ఏ మూలకూ చాలవు
ఏ మూలకూ చాలవు
Published Wed, Sep 7 2016 12:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– ఎకరాకు 20వేల లీటర్ల నీటితోనే సరిపుచ్చుతున్న వైనం
– కనీసం 40వేల లీటర్ల నీటితో తడులివ్వాలంటున్న రైతాంగం
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండిన పంటలకు రెయిన్‌గన్‌ల ద్వారా తడులిచ్చేందుకు తలపెట్టిన ప్రభుత్వం ఎకరాకు 20వేల లీటర్ల నీటితో సరిపెడుతుండడంపై రైతులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం 20వేల లీటర్లకే సబ్సిడీ ఇస్తుండటంతో అదే స్థాయిలోనే తడులు ఇస్తున్నట్లు సమాచారం. ఎండిన పంటలకు ఈ నీరు ఏ మూలకు చాలవని, కనీసం 40వేల లీటర్ల నీటితో తడులివ్వాలని కోరుతున్నారు. 4వేల లీటర్ల కెపాసిటి కల్గిన ట్యాంకర్లు 5 తరలించేందుకు రైతులు రూ.600 భరించాల్సి ఉంది. దీనిని ట్రాక్టర్ డీజిల్‌కు వినియోగిస్తారు. 5 ట్యాంకర్ల నీటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. తొలుత ఎకరాకు 40 వేల లీటర్ల నీటితో తడులు ఇవ్వాలని ప్రభుత్వమే సూచించింది. చివరికి 20వేల లీటర్లతో మమ అనిపిస్తోంది. ఆదోని రెవెన్యూ డివిజన్ మొత్తంగా కరువు అలుము కున్నా ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, దేవనకొండ మండలాల్లోని పంటలకు మాత్రమే తడులు ఇస్తుండడం గమనార్హం. దీంతో మిగతా మండలాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎండిన పంటలకు తడులు ఇవ్వడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. అక్కడక్కడ చెరువులు, కుంటల్లో నీరు అంతంతమాత్రంగా ఉంది. ఈ నీటితో కొద్దిమేరకు తడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతంత మాత్రం ఉన్న నీటిని ట్యాంకర్లతో తరలిస్తే ఉన్న నీరు ఖాళీ అవుతుంది, వర్షాలు పడకపోతే పశువులు తాగేందుకు కూడా నీళ్లుండవంటూ వాదిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1000 ఎకరాలకు తడులిచ్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. 7 మండలాల్లో అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం దాదాపు 27వేల ఎకరాల్లో పంటలు ఎండినట్లు సమాచారం.
Advertisement