జిల్లాను ఎండబెట్టి.... | District dried .... | Sakshi
Sakshi News home page

జిల్లాను ఎండబెట్టి....

Published Sat, Jan 31 2015 6:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

District dried ....

  • జిల్లా అవసరాలకు నీటి కొరత
  • సాగునీరు లేక ఎండుతున్న పంటలు
  • ముసురుకుంటున్న నీటి వివాదాలు
  • రైతులు మధ్య తీవ్రమవుతున్న గొడవలు
  • కృష్టా జలాలు తరలింపు ఎప్పుడు?
  • నెల్లూరు (రవాణా): జిల్లాలో నీటి వివాదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. సాగు, తాగునీరు అందక అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో సాగునీటి కోసం రైతులు ఒకరిపై ఒకరు కక్షగట్టి దాడులకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సంగం, పెన్నా బ్యారేజీ, కండలేరు, కనుపూరు కాలువల కింద సాగుచేస్తున్న పంటలకు సాగునీరు అందక  ఎండుతున్నాయి.  ఇదే సమయంలో సర్కార్ కండలేరు నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా చెన్నైకు తాగునీరు విడుదల జిల్లాలో రైతుల కడుపు మండిస్తోంది.

    జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే జలాలను ఇతర రాష్ట్రాలకు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైకి మూడు టీఎంసీల నీటిని తరలించాలన్న నిర్ణయాన్ని టీడీపీ మినహా మిగిలిన పార్టీలు తప్పుపడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుగంగ కాలువ ద్వారా తమిళనాడుకు తాగునీరును అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

    ఈ మేరకు కృష్ణా నుంచి 15 టీఎంసీలను కండలేరు జలాశయానికి తరలించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఏడాదీ నెల్లూరు జిల్లా నుంచి 15 టీఎంసీలు జలాలను తాగునీటి అవసరాలకు చెన్నైకి తరలిస్తుంటారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి సోమశిలకు జలాలను తరలిస్తుంటారు. ఆ నీటిని కండలేరు ద్వారా తాగునీటి కోసం చెన్నైకి విడుదల చేస్తుంటారు. అయితే 2014-15 సంవత్సరానికి గాను ఇప్పటికేమూడు టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో గురువారం గంగ లైజనింగ్ కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు కండలేరు నుంచి మరో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని జిల్లా రైతులు వ్యతిరేకిస్తున్నారు.
     
    సోమశిలకు నీరెలా?

    ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో నీటిఎద్దడి నెలకొంది. మెట్ట ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంతాల్లో కూడా సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కూడా నీరు అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో సోమశిల ప్రాజెక్టు, పెన్నా, సంగం బ్యారేజీల కింద లక్షలాది ఎకరాల పంటను సాగుచేస్తున్నారు. వారంతా కేవలం సోమశిల నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పంటలు గట్టెక్కాలంటే మార్చి చివరి వరకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. కండలేరు జలాశయంలో ప్రస్తుతం 18 టీఎంసీలు నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కండలేరులో నీరు ఉండాలంటే సోమశిల నుంచి జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా శ్రీశైలం నుంచి జలాలను విడుదల చేయకుంటే సోమశిల డెడ్ స్టోరేజ్‌కి పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    రైతుల మధ్య వివాదాలు

    సాగునీటి కోసం రైతుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కండలేరు నుంచి కనుపూరు కాలువకు వచ్చే నీటి వ్యవహారంలో రైతులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మనుబోలు, గూడూరు మండలాల రైతులు సాగునీటికోసం కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఈఏడాది నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో గూడూరు మండల రైతులు కనుపూరు కాలువ ద్వారా తమ పంటలకు కూడా సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కండలేరు ద్వారా 0.21 టీఎంసీల నీరు తమకు వాటా ఉందని అధికారులను నిలదీశారు. ఈ విషయంలో జేసీ, ఇరిగేషన్ ఎస్‌ఈలు అక్కడికి వెళ్లి రైతులు మధ్య వివాదాన్ని పరిష్కరించారు. దీంతో పాటు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో కూడా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సంగం బ్యారేజి కింద కావలి రైతులు, జాఫర్ సాహెబ్‌కాలువ కింది తోటపల్లిగూడూరు, ఇందుకూరుపేట మండలాలకు  చెందిన రైతులు చివరి ఆయకట్టు భూములకు నీరు అందక ఆందోళనకు దిగుతున్నారు.
     
    చెన్నైకి తాగునీరా.!

    జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటికి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. చెన్నైకి నీటిని విడుదల చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంటలకు కనీసం మరో రెండు నెలలు నీరందితే తప్ప ధాన్యం ఇంటికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాల తరలింపుపై అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరూ స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్న విషయం కనబడలేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం జిల్లా మంత్రి నారాయణ ఈ విషయంపై పెదవి విప్పకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కండలేరు జలాల తరలింపుపై వెంటనే స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement