్రవర్తన కారణంగా పార్టీలోని సీనియర్ నాయకులంతా వలసపోతున్నారని.. దళితల బహుజనుల సంగతి ప్రత్యేకంగా చెప్పవసరం లేదని లేఖలో తెలిపింది. రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి అధిష్టానం దృష్టికి తీసుకురాకతప్పడం లేదని.. పరిస్ధితి చేయిదాటిపోతోందని పేర్కొంది. గురువారం విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిని కులం పేరుతో రాం మోహన్ రెడ్డి దూషించారని తెలిపింది. ఎమ్మెల్యేను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
Advertisement
Advertisement