నేటి నుంచి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు
నేటి నుంచి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు
Published Thu, Nov 17 2016 10:39 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– నగదు రహిత చెల్లింపుల బాధ్యత ఎంపీడీఓలదే
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అర్బన్): అన్ని గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి ఉపాధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ, జన్‌ధన్ ఖాతాలు, నగదు రహిత లావాదేవీలు తదితర అంశాలపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో కూలీలు వలస పోకుండా చూడాలన్నారు. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించాలన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాబ్‌కార్డులను అప్‌డేట్ చేయడం, ఫారంపాండ్ల పూర్తి, వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. 15 రోజుల్లో ఆయా పనులపై పురోగతి చూపించాలని ఆదేశించారు. ఎక్కడైనా కరువు పనులు చేపట్టకుంటే ఫోన్ ద్వారా కలెక్టరేట్‌కు సమాచారం అందించేలా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు, ఉపాధి కూలీలు, డ్వాక్రా సభ్యులు పలు ఇబ్బంధులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పాస్ విధానం ద్వారా చౌక ధరల దుకాణాలు, మందుల షాపుల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. జన్‌ధన్ ఖాతాలు లేని వారికి కొత్తగా ప్రారంభించేందుకు బ్యాంకర్లు సమ్మతించారని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ బీఆర్ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ సీహెచ్ పుల్లారెడ్డి, ఎల్‌డీఎం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement