సాక్షి, అమరావతి: అవినీతికి అదీ ఇదీ లేదు అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరించింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌గ్రిడ్, టిడ్కో ఇళ్ల స్కాం మాదిరిగా స్కాంల జాబితాలో ఇంకా ఉన్నాయి. రెయిన్‌గన్లతో కరువును జయించాం అంటూ చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అవినీతి కూడా ఇందులో భాగమే. బాబు పాలనలో ఐదేళ్లూ కరువు కాటకాలే అన్నది అందరికీ తెలిసిందే. ఏటా సగటున 279 పైగా కరువు మండలాలు ఉండేవి.
పంట పొలాలన్నీ బీడు వారడంతో పెద్దఎత్తున రైతులు వలస బాటపట్టారు. 2016–2018 మధ్య రూ.163 కోట్లు ఖర్చుచేసి 13,650 రెయిన్‌గన్లు, 13,650 స్ప్రింక్లర్లు, 3.50 లక్షల నీటిసరఫరా పైపులు, 8,109 ఆయిల్ ఇంజన్లను అప్పటి టీడీపీ సర్కారు కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ, మరమ్మతుల కోసం మరో రూ.103 కోట్లు విడుదల చేసింది. కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడడమే కాక నిబంధనలకు పాతరేస్తూ పచ్చచొక్కాలు వేసుకున్న వారికి పప్పుబెల్లాల్లా వాటిని పంచిపెట్టింది.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెయిన్‌గన్ల వ్యవహారంపై జరిపిన విచారణలో భారీ అవినీతి బాగోతం వెలుగుచూసింది. మూలపడిన వాటితో పాటు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు చేరిన పరికరాలను స్వా«దీనం చేసుకుంది. ఈ విధంగా పక్కదారి పట్టిన రూ.112 కోట్ల విలువైన 11,449 రెయిన్‌గన్లు, 6,354 ఆయిల్ ఇంజన్లతో పాటు 13,778 స్ప్రింక్లర్లు, 7.99 లక్షల వాటర్ పైపులను స్వా«దీనం చేసుకున్నారు.
రైతురథాల పేరిట ‘కోట్లు’ స్వాహా
వ్యక్తిగత, గ్రూపుల పేరిట ఇచ్చిన యంత్ర పరికరాల కంటే రైతురథాల పేరిట చంద్రబాబు సర్కారు ఇచ్చిన ట్రాక్టర్ల కొనుగోలులోనే ఎక్కువగా అవినీతి జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల సిఫార్సుతో 2017–18లో 12,204 ట్రాక్టర్లు,, 2018–19లో 11,072 ట్రాక్టర్లు పచ్చనేతలకు పంచిపెట్టారు. ఏ కంపెనీ డీలర్ వద్ద ఏ ట్రాక్టర్ కొనాలో ప్రభుత్వమే నిర్దేశించేది. సబ్సిడీ మొత్తం కూడా ఆయా డీలర్ల ఖాతాలకే జమచేసేది.
ట్రాక్టర్లతో సహా యంత్ర పరికరాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన కంపెనీ డీలర్ల నుంచే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. పైగా.. మార్కెట్ రేటు కంటే 30 శాతం అధికంగా కోట్‌చేసి ఆ సొమ్ము దర్జాగా జేబుల్లో వేసుకున్నారు. రైతుల పేరిట దొడ్డిదారిన చేజిక్కించుకున్న ట్రాక్టర్లను దర్జాగా మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ పథకం పేరిట రూ.200 కోట్లకు పైగా సబ్సిడీ సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment