ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: చెన్నైకి తాగునీటి కోసం ఇప్పటికప్పుడు కృష్ణా జలాలను విడుదల చేయలేమని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. చెన్నైకి తాగునీటి సరఫరాకు తక్షణమే రెండు టీఎంసీలను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కండలేరు రిజర్వాయర్ నుంచి మార్చిలో అప్పటి నీటి లభ్యత ఆధారంగా ఒక టీఎంసీని విడుదల చేస్తామని స్పష్టం చేశాయి. చెన్నైకి తాగునీటి సరాఫరాపై కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ హైదరాబాద్‌లో బుధవారం సమావేశమైంది. బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి ఎ.పరమేశం, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ నుంచి తెలుగుగంగ సీఈ మురళీనాథ్ రెడ్డి, తమిళనాడు జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 18, 1983 నాటి ఒప్పందం మేరకు..చెన్నైకి తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలను విడుదల చేయాలని తమిళనాడు అధికారులు వివరించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని..తక్షణమే రెండు టీఎంసీలను విడుదల చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటకలు వారి వాటా కింద విడుదల చేయాల్సిన పది టీఎంసీలను దిగువకు విడుదల చేయడం లేదని..ఈ నేపథ్యంలో చెన్నైకి 15 టీఎంసీలను ఎలా విడుదల చేస్తామని తెలుగు రాష్ట్రాలు ప్రశ్నించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా కింద విడుదల చేయాల్సిన ఐదు టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 3.3, తెలంగాణ వాటా కింద 1.7 టీఎంసీలు విడుదల చేయాలని.. అందులో రెండు రాష్ట్రాలు కలిసి రెండు టీఎంసీలను విడుదల చేయాలని తమిళనాడు కోరింది. ఈ ఏడాది కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని..ఆ మేరకు నీటిని విడుదల చేయలేమని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. మార్చిలో నీటి లభ్యత ఆధారంగా కండలేరు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీని విడుదల చేయడానికి మాత్రం అంగీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment