సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది.
స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది.
ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది.
ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్‌ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.
జోక్యం అవసరం లేదన్న సీఐడీ
తాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు.
ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.
సీఐడీ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment