రికవర్రీ | rain guns recover at anantapur | Sakshi
Sakshi News home page

రికవర్రీ

Published Mon, Mar 13 2017 9:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

rain guns recover at anantapur

► ‘పంట సంజీవని’ పరికరాల స్వాధీనంలో అవకతవకలు 
► రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, ఆయిల్‌ ఇంజన్లు,
► పైపులు తమవద్దే పెట్టుకున్న టీడీపీ నేతలు
► రివకరీకి వెళ్లిన అధికారులతో ఘర్షణ
► విధిలేక రైతులపై కేసు నమోదు చేస్తున్న అధికారులు
సాక్షిప్రతినిధి, అనంతపురం:  ‘పంట సంజీవని’ పేరుతో పంటలను కాపాడేందుకు కొనుగోలు చేసిన పరికరాల రికవరీలో గోల్‌మాల్‌ జరుగుతోంది. అదునులో తీసుకున్న పరికరాలను అవసరం తీరాక అధికారులకు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు నానాయాగీ చేస్తున్నారు. తీసుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ ‘రికవరీ’ కోసం అధికారులు పల్లెల్లోకి వెళితే వారినీ దుర్భాషలాడుతున్నారు. వారి బెదిరింపులు తాళలేక, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక వ్యవసాయాధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది.
 
ప్రణాళిక లేకుండా పంపిణీ
గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలో 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. జూలై ఆఖరు, ఆగస్టులో వర్షాభావంతో పంట ఎండిపోయింది. రైతులు ఆందోళన చెందాలి్సన అవసరం లేదని, రక్షక తడుల ద్వారా పంటలను కాపాడతామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. జూలైలోనే రెయిన్‌ గన్లు జిల్లాకు చేరాయి. అయితే కృష్ణా పుష్కరాల హడావుడిలో ఉన్న యంత్రాంగం వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేసింది. సీఎం ఆగస్టులో ధర్మవరంలో పర్యటించినా, ఆతర్వాత అనంతపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా అధికారులు వీటిని పంపిణీ చేయించలేదు.
 
పంటలు ఎండిన సంగతి తెలిసి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ఆగస్టు 22న రెయిన్‌ గన్లను రైతులకు పంపిణీ చేశారు. అప్పటికే పంట పూర్తిగా ఎండిపోయింది. ఆగస్టు 28న సీఎం ‘అనంత’ పర్యటనకు వచ్చి పంట ఎండిన సంగతి తనకు తెలీదని, తెలిసుంటే కాపాడేవాళ్లమని చెప్పారు. రెయిన్‌గన్లను రైతులకు ఇచ్చి పంటను కాపాడాలని ‘మిషన్‌– 1’ పేరుతో హడావుడి చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 2 వరకూ జిల్లాలోనే మకాం వేశారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఓ ప్రణాళిక లేకుండా పంట సంజీవని పరికరాలను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. కొన్నిచోట్ల రైతుల వద్ద పాస్‌పుస్తకాలు తీసుకుని పంపిణీ చేస్తే, ఇంకొన్ని చోట్ల పేర్లు రాసుకుని ఇచ్చేశారు. ఇలా 5,887 రెయిన్‌గన్లు, 5,495 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4,478 ఆయిల్‌ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటికి రూ.67 కోట్లు ఖర్చు చేశారు. 
 
టీడీపీ నేతలను వదిలి రైతులపై కేసులు
రెయిన్‌గన్లను రైతులు తమ పనిని ముగించుకొని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా అవి చేతులు మారాయి. ఈ ప్రక్రియ స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారి వద్దకు ఎవరు వెళితే వారికే ఇచ్చారు. మిషన్‌ – 1, మిషన్‌ – 2 పూర్తయిన తర్వాత రెయిన్‌గన్ల రికవరీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటకలోని రైతులకు విక్రయించారు. ఈ  విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయికి పంపారు. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని వారు గ్రహించారు. కొందరు నేతలు పరికరాలు వెనక్కి ఇచ్చేశారు. ఇంకొందరు పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసినవి కాకుండా వేరేవి, పని చేయకుండా తుక్కుగా ఉన్న ఆయిల్‌ ఇంజన్లను ఇస్తున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన పరికరాలు కాకుండా ఇంకా 800 రెయిన్‌గన్లు, 1,473 స్ప్రింక్లర్లు, 91,880 పైపులు, 414 ఇంజన్లు రికవరీ కావాల్సి ఉంది. వీటిని సేకరించడం అధికారులకు తలనొప్పిగా మారింది. వీటిపై ఆరా తీసే ఏఓలు, ఎంపీఈఓలపై అధికార పార్టీ నేతలు దుర్భాషలాడుతున్నారు.
 
ఎంపీఈఓలలో అధిక శాతం మహిళలు ఏం చేయాలో దిక్కుతోచక వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేసులు నమోదు చేయాలని మొదట వ్యవసాయాధికారులు భావించినప్పటికీ సంబంధిత నేతలు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జుల శరణు కోరారు. దీంతో కేసులు నమోదు చేయొద్దని, చేస్తే బదిలీ తప్పదని ఎమ్మెల్యేలు ఏఓలను హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులంతా రైతులపై పోలీసుస్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు, వీర్‌ఓలు గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తమవద్ద లేవన్నా వినడం లేదు. పరికరాలు ఇవ్వకపోతే బ్యాంకులో పంటరుణం ఇవ్వకుండా ‘బ్యాన్‌’ చేసేలా సిఫార్సు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో రైతులు తాము ఇచ్చిన రైతుల వద్దకు వెళ్లి పరికరాలు అడగడం, వారు మరో రైతుపై చెప్పడం ఇలా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తుతోంది. అధికారులు మాత్రం రైతులపైనే ఫిర్యాదు చేసి ముందుకెళ్తున్నారు. కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావాల్సి ఉంది.
 
పంట సంజీవని పరికరాల పరిస్థితి ఇదీ
రెయిన్‌గన్లు స్ప్రింక్లర్లు పైపులు ఆయిల్‌ ఇంజన్లు
పంపిణీ చేసినవి 5,887 5,495 4,17,000 4,478
రికవరీ అయినవి 5,087 4,022 3,25,120 4,064
రికవరీ కావల్సినవి 800 1,473 91,880 414

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement