అభివృద్ధే ధ్యేయం | Development goal | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ధ్యేయం

Published Mon, Dec 22 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ధ్యేయం

దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు. కానీ ప్రస్తుతం ఆ పల్లెలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నాయి. అలాంటిదే మక్తల్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానస్థితిలో ఉన్నాయి. పారిశుద్ధ్యం పడకేసింది.. రాత్రివేళ దోమలబాధ అంతాఇంత కాదు. అనేక సమస్యలు తిష్టవేసిన లింగంపల్లిని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి స్థానికుల సమస్యలు తెలుసుని.. పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సంభాషణ ఇలా సాగింది.
 
 ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి: అన్నా నమస్తే..! బాగున్నారా?
 పొలం లో ఏ పంట వేసినవ్?
 ఉప్పరి సాధు: ఎమ్మెల్యే సారూ బాగున్నాం. ఈ సారి పత్తి చేను వేసినం. పంట ఆశించినంతగా రాలేదు. పెట్టుబడి కూడా మీద పడ్డది. పండిన పంటకు రేటు కూడా సరిగా రావడంలేదు.
 రామ్మోహన్‌రెడ్డి: పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందా?
 ఉప్పరి సాధు: ఎక్కడ సారూ పేపర్ల క్వింటాలుకు రూ.4050 ఇస్తరంటున్నరు కానీ.. మార్కెట్ల ఆ రేటు రావడంలేదు. క్వింటాలుకు రూ.3,700 మాత్రమే అత్యధికధర పలుకుతుంది. పత్తిని మార్కెట్‌కు తీసుకుపోనికే బాగా ఇబ్బంది అవుతుంది. అది ఇదీ అంటూ మా నెత్తిననే ఏస్తరు. ఇట్లయితే రైతుకు ఏం లాభముండదు.
 రామ్మోహన్‌రెడ్డి: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మొన్ననే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడిన. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సరేనా..! అమ్మా మీరు చెప్పండి మీ ఇబ్బందులేంటి?
 కుర్వ సాబమ్మ: సారూ మాకు పింఛన్ ఇస్తలేరు. ఐదేండ్ల సంది ఇచ్చి ఇప్పుడేమో ఇస్తలేరు. సర్కారొళ్లను అడిగితే లేని లేని కానూలు తీస్తుండ్రు. మీరైనా వాళ్లకు చెప్పి పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండి.
 రామ్మోహన్‌రెడ్డి: ఏమ్మా.. మీరంతా కూడా పింఛన్ రానోల్లేనా?
 సూగమ్మ: అవును సారూ.. మాకు ఎవరికీ కూడా పింఛన్ రాలేదు. ఐదేండ్ల నుంచి ఇచ్చిన పింఛను ఇప్పుడెందుకు ఇయ్యరు. నాకు పింఛన్ బుక్ కూడా ఉంది. అయినా ఇయట్లేదు. నాకు కాళ్లు నడవనికే రావు.. నిలబడనికే రాదు.
 రామ్మోహన్‌రెడ్డి: మీకు భూమి ఎక్కువుందనో, లేదా మీ కొడుకులకు నౌకర్లు ఉన్నవని చెప్పి కట్ చేసిండ్రా ఎట్లా?
 హనుమంతు: అయ్యా.. నాకు ఆరుగురు కొడుకులున్నరు. నాకు ఏడున్నర ఎకరాలుంది. అది మొ త్తం వాళ్లే దున్నుకుని బతుకుతున్నరు. నాకు ఎవ రు కూడా పెడ్తలేరు. మొన్నటి దాకా 200 రూపా లు పింఛన్ వస్తే కాసింత ఆసరా ఉండేది. ఇప్పు డు పింఛన్ బంద్ చేసిండ్రు. కొడుకులు పట్టించుకుంటలేరు. రేషన్‌కార్డును కూడా తీసేసిండ్రు.
 రామ్మోహన్‌రెడ్డి: ఏం సర్పంచ్‌గారు ఇంతమందికి పింఛన్లు బంద్ అయితే మీరెందుకు అడగలేదు? మొదట్లో ఎంత మందికి పింఛన్లు వస్తుండే... ఇప్పుడు ఎంత మంది ఉన్నరు?
 వెంకట్రాములు గౌడ్: అన్నా..! సారొళ్లకు ఎంత చెప్పినా వింటలేరు. గతంలో లింగంపల్లిలో పింఛలన్నీ కలిపి 200 వరకు ఉండేవి. ఇప్పుడు 114 మందికి మాత్రమే మంజూరు చేసిండ్రు. విచారణకు వచ్చిన ఆఫీసరు అందరికీ కోత విధించిండు. రేషన్‌కార్డులు కూడా 600 ఉంటే, ఇప్పుడు 300లే మంజూరైనయి. నేను మస్తుగా చెప్పి చూసినా వినలేదు. కొడుకులు ఏరువడి అలగ బతుకుతున్నా.. అందరినీ కలిపి సమగ్ర కుటుంబ సర్వే అని అందరికీ కోత విధించిండు. ప్రభుత్వం చేస్తున్న పనులకు పబ్లిక్, మేము చాన ఇబ్బంది పడుతున్నం.
 రామ్మోహన్‌రెడ్డి: సరే ఈ పింఛన్ల లొల్లి చాన పెద్దగా ఉంది. నేను మాట్లాడుత గానీ... ఊళ్లో ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి? పిల్లలు ఎంత మంది ఉంటరు?
 వెంకట్రాములుగౌడ్: ఈ ఊళ్లో రెండున్నాయి. పిల్లలు నాకు కరెక్టుగా తెల్వదు గానీ.. వంద వరకు ఉండొచ్చు. అన్నా.. అంగన్‌వాడీ ఈ పక్కనే ఉంది. చూద్దాం పదా..!
 రామ్మోహన్‌రెడ్డి: ఏమ్మా మీ సెంటర్లో ఎంత మంది పిల్లలు ఉన్నరు. వారికి మెనూ ప్రకారం ఇస్తుండ్రా?
 భాగ్యలక్ష్మి: సార్.. మా దగ్గర మొత్తం 36 మంది పిల్లలు ఉన్నారు. వారికి ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని కూడా అందజేస్తున్నాం. పిల్లలకు ఇక్కడే వండి పెడుతున్నాం. గర్భిణలుకు ఇంటికి పంపిస్తున్నాం.
 రామ్మోహన్‌రెడ్డి: ఏమ్మా మధ్యాహ్న భోజనాలు పిల్లలకు మంచిగా పెడుతుండ్రా? లేదా?
 సుశీలమ్మ(మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు): ఎమ్మెల్యే సారూ.. మేం అట్లాఇట్లా కాదు. మా వంటలు సూపర్ ఉంటయి.
 రామ్మోహన్‌రెడ్డి: ఏం పాప మీకు మధ్యాహ్నభోజనం మంచినగనే పెడుతున్నారా? వారం వారం గుడ్డు ఇస్తారా?
 సుధ: మంచిగనే పెడుతరు. గుడ్డు కూడ ఇస్తరు.
 రామ్మోహన్‌రెడ్డి: నేను ఎవరో మీకు తెలుసా?
 జయశ్రీ: తెలుసు.. నీవు మా ఎమ్మెల్యేవు.. రామ్మోహన్‌రెడ్డి సారు కదూ!
 రామ్మోహన్‌రెడ్డి: గుడ్.. లింగంపల్లి పిల్లలు ఉషారుగా ఉన్నరు.  ఏం హెడ్‌మాస్టర్ గారు.. స్కూల్‌లో ఎలాంటి సమస్యలున్నాయి?
 దేవేంద్రప్ప: పాఠశాలకు ప్రధానంగా ప్రహరీ గోడ లేదు. తాగునీటి సౌకర్యం లేదు. విద్యార్థు ల సంఖ్యాపరంగా చూస్తే టాయిలెట్ల రూంలు సరిపడా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 రామ్మోహన్‌రెడ్డి: ఏం పెద్దాయన నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
 కొప్పుల హనుమంతు: ఏం చెప్పమంటవు సారూ... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడత ది. నీకు తెల్వంది ఏముంది. మాకు ఇళ్లు బిల్లు లు రాక చాన ఇబ్బంది అవుతుంది. బయట అ ప్పు పుడతలేదు. రెండు రూంలు వేసుకుందమంటే సర్కారొళ్లు పైసలు ఇస్తలేరు. తిరిగి, తిరి గి అలిసిపోతున్నా. కొద్దిగ మీరైనా కొట్లాడి నాకు ఇళ్లు పైసలు ఇప్పియిండ్రి.
 రామ్మోహన్‌రెడ్డి: చెప్పండమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
 నర్సమ్మ: మా చేన్ల కాడికి పోనింకె బాటనే లేదు. చాన ఇబ్బంది అవుతుంది. బండిబాట లేక గిం జలు తీసుకొచ్చుకోనింకే కూడా ఇబ్బింది పడుతున్నం.
 రామ్మోహన్‌రెడ్డి: ఊళ్లో కరెంట్ ఉంటదా? వ్యవసాయానికి ఏడు గంటల పాటు కరెంట్ ఇస్తున్నారా?
 ఉప్పరి తిప్పన్న: సారూ.. కరెంట్ చాన సమస్య అయింది. అది ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వదాయే. ఈ సారి కరెంటు సరిగా లేక పంటలు పాడయ్యాయి. ఇళ్లకు అయితే పొద్దుగాల పోతే మళ్లీ పొద్దుమిక్కల ఇడుస్తరు. ఒక్కోసారి రాత్రిపూట కూడా కరెంట్ ఉండదు.
 రామ్మోహన్‌రెడ్డి: ఊళ్లో తాగనీకే నీళ్లు ఉన్నాయా?
 సోమప్ప: నీళ్లు అవో, ఇవో వస్తయి కాని, ఈ మొరీలు చూడండి. ఎట్ల తయారైయి. నడవనిం కె రాదు. ఏడాదంతా పారుతనే ఉంటది. రాత్రిపూట దోమలకు తట్టుకోలేక సచ్చిపోతున్నం.
 రామ్మోహన్‌రెడ్డి: సర్పంచ్ గారు గ్రామానికి ఏం నిధులు రాలేదా?
 వెంకట్రాములు గౌడ్: లేదు సార్. 13వ ఆర్థిక సంఘం కింద కొన్ని నిధులు వచ్చినయి. వాటిని చిన్న చిన్న పనులు చేసినం.
 
 రామ్మోహన్‌రెడ్డి: ఊళ్లో ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి?
 వెంకట్రాములుగౌడ్: సార్.. ఊరి చెరువు మరమ్మతు చేయాలె. 250 ఎకరాలకు సాగునీరు అందించే చెరువు.. సరిగా పట్టించుకోక చెరువు మొత్తం పూడిపోయింది. కంపచెట్లు మొలిచినవి. ఊళ్లో బోర్లు వేద్దామన్నా 15 నుంచి 20 ఫీట్ల లోతున మొత్తం బండ ఉంది. ఊరి మొత్తంలో మూడు బోర్లు మాత్రమే ఉన్నయి. కాస్త చెరువు పూడిక తీపిస్తే బాగుపడుతం.
 రామ్మోహన్‌రెడ్డి: ఇప్పటికే ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువులను పూడిక తీపిస్తమని చెప్పింది. త్వరలో పనులు మొదలవుతయి. చెరువుల నుంచి తీసిన ఒండు మట్టిని పొలాలకు తరలించండి. పంటలు కూడా మంచిగ పండుతయి.
 
 ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హామీలు
 లింగంపల్లి ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోయింది. ఎమ్మెల్యేగా ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకునేందుకు అండగా ఉంటాను.  డ్రైనేజీ, సీసీరోడ్లు, తాగునీరు, వీధిలైట్ల వంటి సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తా.ఈ ఊరి రైతులు రైల్వేలైన్‌లో భూములు కోల్పోయారు. వీరికి వెంటనే పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటా. గ్రామంలో చాలామందికి అర్హత ఉన్నా పింఛన్లు రాకపోవడం దురదృష్టకరం. వారందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement