
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసిందన్న సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్ధమని సీఎల్పీ కార్యదర్శి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులందరికీ ఇంకా బ్యాంకుల్లో వడ్డీ అలాగే మిగిలి ఉందని, వడ్డీ మాఫీ చేస్తానని గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన సీఎం ఇప్పుడు రైతులెవరూ తమకు దరఖాస్తు పెట్టుకోలేదనడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు.
బుధవారం సీఎం ప్రకటనతో రైతుల్లో కదలిక మొదలైందని, పరిగి ప్రాంతంలోని రైతులు తమ బ్యాంక్ ఖాతా లావాదేవీల వివరాలను తనకు పంపుతున్నారని ఆయన చెప్పారు. తనకు అందిన బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌లో వడ్డీని రైతులే చెల్లించినట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అందించాలని కోరారు. రైతుల నుంచి వివరాలు అందాక అసెంబ్లీలో సీఎంకు అందజేస్తామని, వడ్డీ మాఫీపై ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment