ఇది కాదా.. పచ్చపాతం!
ఇది కాదా.. పచ్చపాతం!
Published Wed, Aug 31 2016 12:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
చిత్తూరుకు రెయిన్‌గన్ల తరలింపు
– 1000 చొప్పున గన్లు, స్ప్రింకర్లకు ఎసరు
– ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా అధికారి ఏర్పాట్లు
– ఇప్పటికే ఆదోని డివిజన్‌లో తీవ్ర వర్షాభావం
– పంటలు ఎండుతున్న సమయంలో రెయిన్‌గన్ల తరలింపు వివాదాస్పదం
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతాంగం
ఒక్క ఎకరా పంట కూడా ఎండకూడదంటారు.. అధికార యంత్రాంగాన్నంతా మోహరించామంటారు.. ప్రత్యేక అధికారులను నియమించామంటారు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటారు.. ఇవన్నీ నీటి మూటలే. కర్నూలు రైతాంగంపై ప్రభుత్వం తన పచ్చపాతాన్ని మరోసారి చాటుకుంది. పంట ఎండుతుంటే.. గుండె మండుతుంటే.. కాపాడాల్సిన ముఖ్యమంత్రి సొంత జిల్లాపై మమకారంతో ఇక్కడి పంటలను పణంగా పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా నుంచి ఇప్పటికే నిప్పులవాగు ద్వారా నెల్లూరుకు నీటిని తరలించిన ప్రభుత్వం.. తాజాగా రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లను కూడా తరలించేందుకు రంగం చేసింది. ఒకవైపు జిల్లాలో ఇప్పటికీ ఆదోని రెవెన్యూ డివిజన్‌లో వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసిన నంద్యాల రెవెన్యూ డివిజన్ నుంచి రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లను వర్షాలు కురవని ఇతర ప్రాంతాలకు తరలించే వీలుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకు ఇక్కడి రెయిన్‌గన్లు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కాస్తా ఇందుకు ఏర్పాట్లను ప్రారంభించారు. దీనిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి జిల్లాకు 4,500 రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు వచ్చాయి. ఇందులో 1000 రెయిన్‌గన్లు, వెయ్యి స్ప్రింక్లర్లు చిత్తూరు తరలించనున్నారు. అంటే జిల్లాలో మిగిలేది 2,500 రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు మాత్రమే. జిల్లాకు మరోసారి అధికార పార్టీ మోసం చేసిందని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కష్ణా పుష్కరాల సందర్భంగా కలెక్టర్ ఏర్పాటు చేసిన అభినందన సభపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం శ్రీశైలం, సంగమేశ్వరంలో విధులు నిర్వర్తించిన వారిని మాత్రమే సభకు ఆహ్వానించడం పట్ల మిగిలిన సిబ్బంది గుర్రుగా ఉన్నారు.
మేం డ్యూటీ చేయలేదా?
కష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో శ్రీశైలం, సంగమేశ్వరంలతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రిలోనూ ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించారు. అయితే, బుధవారం(31వ తేదీ) ఏర్పాటు చేసిన అభినందన సభలో కేవలం శ్రీశైలం, సంగమేశ్వరంలో విధులు నిర్వహించిన వారిని మాత్రమే ఆహ్వానించడం పట్ల మిగిలిన సిబ్బంది మండిపడుతున్నారు. తాము కూడా చివరి నిమిషంలో ఆదేశించినప్పటికీ విధుల్లో చేరి విజయవంతం చేశామని అంటున్నారు. కేవలం ముచ్చుమర్రి, నెహ్రూనగర్ ఘాట్లలోనే ఏకంగా 5.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మొత్తం 14.5 లక్షల మంది భక్తుల్లో 38 శాతం మంది భక్తులు ఈ రెండు ఘాట్లకే వచ్చారు. అయినప్పటికీ తమకు గుర్తింపునివ్వకపోవడం అవమానించడమేనని వీరు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement