మూఢనమ్మకం పొమ్మంది భూమాత రమ్మంది | Bhumata superstition did you let pommandi | Sakshi
Sakshi News home page

మూఢనమ్మకం పొమ్మంది భూమాత రమ్మంది

Published Sun, Jan 25 2015 6:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Bhumata superstition did you let pommandi

  • కీడు సోకిందని ఊరు ఖాళీ
  • సిరులు పండిస్తున్న భూములు
  • ఇళ్లు కట్టిస్తే తిరిగొస్తామంటున్న ప్రజలు
  • మారుమూల గ్రామమైన సిరివంచకోట అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. పూరిగుడిసెలు, పెంకుటిళ్లు, దాబాలు అన్నీ కలిసి ఓ వంద ఉన్నాయి. తాగునీరు, రోడ్డులాంటి కనీస సౌకర్యాలూ కరువే. విద్యుత్ సౌకర్యం లేక చిమ్మచీకట్లో కాలం వెళ్లదీశారు. అయినా భూమాతను నమ్ముకుని బతికారు. గ్రామానికి కీడు సోకిందనే ఒకే ఒక్క మూఢనమ్మకం ఆ ఊరిని అడవిగా మార్చింది. ఒక్కొక్కరుగా అందరూ ఇళ్లు ఖాళీ చేసి చుట్టుపక్కల ఊళ్లలో స్థిరపడ్డారు. కానీ, భూమాతను నమ్ముకున్న ఆ రైతులు భూములు సాగు చేస్తూ సిరులు కురిపించుకుంటున్నారు.  
    - ధర్మపురి
     
    సిరివంచకోట పేరుకు తగ్గట్లే ఆ ఊరి భూములు రైతుల్లో సిరులు కురిపిస్తున్నాయి. గ్రామంలో వంద గృహాలున్నాయి. వ్యవసాయమే వారి జీవనాధారం. కనీస సౌకర్యాలు కరువైన ఆ ఊళ్లో రాత్రుళ్లు అనుకోని ఆపదొచ్చినా ఆదుకునే వైద్యులు కూడా లేరు. చదువుకుంటే పిల్లలు అభివృద్ధి చెందుతారని భావించిన గ్రామస్తులు 1995లో గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే శికారి విశ్వనాథం చేతులమీదుగా ప్రారంభింపజేసుకున్నారు.

    దశాబ్ధం క్రితం ఒకే ఒక్క పుకారు ఆ ఊరును ఖాళీ చేసేలా చేసింది. గ్రామానికి చెందిన లక్ష్మి వాంతులు విరేచనాలతో సకాలంలో వైద్యం అందక మృతిచెందింది. వారం రోజుల్లో ఆ ఇంటిపక్కనే ఉన్న నర్సయ్య అనే వృద్ధుడు కూడా వాంతులు, విరేచనాలతో మృతిచెందాడు. ఇలా ఒక్క ఏడాదిలో 15 మంది వివిధ కారణాలతో మరణించారు. అంతే గ్రామానికి కీడు సోకిందనే అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఒక్కొక్కరుగా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కొందరు జగిత్యాల వెళ్లగా మరికొందరు సమీప గ్రామాలైన బుగ్గారం, గోపులాపూర్, మద్దునూర్‌కు వలస వెళ్లారు. ఇప్పుడు ఆ గ్రామం మొత్తం ఖాళీనే. ఈ పదేళ్లలో కొన్ని గృహాలు శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. చెట్ల పొదలతో ఊరు ప్రస్తుతం అడవిని తలపిస్తోంది.
     
    సిరులకోట

    ఇళ్లు వదిలి వెళ్లినప్పటికీ ఆ ఊరి భూములపై వారికి మమకారం పోలేదు. సారవంతమైన సాగుభూముల్లో ఇప్పటికీ సాగు చేసుకుంటూనే ఉన్నారు. భూముల్లో వరి, మొక్కజొన్న, పసుపు, పత్తి ఇతర కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. వారు ఉంటున్న ఊరు నుంచి వచ్చి పగలంతా పొలం పనులు చూసుకుని సాయంత్రం వారి నివాస ప్రాంతాలకు వెళ్తున్నారు. గ్రామానికి విద్యుత్ లైన్లు వేయడంతో కరెంటు మోటార్ల సాయంతో సాగు చేస్తున్నారు. 3వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా. సిరులు కురిపిస్తున్న ఈ భూములకు విపరీతంగా డిమాండ్ ఉంది. ఒక్కో ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది.
     
    మమకారం పోలేదు

    మా ఊరు సిరివంచకోట. ఇప్పుడు మేం బుగ్గారంలో ఉంటున్నం. మా ఊళ్లె ఏం సౌలత్‌లు లేక ఇల్లు విడిచిపెట్టి వెళ్లినం. మాకు సిరివంచకోటలో మూడెకరాల భూమి ఉంది. ఊరు విడిచి వెళ్లినా మమకారం చావలేదు. అందుకే పగలంతా ఈ మూడెకరాల్లో పొలం పనులు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. రాత్రి మళ్లీ బుగ్గారం వెళ్లిపోతున్నాం. మా భూముల్లల్ల మంచి పంటలు పండుతున్నయ్.     
    - మొగిలి రాజన్న
     
    ఇండ్లు కట్టించాలి
    ఏం సౌలత్‌లు లేక ఊరు విడిచి వెళ్లినం. ఊళ్లో ఆ కాలంలో ఒక్క వైద్యుడు, చాకలి అంటూ లేడు. ఊరు చీకట్లో ఉంది. రాత్రిళ్లు ఏదైనా ఆపద వస్తే అడవిగుండా ఎక్కడికి వెళ్లేటోళ్లం కాదు. కనీసం రోడ్డు కూడా లేదు. అంతలోనే మా ఊరికి కీడు సోకిందని భయం చెప్పిండ్రు. ఒకరిని చూసి ఒకరం వెళ్లిపోయినం. ప్రభుత్వం స్పందించి మాకు అన్ని వసతులతో ఇండ్లు కట్టిస్తే ఇక్కడే ఉంటం.
     - రాచర్ల రామస్వామి
     
    మా ఊరు మాకే
    మాది సిరివంచకోట. తొమ్మిదేండ్ల క్రితం భార్యా, ఇద్దరు పిల్లలతో ఊరు విడిచి బుగ్గారం వచ్చినం. సిరివంచకోటల నాకు రెండెకరాల పొలం ఉంది. రోజు బుగ్గారం నుంచి ఎడ్లబండి మీద వచ్చి ఎవుసం చేసుకొంటున్నం. అప్పుడు వంద ఇండ్ల వరకుండే. ఐదో తరగతి దాకా ఒక్క బడి ఉండె. మంచినీళ్లు, రోడ్లు, లైట్లు లేకుండె. ఇప్పుడున్న మా భూముల్లో ఇండ్లు కట్టించి వసతులు కల్పిస్తే మా ఊరు మాకే ఉంటది.   
    - గాండ్ల నర్సయ్య
     
    అడవిలా అయింది
    మేం ఎవుసం చేసుకుంట బతుకుతం. ఏడేండ్ల కింద ఇల్లు వదిలి బుగ్గారం వెళ్లిపోయనం. అప్పుడు ఇండ్లు మంచిగుండె. ఒకల వెనక ఒకలు ఇండ్లు విడిచిపెట్టి పోవడంతో ఊరు అడవి లెక్కయింది. ఒక్కలు కూడా ఉంటలేరు. అయినా ప్రతీరోజు ఎవుసం పనులు చేసుకునేటందుకు ఇక్కడికే వస్తున్నం. గవర్నమెంటోళ్లు ఆదుకుని మాకు మంచి ఇండ్లు కట్టిస్తే ఇక్కడికే వస్తం. మా ఊళ్లెనే ఉండి ఎవుసం చేసుకుంటం.     
    - నక్క నర్సింగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement