రెయిన్‌గన్‌లతో పంటలను కాపాడండి
Published Tue, Aug 30 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు రెయిన్‌గన్‌లతో నీటి తడులు అందించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి.. కార్మిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని కమాండ్ ఏరియా కంట్రోల్ రూంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒక్క ఎకరా పంట కూడా ఎండకూడదని.. ఇందుకోసం జిల్లాకు అవసరమైన రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, పైపులను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. ఈ విషయంలో నీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రధానంగా వర్షం కురవని ఆదోని డివిజన్‌పై దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా జేసీ–2 ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాత్రి వర్షం కురిసినందున కాస్త ఇబ్బందులు తొలిగాయన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ఆర్‌డబ్లు్యఎస్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి రెయిన్‌గన్‌లతో పంటలను తడుపుతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కర్నూలు, బనగానపల్లె, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
Advertisement