16 వరకు రెయిన్‌గన్లతో పంటలకు నీటి తడులు
– డీడీఏ ప్రభాకర్‌రావు
పత్తికొండ టౌన్: వర్షాభావ పరిస్థితుల్లో వాడుతున్న పంటలకు రెండో విడత కింద 16వతేదీ వరకు రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లతో నీటితడులు అందిస్తామని వ్యవసాయశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని హోసూరు, చిన్నహుల్తి గ్రామసమీపాల్లో రెయిన్‌గన్లతో నీటితడులు అందిస్తున్న పంటలను డీడీఏ పరిశీలించారు. హోసూరు గ్రామసమీపంలో పైగేరి రంగస్వామి అనే రైతుకు చెందిన వేరుశెనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....జిల్లాలోని 53మండలాల్లో 461 గ్రామాల్లో 29,857 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వాడిపోతూ బెట్టపరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లుతో బోరుబావులు, కాలువలు, ఫాంపాండ్లు నుంచి మోటార్లతో నీటిని తోడి పంటలకు అందించే చర్యలు చేపట్టామన్నారు. జిల్లాకు 3038 రెయిన్‌గన్లు, 2066 స్ప్రింక్లర్లు, 27640 పైపులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పత్తికొండ సబ్‌డివిజన్ ఏడీఏ నారాయణనాయక్, పత్తికొండ, మద్దికెర ఏఓలు రాజకిశోర్, కిరణ్‌కుమార్, ఏఈఓలు రుక్సానా, రంగన్న, యోగీంద్ర తదితరులు పాల్గొన్నారు.