raingun
-
రెయిన్గన్లు, రైతు రథాల్లోనూ చేతివాటం..
సాక్షి, అమరావతి: అవినీతికి అదీ ఇదీ లేదు అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరించింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్‌గ్రిడ్, టిడ్కో ఇళ్ల స్కాం మాదిరిగా స్కాంల జాబితాలో ఇంకా ఉన్నాయి. రెయిన్గన్లతో కరువును జయించాం అంటూ చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అవినీతి కూడా ఇందులో భాగమే. బాబు పాలనలో ఐదేళ్లూ కరువు కాటకాలే అన్నది అందరికీ తెలిసిందే. ఏటా సగటున 279 పైగా కరువు మండలాలు ఉండేవి. పంట పొలాలన్నీ బీడు వారడంతో పెద్దఎత్తున రైతులు వలస బాటపట్టారు. 2016–2018 మధ్య రూ.163 కోట్లు ఖర్చుచేసి 13,650 రెయిన్గన్లు, 13,650 స్ప్రింక్లర్లు, 3.50 లక్షల నీటిసరఫరా పైపులు, 8,109 ఆయిల్ ఇంజన్లను అప్పటి టీడీపీ సర్కారు కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ, మరమ్మతుల కోసం మరో రూ.103 కోట్లు విడుదల చేసింది. కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడడమే కాక నిబంధనలకు పాతరేస్తూ పచ్చచొక్కాలు వేసుకున్న వారికి పప్పుబెల్లాల్లా వాటిని పంచిపెట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెయిన్గన్ల వ్యవహారంపై జరిపిన విచారణలో భారీ అవినీతి బాగోతం వెలుగుచూసింది. మూలపడిన వాటితో పాటు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు చేరిన పరికరాలను స్వా«దీనం చేసుకుంది. ఈ విధంగా పక్కదారి పట్టిన రూ.112 కోట్ల విలువైన 11,449 రెయిన్గన్లు, 6,354 ఆయిల్ ఇంజన్లతో పాటు 13,778 స్ప్రింక్లర్లు, 7.99 లక్షల వాటర్ పైపులను స్వా«దీనం చేసుకున్నారు. రైతురథాల పేరిట ‘కోట్లు’ స్వాహా వ్యక్తిగత, గ్రూపుల పేరిట ఇచ్చిన యంత్ర పరికరాల కంటే రైతురథాల పేరిట చంద్రబాబు సర్కారు ఇచ్చిన ట్రాక్టర్ల కొనుగోలులోనే ఎక్కువగా అవినీతి జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సిఫార్సుతో 2017–18లో 12,204 ట్రాక్టర్లు,, 2018–19లో 11,072 ట్రాక్టర్లు పచ్చనేతలకు పంచిపెట్టారు. ఏ కంపెనీ డీలర్ వద్ద ఏ ట్రాక్టర్ కొనాలో ప్రభుత్వమే నిర్దేశించేది. సబ్సిడీ మొత్తం కూడా ఆయా డీలర్ల ఖాతాలకే జమచేసేది. ట్రాక్టర్లతో సహా యంత్ర పరికరాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన కంపెనీ డీలర్ల నుంచే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. పైగా.. మార్కెట్ రేటు కంటే 30 శాతం అధికంగా కోట్‌చేసి ఆ సొమ్ము దర్జాగా జేబుల్లో వేసుకున్నారు. రైతుల పేరిట దొడ్డిదారిన చేజిక్కించుకున్న ట్రాక్టర్లను దర్జాగా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ పథకం పేరిట రూ.200 కోట్లకు పైగా సబ్సిడీ సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. -
పేలని రెయిన్ గన్!
సాక్షి,అనంతపురం అగ్రికల్చర్: 2016 జూన్‌లో మంచి వర్షాలు పడ్డాయి. జూలైలో మోస్తరుగా వర్షం కురిసింది. అరకొర వర్షాలకు ఎలాగోలా జిల్లా రైతులు ఖరీఫ్‌లో 15.22 లక్షల ఎకరాల్లో వేరుశనగ, మరో 3.95 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు... మొత్తం 19.17 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అయితే ఎప్పటిలాగే పంట వేసిన తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. 20 లక్షల ఎకరాల ఖరీఫ్ కకావికలమైంది. పంటలన్నీ ఎండిపోయాయి. రూ.వందల కోట్ల పెట్టుబడులు భూమిలో కలిసిపోయాయి. రూ.వేల కోట్ల పంట దిగుబడులు గాలిమేడలా కూలిపోయాయి. సీఎం చంద్రబాబు మాత్రం దీన్ని అంగీకరించలేదు. అనంతపురం జిల్లాను చూసి కరువే భయపడేలా చేస్తానంటూ బీరాలు పలికాడు. రెయిన్గన్లు సిద్ధం చేసినట్లు రైతులకు లేనిపోని ఆశలు కల్పించాడు. ట్యాకర్లతో నీళ్లు తోలించి ఎండిపోయిన పొలాల్లో పంట సంజీవిని రక్షకతడి ఇచ్చానంటూ నాటకం ఆడాడు. ఇతర జిల్లాల నుంచి రాత్రికి రాత్రి పరికరాలు తెప్పించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు నానా హడావిడి చేశారు. రూ.700 కోట్లు వృథా చంద్రబాబు ఆరు రోజుల డ్రామా తర్వాత ఏకంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి రైతులకు రూ.700 కోట్లు విలువ చేసే వేరుశనగ రక్షించానని గొప్పలు చెప్పేసి చేతులు దులుపుకున్నారు. రెయిన్గన్ల షోతో జిల్లాలో మకాం వేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఈ డ్రామా వ్యవహారాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. అయితే రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు సీఎం వైఖరిపై దుమ్మెత్తిపోయడంతో రెయిన్గన్ల సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. రెయిన్గన్లు, ఇతర పరికరాలకు రూ.70 కోట్లు, నీటి తడులు ఇవ్వడానికి, ఇతరత్రా ఖర్చుల కింద మరో రూ.50 కోట్లు మంచినీళ్లులా ఖర్చు పెట్టేశారు. కానీ... ఎకరా వేరుశనగ పంటను కాపాడలేకపోయారు. చివరకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే వెళ్లి రెయిన్గన్లు ద్వారా నీటి తడులు ఇచ్చిన అమడగూరు మండలం గుండువారిపల్లిలో శివయ్య పొలం, గుమ్మగట్ట మండలం పూలకుంటలో నాగప్పకు చెందిన వేరుశనగను పొలం కూడా ఎండిపోగా..ఆ రైతులు గగ్గోలు పెట్టారు. మరోవైపు పంట సంజీవిని పరికరాల్లో 40 శాతం వరకు ఇప్పటికీ తెలుగు తమ్ముళ్ల చేతిలోనే ఉండిపోయాయి. అందులో కొన్ని అమ్ముకోగా, మరికొన్ని దాచిపెట్టుకున్నారు. మిగతా 60 శాతం పరికరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించి గోదాముల్లో నిల్వ ఉంచగా అవి మరమ్మత్తులకు గురైనట్లు చెబుతున్నారు. అంతా బూటకం రక్షకతడి ఇచ్చి వేరుశనగ పంటను కాపాడుతానంటూ 2016 ఆగస్టు చివర, సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం చంద్రబాబు చేసిన నాటకం బూటకమని రైతులు పెదవి విరిచారు. పంట సంజీవని కింద రూ.70 కోట్లు విలువ చేసే 6,426 రెయిన్గన్లు, 5,894 స్ప్రింక్లర్లు, 4,306 డీజిల్ ఇంజిన్లు, 4.11 లక్షల సంఖ్యలో హెడ్డీపీఈ పైపులు జిల్లాకు తెప్పించారు. ఇవన్నీ జూలై మూడో వారంలోనే జిల్లాకు చేర్చారు. కానీ... ఆగస్టు 21న రక్షకతడి ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికే లక్షల ఎకరాల్లో వేరుశనగ ఎండుముఖం పట్టింది. కీలకమైన ఆగస్టులో 88.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 18.1 మి.మీ నమోదు కావడంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. రెండుసార్లు జిల్లా పర్యటనకు వచ్చినా పంటలు ఎండిపోతున్న సమయంలోనే సీఎం రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. ఆగస్టు 6న ధర్మవరం, 15న స్వాతంత్య్ర వేడుకలకు హాజరైనా.... పంటల గురించి పట్టించుకోలేదు. తర్వాత ఆగస్టు 28న జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు.. రక్షకతడి పేరిట ఆరు రోజుల పాటు హంగామా చేశారు. పంట ఎండిపోయిన విషయం తెలియదన్నారు. నీళ్లు లేకున్నా చెరువులు, ఫారంపాండ్లు, బోరు బావుల నుంచి ట్యాంకర్లు, ఫైర్ ఇంజిన్లు, డీజిల్ ఇంజిన్ల ద్వారా రేయిన్గన్లు, స్ప్రింక్లర్లతో నీటి తడులు ఇచ్చి 4 లక్షల ఎకరాల వేరుశనగ పంటను కాపాడినట్లు కాకి లెక్కలతో బురిడీ కొట్టించారు. రక్షకతడి మాటున ఇన్‌పుట్‌సబ్సిడీ ఎగ్గొట్టాలని శతవిధాలా ప్రయత్నించినా... రైతులు, రైతు సంఘాలు, విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోయడంతో చివరకు వెనక్కితగ్గారు. ‘‘2016 ఆగస్టు 27న రాత్రి అధికారులు, టీడీపీ నాయకులు మా ఇంటి దగ్గరకు వచ్చారు. రేపు సీఎం చంద్రబాబు నీ పొలంలోకి వస్తాడు..పొలం దగ్గరే ఫారంపాండ్ తవ్వుతామన్నారు. రాత్రికి రాత్రే జేసీబీతో గుంతతవ్వారు.. తెల్లారే సరికి ఫారంపాండ్ చుట్టూ పూలు అలంకరించారు. ఏర్పాట్ల పేరుతో నా పొలంలోని వేరుశనగ మొక్కలన్నీ తొక్కి పాడు చేశారు. సీఎం చంద్రబాబు నన్ను పిలిచి...శివన్నా పంట ఎండిపోతోందని బాధ పడుతున్నావా..? ఏం బాధ పడకు నిన్ను ఆదుకోవడానికే నేను వచ్చాను అన్నాడు. వరుణ దేవున్ని నమ్ముకోవద్దు...నన్ను నమ్ము... వాన కురవకపోయినా నీ పంటను కాపాడుతా అన్నాడు. వెంటనే అధికారులు జనరేటర్‌ను ఆన్ చేశారు. సీఎం చంద్రబాబు పొలంలోకి వచ్చి అదేదో రెయిన్‌గన్‌ను ఆన్ చేసి నీటిని సరఫరా చేశాడు. నీ పంట చేతికొచ్చే దాకా నీటిని సరఫరా చేస్తామన్నాడు. నేను ఇంటికొచ్చి మధ్యాహ్న భోజనం తిని పొలం వద్దకు వెళ్లగానే ఫారంపాండ్‌లో వేసిన టార్ఫాలిన్ లేదూ, పొలంలోని గన్లు లేవు. పంటంతా ఎండిపోయింది. ఐదెకరాల్లో పంటకు పెట్టిన పెట్టుబడులు రూ 80 వేలకు 20 కేజీల వేరుశనగ కాయలు దిగుబడి వచ్చింది. సీఎం చంద్రబాబే నా పొలంలోకి వచ్చినా నన్ను ఆదుకోకపోగా పంట నష్టం కూడా చేతికి ఇవ్వలేదు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూల్లేదు ’’– శివన్న, రైతు, గుండువారిపల్లి, అమడగూరు మండలం -
రికవర్రీ
► ‘పంట సంజీవని’ పరికరాల స్వాధీనంలో అవకతవకలు ► రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు, ► పైపులు తమవద్దే పెట్టుకున్న టీడీపీ నేతలు ► రివకరీకి వెళ్లిన అధికారులతో ఘర్షణ ► విధిలేక రైతులపై కేసు నమోదు చేస్తున్న అధికారులు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘పంట సంజీవని’ పేరుతో పంటలను కాపాడేందుకు కొనుగోలు చేసిన పరికరాల రికవరీలో గోల్మాల్ జరుగుతోంది. అదునులో తీసుకున్న పరికరాలను అవసరం తీరాక అధికారులకు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు నానాయాగీ చేస్తున్నారు. తీసుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ ‘రికవరీ’ కోసం అధికారులు పల్లెల్లోకి వెళితే వారినీ దుర్భాషలాడుతున్నారు. వారి బెదిరింపులు తాళలేక, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యవసాయాధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. ప్రణాళిక లేకుండా పంపిణీ గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలో 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. జూలై ఆఖరు, ఆగస్టులో వర్షాభావంతో పంట ఎండిపోయింది. రైతులు ఆందోళన చెందాలి్సన అవసరం లేదని, రక్షక తడుల ద్వారా పంటలను కాపాడతామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. జూలైలోనే రెయిన్ గన్లు జిల్లాకు చేరాయి. అయితే కృష్ణా పుష్కరాల హడావుడిలో ఉన్న యంత్రాంగం వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేసింది. సీఎం ఆగస్టులో ధర్మవరంలో పర్యటించినా, ఆతర్వాత అనంతపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా అధికారులు వీటిని పంపిణీ చేయించలేదు. పంటలు ఎండిన సంగతి తెలిసి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ఆగస్టు 22న రెయిన్ గన్లను రైతులకు పంపిణీ చేశారు. అప్పటికే పంట పూర్తిగా ఎండిపోయింది. ఆగస్టు 28న సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చి పంట ఎండిన సంగతి తనకు తెలీదని, తెలిసుంటే కాపాడేవాళ్లమని చెప్పారు. రెయిన్గన్లను రైతులకు ఇచ్చి పంటను కాపాడాలని ‘మిషన్– 1’ పేరుతో హడావుడి చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకూ జిల్లాలోనే మకాం వేశారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా పంట సంజీవని పరికరాలను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. కొన్నిచోట్ల రైతుల వద్ద పాస్‌పుస్తకాలు తీసుకుని పంపిణీ చేస్తే, ఇంకొన్ని చోట్ల పేర్లు రాసుకుని ఇచ్చేశారు. ఇలా 5,887 రెయిన్గన్లు, 5,495 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4,478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటికి రూ.67 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ నేతలను వదిలి రైతులపై కేసులు రెయిన్గన్లను రైతులు తమ పనిని ముగించుకొని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా అవి చేతులు మారాయి. ఈ ప్రక్రియ స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారి వద్దకు ఎవరు వెళితే వారికే ఇచ్చారు. మిషన్ – 1, మిషన్ – 2 పూర్తయిన తర్వాత రెయిన్గన్ల రికవరీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటకలోని రైతులకు విక్రయించారు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయికి పంపారు. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని వారు గ్రహించారు. కొందరు నేతలు పరికరాలు వెనక్కి ఇచ్చేశారు. ఇంకొందరు పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసినవి కాకుండా వేరేవి, పని చేయకుండా తుక్కుగా ఉన్న ఆయిల్ ఇంజన్లను ఇస్తున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన పరికరాలు కాకుండా ఇంకా 800 రెయిన్గన్లు, 1,473 స్ప్రింక్లర్లు, 91,880 పైపులు, 414 ఇంజన్లు రికవరీ కావాల్సి ఉంది. వీటిని సేకరించడం అధికారులకు తలనొప్పిగా మారింది. వీటిపై ఆరా తీసే ఏఓలు, ఎంపీఈఓలపై అధికార పార్టీ నేతలు దుర్భాషలాడుతున్నారు. ఎంపీఈఓలలో అధిక శాతం మహిళలు ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేసులు నమోదు చేయాలని మొదట వ్యవసాయాధికారులు భావించినప్పటికీ సంబంధిత నేతలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జుల శరణు కోరారు. దీంతో కేసులు నమోదు చేయొద్దని, చేస్తే బదిలీ తప్పదని ఎమ్మెల్యేలు ఏఓలను హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులంతా రైతులపై పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు, వీర్‌ఓలు గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తమవద్ద లేవన్నా వినడం లేదు. పరికరాలు ఇవ్వకపోతే బ్యాంకులో పంటరుణం ఇవ్వకుండా ‘బ్యాన్’ చేసేలా సిఫార్సు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో రైతులు తాము ఇచ్చిన రైతుల వద్దకు వెళ్లి పరికరాలు అడగడం, వారు మరో రైతుపై చెప్పడం ఇలా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. అధికారులు మాత్రం రైతులపైనే ఫిర్యాదు చేసి ముందుకెళ్తున్నారు. కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావాల్సి ఉంది. పంట సంజీవని పరికరాల పరిస్థితి ఇదీ రెయిన్గన్లు స్ప్రింక్లర్లు పైపులు ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేసినవి 5,887 5,495 4,17,000 4,478 రికవరీ అయినవి 5,087 4,022 3,25,120 4,064 రికవరీ కావల్సినవి 800 1,473 91,880 414 -
సీఎం రాజధాని జపం
- మాజీ కేంద్ర మంత్రి కోట్ల కోడుమూరు : రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్షమైన పరిస్థితులతో రైతులు కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా రాజధాని జపం చేస్తున్నాడని కేంద్ర మాజీ రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకర్లతో మాట్లాడారు. 7 లక్షల ఎకరాల్లో రెయిన్గన్ల ద్వారా పంటలను కాపాడానని చెబుతూ మరోవైపు కరువు మండలాలను ప్రకటించి సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మోసాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎన్నో రోజులు నడపలేరని హెచ్చరించారు. రైతు సమస్యలపై పోరాడేందుకు ఈ నెల 19న కోడుమూరులో రైతు మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున కర్గే, సినీ నటుడు చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మీ, పల్లం రాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, సర్పంచ్ సిబి.లత పాల్గొన్నారు. -
8 ఎకరాలు..20 కిలోలు!
సీఎం చంద్రబాబు రక్షకతడులు ఇచ్చిన పొలంలో దిగుబడి ఇది పెట్టుబడి రాక అప్పులపాలైన వేరుశనగ రైతు శివన్న తొలకరి వర్షాలతో రైతుల్లో ఆశలు రేకెత్తించిన ఖరీప్ పంట కాలం... విత్తు తర్వాత చినుకు నేలకు రాలకపోవడంతో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి.. నానా కష్టాలు పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి విషమించే వరకూ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. పంట ఎండిపోతుండగా అంటే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హఠాత్తుగా తెరపైకి వచ్చారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తన దృష్టికి తీసురాలేదని తప్పంతా అధికారులపై నెట్టేశారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటూ ఏ ఒక్క ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వబోనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెయిన్గన్లతో రక్షకతడులు అంటూ హడావుడి చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబునే వచ్చి తన పొలంలో రక్షక తడులు ప్రారంభించడంతో ఆ బడుగు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక తన పంట పండుతుందని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో బతకవచ్చునని ఆశించాడు. పంట దిగుబడి వచ్చిన తర్వాత చూస్తే... బతుకు బజారు పాలైంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న తనకున్న ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టారు. పంట పెట్టుబడి కింద రూ.1.20 లక్షలు అప్పు చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎండు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమడగూరులో పర్యటించి శివన్న పొలంలో రెయిన్గన్లతో రక్షక తడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్భాటానికే పరిమితమైన తడులు ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం అధికార పార్టీ నాయకులు, అధికారులు ఆడిన చదరంగంలో శివన్న ఓ పావుగా మిగిలాడు. ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన తడితో పంట మొత్తం జీవం పోసుకుంటుంది. ఇక పంట పండుతుంది అని నమ్మించారు. ఆ తర్వాత మరొక్క తడిని ఇవ్వలేకపోయారు. పంట మొత్తం ఎండిపోయింది. ట్రాక్టర్‌తో ఎనిమిది ఎకరాల పొలంలో వేరుశనగ పంట తొలగిస్తే... 20 కిలోల కాయలు మాత్రమే వచ్చాయి! స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పర్యటించి రక్షకతడులు ప్రారంభించిన పొలం రైతు పరిస్థితే ఇలా ఉంటే మరి మిగిలిన రైతుల బతుకులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కుటుంబాన్ని పస్తులు ఉంచలేక.. ఎనిమిది ఎకరాల్లో పంట సాగుకు అయిన రూ.1.20 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మదన పడుతున్న శివన్న.. మరో కొత్త సమస్య మరింత చిక్కుల్లో నెట్టేసింది. కరువు నేపథ్యంలో జీవనోపాధులు కరువవ్వడంతో భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు అర్ధాకలితో అలమటించాల్సి వచ్చింది. విషయాన్ని గుర్తించిన శివన్న... తనకు తెలిసిన వారి నుంచి ఆర్థిక సాయాన్ని పొంది గ్రామాల్లో తిరుగుతూ బురకల (స్నాక్స్) వ్యాపారం చేపట్టాడు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, గూళ్లురు, బిళ్లూరు, చేళూరు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి బురకలు అమ్ముకుని వస్తున్నాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు బుధవారం అమడగూరులో బురకలు అమ్ముకుంటున్న శివన్నను సాక్షి పలకరించగా.. ఏం చెప్పమంటావులే అంటూ, తన గోడును వెళ్లబోసుకుని, కన్నీటి పర్యంతమయ్యాడు. 2014లో ఎన్నికలకు ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి కుటుంబ సభ్యులంతా టీడీపీకి ఓట్లేసినట్లు తెలిపారు. బ్యాంక్‌లో తనకున్న రూ. 54 వేల అప్పు మాఫీ కాలేదని, 70 ఏళ్ల వయసు మీద పడుతున్నా పింఛన్ కూడా అందడం లేదని వాపోయాడు. ప్రస్తుతం ఇంటిల్లిపాదీ కూలికెళ్తే గానీ పూటగడవని పరిస్థితి దాపురించిందన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 28న సీఎం చంద్రబాబు తన పొలానికి వచ్చి రక్షకతడులు ఇచ్చాడని, తన పంట పండిస్తాడులే అనుకుంటే ఇలా బజారుపాలు చేస్తాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారుని వాపోయాడు. -
పేలని రెయిన్ గన్!
- అంతా హడావుడే - ఒక్క ఎకరా తడిపితే ఒట్టు - ట్యాంకుర్లు లేవు - పైపుల కొరత తీవ్రం - కొనసాగుతున్న వర్షాభావ - ఎండుతున్న పంటలు కర్నూలు(అగ్రికల్చర్): ‘ఒక్క ఎకరాలో కూడా పంట ఎండరాదు... అలా ఎండితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరోవైపు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ‘ ఎండుతున్న పంటలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ట్యాంకర్లు లేవు, పైపుల కొరత ఎక్కువగా ఉంది. అసలు నీళ్లులేవు.’ అంటూ వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం ఖరీప్‌లో వేసిన కంది, పత్తి, వరిలతో పాటు రబీలో వేసిన శనగ పంటలు 56,497 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. వీటìకి అత్యవసరంగా నీటి తడులు ఇవ్వాల్సి ఉంది. వారం రోజులుగా జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా ఇంతవరకు ఒక్క ఎకరా పంటకు కూడ నీటి తడులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెయిన్గన్ల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నా.. ఫలితం మాత్రం నామమాత్రమే. బోగస్ లెక్కలు.. ఆగస్టులో ఏర్పడిన వర్షాభావం వల్ల ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. అయితే 86వేల ఎకరాలకు నీటి తడులు ఇచ్చినట్లు జిల్లా యంత్రాంగం లెక్కలు చెబుతున్నా అంతా బోగస్ అంటూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రభుత్వం జిల్లాలో 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. కరువు మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీకి నివేదిక పంపాలని ఆదేశించింది. కాని జిల్లాలో పంట నష్టం సర్వేను పక్కన పెట్టి రెయిన్గన్లతో పంటలకు నీటి తడులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండుతున్న పంటలకు నీటి తడులు ఇవ్వడం మంచిదే అయినప్పటికి అందుకు తగిన సదుపాయాలు కల్పిస్తే కదా సాధ్యమయ్యేది అంటూ వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ట్యాంకర్లు ఏవీ.... ఎండుతున్న పంటలను తడపటానికి రైతుల భూముల దగ్గర నీళ్లులేవు. దూరప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకొని రెయిన్గన్లతో పంటలకు తడులు ఇచ్చుకోవాలి. వారం, 10 రోజుల నుంచి హడావుడి చేస్తున్నా ఇంతవరకు ఒక్క అయిల్ ట్యాంకరు కూడా సమకూర్చిన దాఖాలాలు లేవు. ఒక్క ఎకరాలోని పంటను తడుపుకోవడానికి కనీసం 10 ట్యాంకుల నీళ్లు అవసరం. ట్యాంకులు లేకపోవడంతో పంటలకు రక్షక తడులు ఇవ్వడం ప్రశ్నార్థకం అయింది. దీనికి తోడు పైపుల కొరత వేధిస్తోంది. కర్నూలు సబ్ డివిన్కు 21వేల పైపులు అవసరం ఉండగా ఇంతవరకు నామమాత్రంగానే ఇచ్చారని, వీటితో ఎలా పంటలకు నీటి తడులు ఇచ్చుకుంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దెబ్బతిన్న పంటలు.. అక్టోబరు నెల మొత్తంగా వర్షాలు లేకపోవడం వల్ల పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్టోబరులో 114.5 మిమీ సాధారణ వర్షపాతం ఉండగా 8.9 మిమీ మాత్రమే కురిసింది. నెల రోజులకు పైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో రబీ పంటల సాగు ముందుకు సాగడం లేదు. కర్నూలు సబ్ డివిజన్లో 19,859 హెక్టార్లు, మద్దికెర మండలంలో 10,026, డోన్ సబ్ డివిజన్లో 7,106, నందికొట్కూరు సబ్ డివిజన్లో 2,431, ఆదోని సబ్ డివిజన్లో 5,801, దేవనకొండ మండలంలో2,454, పత్తికొండ మండలంలో 2,550, హాలహర్వి మండలంలో 2,101, హోళగుంద మండలంలో 1,445 హెక్లార్ల ప్రకారం పంటలు దెబ్బతిన్నాయి. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే రబీ పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. -
'ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది'
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం హరికేర గ్రామంలో ఎండిన పంటలను మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఈ నెల 2వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో పర్యటించారన్నారు. సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్గన్లు కొనుగోలు చేసి 7.5 లక్షల ఎకరాల పంటను కాపాడామని బూటకపు మాటలు చెప్పాడని విమర్శించారు. పరిస్థితిని చూస్తే ఇక్కడ పంటలన్నీ ఎండిపోయాయన్నారు. పంటలు ఎండిపోయి ప్రజలు నానా తిప్పలు పడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అక్కడి మహిళలు మాజీ కేంద్రమంత్రి ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. -
16 వరకు రెయిన్గన్లతో పంటలకు నీటి తడులు
– డీడీఏ ప్రభాకర్‌రావు పత్తికొండ టౌన్: వర్షాభావ పరిస్థితుల్లో వాడుతున్న పంటలకు రెండో విడత కింద 16వతేదీ వరకు రెయిన్గన్లు, స్ప్రింక్లర్లతో నీటితడులు అందిస్తామని వ్యవసాయశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని హోసూరు, చిన్నహుల్తి గ్రామసమీపాల్లో రెయిన్గన్లతో నీటితడులు అందిస్తున్న పంటలను డీడీఏ పరిశీలించారు. హోసూరు గ్రామసమీపంలో పైగేరి రంగస్వామి అనే రైతుకు చెందిన వేరుశెనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....జిల్లాలోని 53మండలాల్లో 461 గ్రామాల్లో 29,857 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వాడిపోతూ బెట్టపరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రెయిన్గన్లు, స్ప్రింక్లర్లుతో బోరుబావులు, కాలువలు, ఫాంపాండ్లు నుంచి మోటార్లతో నీటిని తోడి పంటలకు అందించే చర్యలు చేపట్టామన్నారు. జిల్లాకు 3038 రెయిన్గన్లు, 2066 స్ప్రింక్లర్లు, 27640 పైపులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పత్తికొండ సబ్‌డివిజన్ ఏడీఏ నారాయణనాయక్, పత్తికొండ, మద్దికెర ఏఓలు రాజకిశోర్, కిరణ్‌కుమార్, ఏఈఓలు రుక్సానా, రంగన్న, యోగీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఏ మూలకూ చాలవు
– ఎకరాకు 20వేల లీటర్ల నీటితోనే సరిపుచ్చుతున్న వైనం – కనీసం 40వేల లీటర్ల నీటితో తడులివ్వాలంటున్న రైతాంగం కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండిన పంటలకు రెయిన్గన్ల ద్వారా తడులిచ్చేందుకు తలపెట్టిన ప్రభుత్వం ఎకరాకు 20వేల లీటర్ల నీటితో సరిపెడుతుండడంపై రైతులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం 20వేల లీటర్లకే సబ్సిడీ ఇస్తుండటంతో అదే స్థాయిలోనే తడులు ఇస్తున్నట్లు సమాచారం. ఎండిన పంటలకు ఈ నీరు ఏ మూలకు చాలవని, కనీసం 40వేల లీటర్ల నీటితో తడులివ్వాలని కోరుతున్నారు. 4వేల లీటర్ల కెపాసిటి కల్గిన ట్యాంకర్లు 5 తరలించేందుకు రైతులు రూ.600 భరించాల్సి ఉంది. దీనిని ట్రాక్టర్ డీజిల్‌కు వినియోగిస్తారు. 5 ట్యాంకర్ల నీటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. తొలుత ఎకరాకు 40 వేల లీటర్ల నీటితో తడులు ఇవ్వాలని ప్రభుత్వమే సూచించింది. చివరికి 20వేల లీటర్లతో మమ అనిపిస్తోంది. ఆదోని రెవెన్యూ డివిజన్ మొత్తంగా కరువు అలుము కున్నా ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, దేవనకొండ మండలాల్లోని పంటలకు మాత్రమే తడులు ఇస్తుండడం గమనార్హం. దీంతో మిగతా మండలాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎండిన పంటలకు తడులు ఇవ్వడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. అక్కడక్కడ చెరువులు, కుంటల్లో నీరు అంతంతమాత్రంగా ఉంది. ఈ నీటితో కొద్దిమేరకు తడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతంత మాత్రం ఉన్న నీటిని ట్యాంకర్లతో తరలిస్తే ఉన్న నీరు ఖాళీ అవుతుంది, వర్షాలు పడకపోతే పశువులు తాగేందుకు కూడా నీళ్లుండవంటూ వాదిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1000 ఎకరాలకు తడులిచ్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. 7 మండలాల్లో అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం దాదాపు 27వేల ఎకరాల్లో పంటలు ఎండినట్లు సమాచారం. -
కరువుపై యుద్ధమంటే ఇదేనా?
– సీఎంకు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రశ్న నంద్యాలరూరల్: రాయలసీమలో నెలకొన్న కరువుకు శాశ్వత పరిష్కారం చూపకుండా, కేంద్రం నుంచి కరువు నివారణ నిధులు రాకుండా చేసేందుకు మరోమారు చంద్రబాబు కరువుపై రెయిన్గన్లతో యుద్ధమంటూ మోసం చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావంతో ఖరీఫ్ పంటలు ఎండుతుంటే తనకు ఆలస్యంగా తెలిసిందని సీఎం చంద్రబాబు పేర్కొనడం దురదష్టకరమన్నారు. పైగా రెయిన్గన్లతో నీరు చల్లి బతికిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న చర్యలు, కరువు రైతుకు మనోధైర్యాన్ని కల్పించలేదన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు కొనసాగించి తక్షణమే రాయలసీమ జలాశయాలు, చెరువులకు నీరు నింపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి ఉంటే ఉన్న తక్కువ నీటిని రాయలసీమకు మళ్లించుకొనే అవకాశం ఉండేదన్నారు. ఇప్పటికైనా రాయలసీమపై చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దష్టి పెట్టాలని సీఎంకు సూచించారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854అడుగులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాదయాత్ర మంచిదేనన్నారు. పార్టీలకు అతీతంగా రైతులు కరువును తరిమేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. కేసీ కెనాల్ శాశ్వత నీటి వాటాను తక్షణమే విడుదల చేసి ఆయకట్టు పంటలను కాపాడాలని, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, హంద్రీనీవా ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క ఎకరాలో పంట ఎండినా అధికారులపై చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్న చంద్రబాబు అరెకరా పంట తడవడానికి కూడా నీటిని చూపించకపోవడం బాదేస్తోందన్నారు. అవాస్తవ ప్రచారం, ప్రజలను మోసం చేసే పద్ధతి మానుకొని శాశ్వత కరువు నివారణ చర్యలపై దష్టి పెట్టాలని హితవు పలికారు. -
రక్షకతడి విస్తీర్ణంపై గోప్యత
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ పంటకు ఇస్తున్న రక్షక తడి విస్తీర్ణంపై జిల్లా యంత్రాంగం గోప్యత పాటిస్తోంది. రెండు రోజుల కిందట వరకు రోజువారీ ఎన్ని ఎకరాలకు రక్షక తడులు ఇచ్చిన వివరాలు చెబుతున్నా, ఇపుడు మాత్రం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. లక్ష ఎకరాలకు రక్షక తడి ఇచ్చి రూ.200 కోట్లు విలువ చేసే పంటను కాపాడటంతో పాటు ప్రభుత్వానికి రూ.42 కోట్ల వరకు ఇన్పుట్ సబ్సిడీ మిగిలేలా చేశామని రెండు రోజుల కిందట గొప్పగా చెప్పిన వారు... ఇపుడు నోరు మెదపకపోవడం విశేషం. ఎవ్వరికీ లెక్కలు చెప్పవద్దని అధికారులకు పాలకులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయశాఖ జేడీ, ఏపీఎంఐపీ పీడీతో పాటు మరికొందరు అధికారులకు పదుల సార్లు ఫోన్లు చేసినా ఎత్తడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. కనీసం సెల్ మెసేజ్ ఇవ్వడానికి కూడా తీరికలేకుండా పోయింది. చివరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ రూంను సంప్రదించినా... రక్షక తడి వివరాలు తెలియదంటూ సమాధానం ఇవ్వడం విశేషం. పంట పరిస్థితి, ఊరు, పేరు చెబితే నమోదు చేసుకుంటాం కానీ... ఇతర వివరాలు చెప్పలేమని తేల్చిచెప్పారు. -
చిత్తూరు జిల్లాకు రెయిన్గన్లు
నంద్యాలరూరల్: నంద్యాలకు కేటాయించిన రెయిన్ గన్లు, స్ప్రింక్లర్లు, పైపులు చిత్తూరు జిల్లా పీలేరుకు తరలిస్తున్నారు. బుధవారం నంద్యాల టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాము నుంచి.. ఏడీఏ సుధాకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది దగ్గరుండి లారీల్లో రెయిన్గన్లు, పైపులు, స్ప్రింకర్లను పంపించారు. ఈ సందర్భంగా ఏడీఏ సుధాకర్ మాట్లాడుతూ.. నంద్యాల సబ్ డివిజన్‌కు కేటాయించిన 140 రెయిన్గన్లు, 3,500 పైపులు, 420 స్ప్రింకర్లు, 2100 పైపులు 12లారీల్లో పంపామన్నారు. పీలేరులో ఎండిన పంటలను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడి నుంచి వీటిని పంపాల్సి వచ్చిందన్నారు. -
ఇది కాదా.. పచ్చపాతం!
చిత్తూరుకు రెయిన్గన్ల తరలింపు – 1000 చొప్పున గన్లు, స్ప్రింకర్లకు ఎసరు – ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా అధికారి ఏర్పాట్లు – ఇప్పటికే ఆదోని డివిజన్లో తీవ్ర వర్షాభావం – పంటలు ఎండుతున్న సమయంలో రెయిన్గన్ల తరలింపు వివాదాస్పదం – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతాంగం ఒక్క ఎకరా పంట కూడా ఎండకూడదంటారు.. అధికార యంత్రాంగాన్నంతా మోహరించామంటారు.. ప్రత్యేక అధికారులను నియమించామంటారు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటారు.. ఇవన్నీ నీటి మూటలే. కర్నూలు రైతాంగంపై ప్రభుత్వం తన పచ్చపాతాన్ని మరోసారి చాటుకుంది. పంట ఎండుతుంటే.. గుండె మండుతుంటే.. కాపాడాల్సిన ముఖ్యమంత్రి సొంత జిల్లాపై మమకారంతో ఇక్కడి పంటలను పణంగా పెట్టడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా నుంచి ఇప్పటికే నిప్పులవాగు ద్వారా నెల్లూరుకు నీటిని తరలించిన ప్రభుత్వం.. తాజాగా రెయిన్గన్లు, స్ప్రింక్లర్లను కూడా తరలించేందుకు రంగం చేసింది. ఒకవైపు జిల్లాలో ఇప్పటికీ ఆదోని రెవెన్యూ డివిజన్లో వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసిన నంద్యాల రెవెన్యూ డివిజన్ నుంచి రెయిన్గన్లు, స్ప్రింక్లర్లను వర్షాలు కురవని ఇతర ప్రాంతాలకు తరలించే వీలుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకు ఇక్కడి రెయిన్గన్లు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కాస్తా ఇందుకు ఏర్పాట్లను ప్రారంభించారు. దీనిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి జిల్లాకు 4,500 రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు వచ్చాయి. ఇందులో 1000 రెయిన్గన్లు, వెయ్యి స్ప్రింక్లర్లు చిత్తూరు తరలించనున్నారు. అంటే జిల్లాలో మిగిలేది 2,500 రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు మాత్రమే. జిల్లాకు మరోసారి అధికార పార్టీ మోసం చేసిందని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కష్ణా పుష్కరాల సందర్భంగా కలెక్టర్ ఏర్పాటు చేసిన అభినందన సభపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం శ్రీశైలం, సంగమేశ్వరంలో విధులు నిర్వర్తించిన వారిని మాత్రమే సభకు ఆహ్వానించడం పట్ల మిగిలిన సిబ్బంది గుర్రుగా ఉన్నారు. మేం డ్యూటీ చేయలేదా? కష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో శ్రీశైలం, సంగమేశ్వరంలతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రిలోనూ ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించారు. అయితే, బుధవారం(31వ తేదీ) ఏర్పాటు చేసిన అభినందన సభలో కేవలం శ్రీశైలం, సంగమేశ్వరంలో విధులు నిర్వహించిన వారిని మాత్రమే ఆహ్వానించడం పట్ల మిగిలిన సిబ్బంది మండిపడుతున్నారు. తాము కూడా చివరి నిమిషంలో ఆదేశించినప్పటికీ విధుల్లో చేరి విజయవంతం చేశామని అంటున్నారు. కేవలం ముచ్చుమర్రి, నెహ్రూనగర్ ఘాట్లలోనే ఏకంగా 5.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మొత్తం 14.5 లక్షల మంది భక్తుల్లో 38 శాతం మంది భక్తులు ఈ రెండు ఘాట్లకే వచ్చారు. అయినప్పటికీ తమకు గుర్తింపునివ్వకపోవడం అవమానించడమేనని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. -
రెయిన్గన్లతో పంటలను కాపాడండి
– జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు రెయిన్గన్లతో నీటి తడులు అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి.. కార్మిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని కమాండ్ ఏరియా కంట్రోల్ రూంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒక్క ఎకరా పంట కూడా ఎండకూడదని.. ఇందుకోసం జిల్లాకు అవసరమైన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, పైపులను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. ఈ విషయంలో నీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రధానంగా వర్షం కురవని ఆదోని డివిజన్‌పై దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా జేసీ–2 ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాత్రి వర్షం కురిసినందున కాస్త ఇబ్బందులు తొలిగాయన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఆర్‌డబ్లు్యఎస్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి రెయిన్గన్లతో పంటలను తడుపుతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కర్నూలు, బనగానపల్లె, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖరరావు పాల్గొన్నారు. -
సబ్సిడీపై రెయిన్గన్లు
– యూనిట్ కాస్ట్ రూ.23,524.. రైతులు చెల్లించాల్సింది రూ.9,410 కర్నూలు(అగ్రికల్చర్): 60 శాతం సబ్సిడీపై రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు పంపిణీ చేయనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెయిన్‌గన్ యూనిట్ కాస్ట్ రూ.23,524 ఉండగా ఇందులో 60 శాతం అంటే రూ.14115 సబ్సిడీ ఉంటుందని రైతులు రూ. 9410 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. యూనిట్లో ఒక రెయిన్‌గన్‌తో పాటు 6 మీటర్ల పొడవు కలిగిన 25 పైపులు ఉంటాయన్నారు. రెయిన్గన్లు కావాలనుకునే రైతులు నాన్ సబ్సిడీ మొత్తాన్ని ప్రాజెక్టు డైరక్టర్ ఏపీఎంఐపీ కర్నూలు పేరిట డీడీ తీయాలని తెలిపారు. స్ప్రింక్లర్లను 60 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని యూనిట్ కాస్ట్ రూ.17998 ఉండగా సబ్సిడీ రూ.10799 ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రతి పంచాయతీలో రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు
– జిల్లా కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండుతున్న పంటలను కాపాడేందుకు తక్షణం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రెండు రెయిన్గన్లు, రెండు స్ప్రింక్లర్లతో పాటు వాటికి అవసరమైన పైపులు సిద్ధంగా ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితరులు సమన్వయంతో పంటలను కాపాడాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌తో సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 60 హెక్టార్లను ఒక యూనిట్‌గా గుర్తించినందున ఆ యూనిట్లో ఉన్న రైతులందరి వివరాలను సేకరించాలన్నారు. మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు, ఎంపీడీఓలు పంటలను తడపడంలో బాధ్యత తీసుకోవాలని, గ్రామ స్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఇఓలు పర్యవేక్షించాలన్నారు. ఒక్క ఎకరాలో కూడా పంట ఎండకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల దరిచేరని రెయిన్ గన్స్
– అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యత – మెట్టచేలలో పంటను తడపని వైనం – పంట తడవాలంటే రైతుల జేబులకు చిల్లే చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కనీసం రెయిన్ గన్స్తోనైనా తడిని ఇవ్వగలమా అని రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రెయిన్ గన్స్ రైతుల దరిచేరక, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకే పరిమిత మవుతున్నాయి. మెట్ట చేలల్లో ఎండిపోతున్న వేరుశనగ పంటను తడపడంలో అధికారులు మీనమీషాలు లెక్కిస్తూ కాలం గడుతున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యం. ఎలాగోలా పంటను కాపాడుకోవాలని అధికారులను ఆశ్రయిస్తున్న రైతుల జేబులకు చిల్లులు పడుతున్నాయే గాని సహకారం లేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనుకు రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వర్షాధార వేరుశనగ పంటను సాగుచేస్తున్నారు. అయితే గత 25 రోజులుగా వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంట ఎండిపోయే దుస్థితికి వచ్చింది. ఒక్క ఎకరం కూడా వేరుశనగ పంటను ఎండనీయమంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. ప్రస్తుతం ఎండిపోతున్న వేరుశనగ పంటను కనీసం మేరకు తడిపేందుకు జిల్లాకు 600 రెయిన్ గన్స్, 251 జనరేటర్లు, 2,400 స్పింకర్లు, 15 వేల డ్రిప్ వైపులను అందించింది. వీటి ద్వారా ఎండిపోతున్న పంటను తడిపేందుకు ఆయా మండలాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రైతులు ముందస్తుగా అధికారులను కలిసి పేర్లను నమోదు చేసుకుంటే, వరుస క్రమం ప్రకారం పంటను తడిపే పనులు చేయాల్సి ఉంది. పచ్చచొక్కాలకే పరిమితం రైతుల చేలలో వేరుÔ¶ నగ పంటను తడిపేందుకు అందించాల్సిన రెయిన్‌గన్స్, జనరేటర్లు, స్పింకర్లు తదితరాలు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకే పరిమితమవుతున్నాయి. ఆయా మండలాలకు చేరిన రెయిన్‌గన్స్, జనరేటర్లు, స్పింకర్లు, డ్రిప్ పైపులు ముందస్తుగా అధికార పార్టీ ప్రజాప్రనిధులు సూచనల మేరకే అధికారులు అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తార్కాణంగా జిల్లా కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలోనే మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన 11 ఎకరాల వేరుశనగ పంటను తడిపేందుకు అధికారులు ముందుగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రెండు రెయిన్‌గన్స్, 8 స్పింక్లర్స్ను అధికారులు ఏర్పాటు చేసి పంటను తడిపే పనులు చేపట్టారు. అధికారులు ఏమాత్రం రైతులకు సేవలు అందిస్తున్నారనేది దీన్నిబట్టి చూస్తేనే అర్థమవుతోంది. తమ పొలంలో పంట తడపాలని రైతులు అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే ‘‘మీ చేను వద్ద నీటి సౌకర్యం ఉందా, విద్యుత్ సౌకర్యం ఉందా, లేని పక్షంలో ట్యాంకర్‌తో నీటిని చేనులోకి తీసుకురాగలవా’’ అంటూ అధికారులు రైతులకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో తడవని పంట వేరుశనగను వర్షాధార పంటగా రైతులు ఎక్కువగా మెట్ట ప్రాంత చేలల్లోనే సాగుచేస్తారు. ఈ ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉండని కారణంగా, వర్షాభావ పరిస్థితుల్లో పంటను కాపాడుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి. అయితే ఈ ఖరీఫ్‌కు వేరుశెనగ పంటను ఎండకుండా కాపాడుతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించడమే కాకుండా, పంటను కాపాడుకునేందుకు అధికారులను ఆశ్రయిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మెట్ట చేలల్లో నీటి సౌకర్యం ఉండదని, కావున రైతులే ట్యాంకర్ల ద్వారా నీటిని చేలలోకి తీసుకురాగలగితే రెయిన్ గన్స్ అందిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు పంటను తడుపుకోవాలంటే ఒక్కో ట్యాంకర్ నీటి కోసం రూ.500 నుంచి రూ.700 వరకు ఖర్చుపెట్టాల్సి ఉంది. దీంతో కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పంటను తడపాలంటే కనీసం 4 ట్యాంకర్ల నీటిని తెప్పించాల్సి ఉంది. దీనికితోడు రెయిన్ గన్స్కు అమర్చే నీటిని తోడే జనరేటర్లకు విద్యుత్ సౌకర్యాన్ని కూడా రైతులే ఏర్పాటు చేయాలి. మెట్ట చేలల్లో కనుచూపు మేరల్లో కూడా విద్యుత్ కనెక్షన్లు దొరకడం కష్టతరంగా ఉంది. అదేగాక ట్యాంకర్ నుంచి నీటిని తోడేందుకు అవసరమైన ఫుట్‌బాల్‌ను కూడా రైతులే తెచ్చి పైపునకు బిగించుకోవాలి. ఇలాంటి నిబంధనలతో రైతులు పంటలను తడుపుకోలేక పోతున్నారు. శాంపిల్ కోసం ఏర్పాటు చేశాం ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి వేరుశనగ పంటను తడపడాన్ని ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన చేనులో శాంపిల్ చూశాం. ఈ విధానం విజయవంతం అవుతుంది. కావున రైతుల పంటను తడిపేందుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, జేడీ వ్యవసాయశాఖ -
తాగేందుకే లేకుంటే..రెయిన్గన్లకు ఎక్కడ తేవాలి?
– వ్యవసాయశాఖ డైరెక్టర్ ఎదుట రైతుల ఆందోళన –తక్షణం రెయిన్గన్లతో పంటలు తడపాలని డైరెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ‘మా గ్రామాలకు చుట్టు పక్కల 10 కిలో మీటర్ల వరకు నీరు లేదు. ఈ పరిస్థితుల్లో తాగేందుకే ఇబ్బంది పడుతుంటే పంటలను తడిపేందుకు ఉద్దేశించిన రెయిన్గన్లకు ఎక్కడి నుంచి తేవాలి’ అంటూ రైతులు వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయరెడ్డి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాకు వెళ్తూ కల్లూరు మండలం చిన్నటేకూరు, డోన్ మండలం ఉడుములపాడు, ప్యాపిలి మండలం ఏనుగమర్రి గ్రామాల్లో ఎండుతున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎండిన పంటలను ఆయనకు చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నటేకూరులో వర్షాభావం వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. భూమిలో తేమ లేకపోవడం వల్ల కంకి అతి చిన్నగా వస్తున్నట్లు గుర్తించారు. అయిల్ ఇంజిన్లు ఇవ్వకున్నా పర్వాలేదు ముందుగా పైపులు ఇవ్వండి. అవకాశం ఉన్నంత వరకు తామే నీటిని పారించుకుంటామంటూ రైతులు కోరారు. దీనిపై డైరెక్టర్ మాట్లాడుతూ ఎండిపోతున్న పంటలకు రెయిన్గన్ల ద్వారా వెంటనే నీటిని పారించాలని ఆదేశించారు. ఉడుములపాడు, ఎనుగమర్రి గ్రామాల్లో వేరుశనగ, ఆముదం తదితర పంటలను పరిశీలించారు. ఈ నెల 26,27 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆలోపుగానే కనీసం ఒక తడి నీరిచ్చేందుకు రెయిన్గన్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నీళ్లు, డీజిల్‌కు రూ.3వేల వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని వివరించారు. రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటే ఖర్చులో 50శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఆయన వెంట డీడీఏలు మల్లిఖార్జునరావు, ప్రభాకర్‌రావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఆత్మ పీడీ రవికుమార్, ఏడీఏలు రమణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.