సాక్షి, పరిగి: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ ప్రాభవం రోజురోజుకూ తగ్గుతోంది. కనుచూపు మేరలో కూడా తమ పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో ప్రధాన నాయకులు హస్తం వీడి కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చేవెళ్ల పరిధిలో 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎలక్షన్ల వరకు నమోదైన ఓటింగ్ సరళిని చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఇట్టే తెలిసిపోతుంది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హవాలో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ చేవెళ్ల లోక్‌సభ పరిధిలో పూర్తి ఆధిక్యాన్ని కనబర్చి విజయం సొంతం చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చే వరకు 2009 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 90 వేల పైచిలుకు ఓట్లకు గండిపడింది.
2009లో కాంగ్రెస్ హవా....
2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఆవిర్భవించింది. 2009లో సార్వత్రిక ఎన్నికలు జరగగా ఇద్దరు ఉద్దండులైన స్థానికేతర నేతలు ఇక్కడ బరిలో దిగారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సూదిని జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో నిలవగా.. టీఆర్‌ఎస్, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా జితేందర్‌రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్‌రెడ్డి 18,532 ఓట్ల మెజార్టీతో జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌కు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కలేదు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ పాగా వేశాయి.
2014లో సీన్ రివర్స్...
2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చే సరికి సీన్ పూర్తిగా మారిపోయింది. టీఆర్‌ఎస్ తరఫున ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇదే సమయంలో టీడీపీ తరఫున వీరేందర్‌గౌడ్ పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల మెజార్టీతో కార్తీక్‌రెడ్డిపై గెలుపొందారు. ఈ లెక్కన 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో కాంగ్రెస్ పార్టీలోని 90 వేల ఓట్లకు గండి పడింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి అధికార టీఆర్‌ఎస్ 1,43,900 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇలా రోజరోజుకు కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూవస్తోంది. ఇదే సమయంలో కారు జోరు పెరుగుతోంది.
కారుగుర్తు వర్సెస్ కొండా ఇమేజ్..
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా రెండు పార్టీల మధ్య లేదా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం చేవెళ్ల లోక్‌సభ స్థానంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా అధికార టీఆర్‌ఎస్ తరఫున పౌల్ట్రీ వ్యాపారి రంజిత్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్తున్నా.. కొండా మాత్రం తన సొంత ఇమేజ్‌ని నమ్ముకుంటున్నారు. ఎలాగైనా విజయం సా«ధించాలనే సంకల్పంతో వినూత్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే సరళిని అనుసరిస్తున్నారు. దీనికి తోడు టీఆర్‌ఎస్ తరఫున కొత్త అభ్యర్థి బరిలో దిగితే తనకు కొంత కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా కేసీర్ చరిష్మా, కారు గుర్తులే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు తమ పార్టీ అభ్యర్థికి విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment