8 ఎకరాలు..20 కిలోలు!
సీఎం చంద్రబాబు రక్షకతడులు ఇచ్చిన పొలంలో దిగుబడి ఇది
పెట్టుబడి రాక అప్పులపాలైన వేరుశనగ రైతు శివన్న
తొలకరి వర్షాలతో రైతుల్లో ఆశలు రేకెత్తించిన ఖరీప్ పంట కాలం... విత్తు తర్వాత చినుకు నేలకు రాలకపోవడంతో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి.. నానా కష్టాలు పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి విషమించే వరకూ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. పంట ఎండిపోతుండగా అంటే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హఠాత్తుగా తెరపైకి వచ్చారు.
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తన దృష్టికి తీసురాలేదని తప్పంతా అధికారులపై నెట్టేశారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటూ ఏ ఒక్క ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వబోనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెయిన్‌గన్‌లతో రక్షకతడులు అంటూ హడావుడి చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబునే వచ్చి తన పొలంలో రక్షక తడులు ప్రారంభించడంతో ఆ బడుగు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక తన పంట పండుతుందని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో బతకవచ్చునని ఆశించాడు. పంట దిగుబడి వచ్చిన తర్వాత చూస్తే... బతుకు బజారు పాలైంది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న తనకున్న ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టారు. పంట పెట్టుబడి కింద రూ.1.20 లక్షలు అప్పు చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎండు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమడగూరులో పర్యటించి శివన్న పొలంలో రెయిన్‌గన్‌లతో రక్షక తడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆర్భాటానికే పరిమితమైన తడులు
ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం అధికార పార్టీ నాయకులు, అధికారులు ఆడిన చదరంగంలో శివన్న ఓ పావుగా మిగిలాడు. ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన తడితో పంట మొత్తం జీవం పోసుకుంటుంది. ఇక పంట పండుతుంది అని నమ్మించారు. ఆ తర్వాత మరొక్క తడిని ఇవ్వలేకపోయారు. పంట మొత్తం ఎండిపోయింది. ట్రాక్టర్‌తో ఎనిమిది ఎకరాల పొలంలో వేరుశనగ పంట తొలగిస్తే... 20 కిలోల కాయలు మాత్రమే వచ్చాయి! స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పర్యటించి రక్షకతడులు ప్రారంభించిన పొలం రైతు పరిస్థితే ఇలా ఉంటే మరి మిగిలిన రైతుల బతుకులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
కుటుంబాన్ని పస్తులు ఉంచలేక..
ఎనిమిది ఎకరాల్లో పంట సాగుకు అయిన రూ.1.20 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మదన పడుతున్న శివన్న.. మరో కొత్త సమస్య మరింత చిక్కుల్లో నెట్టేసింది. కరువు నేపథ్యంలో జీవనోపాధులు కరువవ్వడంతో భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు అర్ధాకలితో అలమటించాల్సి వచ్చింది. విషయాన్ని గుర్తించిన శివన్న... తనకు తెలిసిన వారి నుంచి ఆర్థిక సాయాన్ని పొంది గ్రామాల్లో తిరుగుతూ బురకల (స్నాక్స్) వ్యాపారం చేపట్టాడు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, గూళ్లురు, బిళ్లూరు, చేళూరు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి బురకలు అమ్ముకుని వస్తున్నాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు
బుధవారం అమడగూరులో బురకలు అమ్ముకుంటున్న శివన్నను సాక్షి పలకరించగా.. ఏం చెప్పమంటావులే అంటూ, తన గోడును వెళ్లబోసుకుని, కన్నీటి పర్యంతమయ్యాడు. 2014లో ఎన్నికలకు ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి కుటుంబ సభ్యులంతా టీడీపీకి ఓట్లేసినట్లు తెలిపారు. బ్యాంక్‌లో తనకున్న రూ. 54 వేల అప్పు మాఫీ కాలేదని, 70 ఏళ్ల వయసు మీద పడుతున్నా పింఛన్ కూడా అందడం లేదని వాపోయాడు. ప్రస్తుతం ఇంటిల్లిపాదీ కూలికెళ్తే గానీ పూటగడవని పరిస్థితి దాపురించిందన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 28న సీఎం చంద్రబాబు తన పొలానికి వచ్చి రక్షకతడులు ఇచ్చాడని, తన పంట పండిస్తాడులే అనుకుంటే ఇలా బజారుపాలు చేస్తాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారుని వాపోయాడు.