కృష్ణా జలాలపై దొంగ నిద్ర! | Backlash in the Tribunal but no use and negligency of government on it | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలపై దొంగ నిద్ర!

Published Sun, Oct 23 2016 3:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కృష్ణా జలాలపై దొంగ నిద్ర! - Sakshi

కృష్ణా జలాలపై దొంగ నిద్ర!

ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలినా కళ్లు తెరవని సర్కార్
 
- తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని నిపుణుల సూచన
- నిపుణులు, జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదనలు బేఖాతర్
- తీర్పును సుప్రీంలో సవాల్ చేయకూడదని సీఎం నిర్ణయం
- సర్కార్ తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన
- రాష్ట్రంలో ఆయకట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం
 
 సాక్షి, హైదరాబాద్ : బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల అంశంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నా ప్రభుత్వం తోసిపుచ్చుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థంగా వాదనలు వినిపిస్తూనే... ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలన్న సూచనను ముఖ్యమంత్రి కొట్టిపారేస్తున్నారని జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలమేరకే చంద్రబాబు నాయుడు దోబూచులాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ అధికారం పంచుకుంటున్నా సీఎం వైఫల్యం వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందనే విమర్శలున్నాయి.

ఇప్పుడు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సరైన రీతిలో స్పందించకుండా... తన స్వప్రయోజనాలకోసం మరోసారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం సమర్థవంతమైన వాదనలు విన్పించలేదని సాక్షాత్తూ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ వ్యాఖ్యలు చేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.  సర్కార్ ఇదే రీతిలో నిర్లక్ష్యం చేస్తే రెండు రాష్ట్రాల మధ్య జలాల పునఃపంపిణీలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని.. ఫలితంగా రాష్ట్రంలోని ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్ తరాలు క్షమించవని అధికారపార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
 
 ద్విముఖ వ్యూహం సూచించిన నిపుణులు...
 కృష్ణా జలాల పునఃపంపిణీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ ఈనెల 19న ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 89(ఏ) (బీ) ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కరవు పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నీటి విడుదలకు సంబంధించిన ‘మ్యాన్యువల్’ను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఖరారు చేయనుంది. ఇదే అంశంపై రెండు వారాల్లోగా అభిప్రాయాలు తెలపాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఒక రాష్ట్రం చెప్పిన అభిప్రాయంపై మరొక రాష్ట్రం అభ్యంతరాలను తెలిపేందుకు మరో రెండు వారాలు, ఈ అభ్యంతరాలపై వివరణ ఇవ్వడానికి మరో వారం సమయం ఇచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, న్యాయ నిపుణులతో జలవనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చించి వ్యూహాన్ని రూపొందించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన మ్యాన్యువల్‌పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అభిప్రాయం చెప్పేందుకు ఓ వైపు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేలా ఖరారు చేసిన వ్యూహాన్ని సర్కార్‌కు నివేదించారు.
 
 బచావత్ ట్రిబ్యునల్ తీర్పును మార్చిన బ్రిజేష్
 కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారీగా కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయిస్తూ స్పష్టమైన అవార్డును అప్పట్లోనే  జారీ చేసింది. విభజన నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మార్పులు చేర్పులు చేసే అవకాశం లేనే లేదు. కృష్ణా నదిలో 2060 టీఎంసీలు నికర జలాలు, 70 టీఎంసీలు పునర్ వినియోగం కలుపుకుని 2130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని తేల్చిన బచావత్ ట్రిబ్యునల్.. కరవు పరిస్థితులు ఉత్పన్నమైతే ఇబ్బందులు ఎదుర్కోకుండా దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 150 టీఎంసీలను క్వారీ ఓవర్‌గా కేటాయించింది. నికర జలాలు 2130 టీఎంసీలను నదీ పరివాహక రాష్ట్రాలు వినియోగించుకున్నాక 150 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకునే వెసులుబాటును బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. కానీ.. ఇందులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్  మార్పులు చేసింది. 2130 టీఎంసీలు నాలుగు రాష్ట్రాలు వినియోగించుకున్నాక.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 30 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత ఆధారంగా 120 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకోవచ్చునని తేల్చిచెప్పింది.
 
 
 క్యారీ ఓవర్‌లో కోటాపైనే దృష్టి..
 క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించనుంది. నదీ పరివాహక ప్రాంత విస్తీర్ణం, జనాభా ఆధారంగా క్యారీ ఓవర్ కోటా కింద వంద టీఎంసీలు కేటాయించాలంటూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైందని న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సర్కార్‌కు నివేదించారు. కృష్ణా డెల్టాకు 1885 నుంచి నీటి సరఫరా చేస్తోన్న నేపథ్యంలో.. క్యారీ ఓవర్ కోటాలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ వాదించాలని సూచించారు. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తోన్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీల వాటా ఇవ్వాలని, నాగార్జున సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీ 45 టీఎంసీలు వినియోగించుకునేలా బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలవరం కుడి కాలువ, పట్టిసీమ ద్వారా మళ్లిస్తోన్న గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు 90 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ వాదిస్తోంది.

జూరాల, సింగూరు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ముంపు ప్రాంతాల కింద ఎగువ రాష్ట్రాలకు 30 టీఎంసీల వాటా అప్పట్లోనే ఇచ్చామని.. ఇప్పుడు తెలంగాణకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ ద్విముఖ వ్యూహాన్ని సీఎం చంద్రబాబునాయుడు తోసిపుచ్చుతున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో డిసెంబర్ 30, 2010న దాఖలు చేసిన కేసుతోపాటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేసి సమర్థవంతమైన వాదనలు విన్పించాలన్న ప్రతిపాదననూ కొట్టిపారేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో పాత కేసులో మాత్రమే వాదనలు విన్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు, కరవు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన మ్యాన్యువల్‌పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సోమవారం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
 
 ఇలాగైతే ఆయకట్టు ఎడారే..!
 బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రంలో రాయలసీమ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలో ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతుండటం.. మహారాష్ట్ర, కర్ణాటకలకు నీటి కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పెంచడం.. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై కార్యాచరణ(మ్యాన్యువల్)ను రూపొందించకపోవడం.. వెరసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎగువ రాష్ట్రాలు ఇప్పటికే కేటాయించిన నీటి కన్నా అధికంగా నీటిని వినియోగిస్తుండటంతో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం రిజర్వాయర్‌లకు ఆలస్యంగా నీళ్లు చేరుతున్నాయి. దాంతో జూన్ నెలాఖరు నుంచి జూలై ఆఖరులోగా సాగు కావాల్సిన ఖరీఫ్ పంటలు ఆగస్టు నుంచి సెప్టెంబరు దాకా సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచడం.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.52 మీటర్లకు పెంచేందుకు అంగీకరించడంతో- జూరాల రిజర్వాయర్‌కు వరద నీటి చేరికలో తీవ్ర జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకూ వరద జలాల చేరిక ఆలస్యమవుతుంది. దుర్భిక్ష పరిస్థితుల ఏర్పడినప్పుడు ఎగువ రాష్ట్రాల నుంచి చుక్క నీరు కూడా దిగువకు వచ్చే అవకాశం లేదు. మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న స్వేచ్ఛను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రద్దు చేసి.. వాటిని కూడా పంచడం వల్ల హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రానికి శరాఘాతంగా మారిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయకూదని సర్కార్ నిర్ణయించడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement