ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన పొలంలో రెయిన్ గన్స్ ద్వారా వేరుశెనగ పంటను తడుపుతున్న దృశ్యం
రైతుల దరిచేరని రెయిన్ గన్స్
Published Tue, Aug 23 2016 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
– అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యత
– మెట్టచేలలో పంటను తడపని వైనం
– పంట తడవాలంటే రైతుల జేబులకు చిల్లే
చిత్తూరు (అగ్రికల్చర్):
జిల్లాలో వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కనీసం రెయిన్ గన్స్‌తోనైనా తడిని ఇవ్వగలమా అని రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రెయిన్ గన్స్ రైతుల దరిచేరక, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకే పరిమిత మవుతున్నాయి. మెట్ట చేలల్లో ఎండిపోతున్న వేరుశనగ పంటను తడపడంలో అధికారులు మీనమీషాలు లెక్కిస్తూ కాలం గడుతున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యం. ఎలాగోలా పంటను కాపాడుకోవాలని అధికారులను ఆశ్రయిస్తున్న రైతుల జేబులకు చిల్లులు పడుతున్నాయే గాని సహకారం లేదు.
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనుకు రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వర్షాధార వేరుశనగ పంటను సాగుచేస్తున్నారు. అయితే గత 25 రోజులుగా వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంట ఎండిపోయే దుస్థితికి వచ్చింది. ఒక్క ఎకరం కూడా వేరుశనగ పంటను ఎండనీయమంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. ప్రస్తుతం ఎండిపోతున్న వేరుశనగ పంటను కనీసం మేరకు తడిపేందుకు జిల్లాకు 600 రెయిన్ గన్స్, 251 జనరేటర్లు, 2,400 స్పింకర్లు, 15 వేల డ్రిప్ వైపులను అందించింది. వీటి ద్వారా ఎండిపోతున్న పంటను తడిపేందుకు ఆయా మండలాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రైతులు ముందస్తుగా అధికారులను కలిసి పేర్లను నమోదు చేసుకుంటే, వరుస క్రమం ప్రకారం పంటను తడిపే పనులు చేయాల్సి ఉంది.
పచ్చచొక్కాలకే పరిమితం
రైతుల చేలలో వేరుÔ¶ నగ పంటను తడిపేందుకు అందించాల్సిన రెయిన్‌గన్స్, జనరేటర్లు, స్పింకర్లు తదితరాలు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకే పరిమితమవుతున్నాయి. ఆయా మండలాలకు చేరిన రెయిన్‌గన్స్, జనరేటర్లు, స్పింకర్లు, డ్రిప్ పైపులు ముందస్తుగా అధికార పార్టీ ప్రజాప్రనిధులు సూచనల మేరకే అధికారులు అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తార్కాణంగా జిల్లా కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలోనే మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన 11 ఎకరాల వేరుశనగ పంటను తడిపేందుకు అధికారులు ముందుగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రెండు రెయిన్‌గన్స్, 8 స్పింక్లర్స్‌ను అధికారులు ఏర్పాటు చేసి పంటను తడిపే పనులు చేపట్టారు. అధికారులు ఏమాత్రం రైతులకు సేవలు అందిస్తున్నారనేది దీన్నిబట్టి చూస్తేనే అర్థమవుతోంది. తమ పొలంలో పంట తడపాలని రైతులు అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే ‘‘మీ చేను వద్ద నీటి సౌకర్యం ఉందా, విద్యుత్ సౌకర్యం ఉందా, లేని పక్షంలో ట్యాంకర్‌తో నీటిని చేనులోకి తీసుకురాగలవా’’ అంటూ అధికారులు రైతులకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మెట్ట ప్రాంతంలో తడవని పంట
వేరుశనగను వర్షాధార పంటగా రైతులు ఎక్కువగా మెట్ట ప్రాంత చేలల్లోనే సాగుచేస్తారు. ఈ ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉండని కారణంగా, వర్షాభావ పరిస్థితుల్లో పంటను కాపాడుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి. అయితే ఈ ఖరీఫ్‌కు వేరుశెనగ పంటను ఎండకుండా కాపాడుతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించడమే కాకుండా, పంటను కాపాడుకునేందుకు అధికారులను ఆశ్రయిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మెట్ట చేలల్లో నీటి సౌకర్యం ఉండదని, కావున రైతులే ట్యాంకర్ల ద్వారా నీటిని చేలలోకి తీసుకురాగలగితే రెయిన్ గన్స్ అందిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు పంటను తడుపుకోవాలంటే ఒక్కో ట్యాంకర్ నీటి కోసం రూ.500 నుంచి రూ.700 వరకు ఖర్చుపెట్టాల్సి ఉంది. దీంతో కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పంటను తడపాలంటే కనీసం 4 ట్యాంకర్ల నీటిని తెప్పించాల్సి ఉంది. దీనికితోడు రెయిన్ గన్స్‌కు అమర్చే నీటిని తోడే జనరేటర్లకు విద్యుత్ సౌకర్యాన్ని కూడా రైతులే ఏర్పాటు చేయాలి. మెట్ట చేలల్లో కనుచూపు మేరల్లో కూడా విద్యుత్ కనెక్షన్లు దొరకడం కష్టతరంగా ఉంది. అదేగాక ట్యాంకర్ నుంచి నీటిని తోడేందుకు అవసరమైన ఫుట్‌బాల్‌ను కూడా రైతులే తెచ్చి పైపునకు బిగించుకోవాలి. ఇలాంటి నిబంధనలతో రైతులు పంటలను తడుపుకోలేక పోతున్నారు.
శాంపిల్ కోసం ఏర్పాటు చేశాం
ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి వేరుశనగ పంటను తడపడాన్ని ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన చేనులో శాంపిల్ చూశాం. ఈ విధానం విజయవంతం అవుతుంది. కావున రైతుల పంటను తడిపేందుకు చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌కుమార్, జేడీ వ్యవసాయశాఖ
Advertisement
Advertisement