నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి పై వేటు
నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి పై వేటు
Published Wed, Dec 7 2016 12:11 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
సర్వీసు నుంచి తొలగిస్తూ కలెక్టరు ఆదేశాలు
రాజానగరం : దివాన్‌చెరువు పంచాయతీ నిధులు దుర్వినియోగం పై ఆ పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన ప్రస్తుతం ఏలేశ్వరం మండలం, యర్రవరం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బీవీవీఎస్‌ఎన్ మూర్తి పై వేటు పడింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అతనిని సర్వీసు నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కాపీ స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి కూడా చేరింది. ఏపీసీఎస్ (సీసీఏ) రూల్ 1991 యాక్ట్ ననుసరించి ఈ చర్య తీసుకున్నట్టుగా పేర్కొన్నారు.
ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో ....
దివాన్‌చెరువు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దేశాల వెంకటరామారావు (శ్రీను) ప్రజావాణిలో 2015 ఆగస్టు మూడున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. సర్పంచ్ కొవ్వాడ చంద్రరావుతో కలిసి 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా గతేడాది నవంబరులో డీఎల్‌పీఓ చేసిన విచారణ నివేదిక ద్వారా గుర్తించి, సర్పంచ్‌కి, ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న మూర్తికి గత ఏడాది డిసెంబరు ఒకటిన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానికి మూర్తి జనవరిలో ఇచ్చిన జవాబును అనుసరించి డీఎల్‌పీఓ ఫిబ్రవరి 20న మరో నివేదికను అందజేశారు. దానిపై అప్పటికే రావులపాలెం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మూర్తిని సస్పెండ్ చేస్తూ మే 31న చార్జ్ మెమో ఇచ్చారు. దానిపై అతని నుంచి వచ్చిన సమాధానంతోపాటు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారం అతని సస్పెన్షన్‌ని రద్దు చేసి, ఏలేశ్వరం మండలం, యర్రంవరం పంచాయతీకి జూనియర్ అసిస్టెంట్‌గా జూన్ 22న ఉత్వర్వులిచ్చారు.
సబ్ కలెక్టరు నివేదికతో పడిన వేటు
ఇదిలావుండగా దివాన్‌చెరువు పంచాయతీ నిధుల దుర్వినియోగం సంఘటనపై వస్తున్న రకరకాల కథనాలు, జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరును విచారణకు ఆదేశించారు. సెప్టెంబరు 29న సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదికలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా గుర్తించడంతోపాటు ఇటువంటి వారిని సర్వీసులో కొనసాగించడం ప్రమాదకరమని, సర్వీసు నుంచి తొలగించాలంటూ ప్రతిపాధించారు. సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదిక ప్రకారం పంచాయతీలో రూ.78 లక్షల 80 వేల 755ల నిధులు దుర్వినియోగం అయినట్టుగా నిర్థారించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఖాతరు చేయకుండా, విచక్షణా రహితంగా బిల్లు కలెక్టరును, 44 మంది పారిశుద్ధ్య కార్మికులను (పోస్టులు మంజూరు లేకుండానే) నియమించుకోవడాన్ని తప్పుపట్టారు. అలాగే ఇంటి పన్నులుగా వసూలు చేసిన రూ. 67,961లు పంచాయతీ ఆదాయంలో జమ చేయకపోవడాన్ని, వాటర్ టాక్స్‌గా వసూలు చేసిన రూ.3,960ని కూడా జమ చేయకపోవడాన్ని గుర్తించారు. ఇదే విధంగా వివిధ రకాల ఖర్చులలో వచ్చిన తేడాలను, జరిగిన అవినీతిని తన నివేదికలో వివరంగా పేర్కొన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.34 లక్షల 34 వేల 613లు, పంచాయతీ సాధారణ నిధుల నుంచి రూ.36 లక్షల 51 వేల, 921లు, వాటర్ టాక్స్, పారిశుద్ధ్య కార్మికులకు నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించిన మొత్తం రూ.ఏడు లక్షల 22 వేల, 300లు, వసూలు చేసిన వాటర్ టాక్స్‌ని పంచాయతీ జమ చేయకుండా వాడకున్న మొత్తం రూ.71 వేల, 921లుగా ఉన్నాయి. ఇదిలావుండగా నిధుల దుర్వినియోగంలో పంచాయతీ సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు ఇప్పటికే సస్పెండ్ అయివున్నారు. కాగా ఈ విషయమై సర్వీసు నుంచి తొలగించబడిన మూర్తిని ఫోన్‌లో వివరణ కోరగా దుర్వినియోగంలో తాను నిర్థోషినన్నారు. అదే విషయాన్ని మరోసారి రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
Advertisement