తాగేందుకే లేకుంటే..రెయిన్‌గన్‌లకు ఎక్కడ తేవాలి?
తాగేందుకే లేకుంటే..రెయిన్‌గన్‌లకు ఎక్కడ తేవాలి?
Published Tue, Aug 23 2016 12:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
– వ్యవసాయశాఖ డైరెక్టర్ ఎదుట రైతుల ఆందోళన
–తక్షణం రెయిన్‌గన్‌లతో పంటలు తడపాలని డైరెక్టర్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): ‘మా గ్రామాలకు చుట్టు పక్కల 10 కిలో మీటర్ల వరకు నీరు లేదు. ఈ పరిస్థితుల్లో తాగేందుకే ఇబ్బంది పడుతుంటే పంటలను తడిపేందుకు ఉద్దేశించిన రెయిన్‌గన్‌లకు ఎక్కడి నుంచి తేవాలి’ అంటూ రైతులు వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయరెడ్డి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాకు వెళ్తూ కల్లూరు మండలం చిన్నటేకూరు, డోన్ మండలం ఉడుములపాడు, ప్యాపిలి మండలం ఏనుగమర్రి గ్రామాల్లో ఎండుతున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎండిన పంటలను ఆయనకు చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నటేకూరులో వర్షాభావం వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. భూమిలో తేమ లేకపోవడం వల్ల కంకి అతి చిన్నగా వస్తున్నట్లు గుర్తించారు. అయిల్ ఇంజిన్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు ముందుగా పైపులు ఇవ్వండి. అవకాశం ఉన్నంత వరకు తామే నీటిని పారించుకుంటామంటూ రైతులు కోరారు. దీనిపై డైరెక్టర్ మాట్లాడుతూ ఎండిపోతున్న పంటలకు రెయిన్‌గన్‌ల ద్వారా వెంటనే నీటిని పారించాలని ఆదేశించారు. ఉడుములపాడు, ఎనుగమర్రి గ్రామాల్లో వేరుశనగ, ఆముదం తదితర పంటలను పరిశీలించారు. ఈ నెల 26,27 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆలోపుగానే కనీసం ఒక తడి నీరిచ్చేందుకు రెయిన్‌గన్‌లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నీళ్లు, డీజిల్‌కు రూ.3వేల వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని వివరించారు. రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటే ఖర్చులో 50శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఆయన వెంట డీడీఏలు మల్లిఖార్జునరావు, ప్రభాకర్‌రావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఆత్మ పీడీ రవికుమార్, ఏడీఏలు రమణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement