ప్రతి పంచాయతీలో రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు
– జిల్లా కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండుతున్న పంటలను కాపాడేందుకు తక్షణం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రెండు రెయిన్‌గన్‌లు, రెండు స్ప్రింక్లర్లతో పాటు వాటికి అవసరమైన పైపులు సిద్ధంగా ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితరులు సమన్వయంతో పంటలను కాపాడాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌తో సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 60 హెక్టార్లను ఒక యూనిట్‌గా గుర్తించినందున ఆ యూనిట్‌లో ఉన్న రైతులందరి వివరాలను సేకరించాలన్నారు. మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు, ఎంపీడీఓలు పంటలను తడపడంలో బాధ్యత తీసుకోవాలని, గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఇఓలు పర్యవేక్షించాలన్నారు. ఒక్క ఎకరాలో కూడా పంట ఎండకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.