పేలని రెయిన్ గన్!
పేలని రెయిన్ గన్!
Published Wed, Nov 2 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
- అంతా హడావుడే
- ఒక్క ఎకరా తడిపితే ఒట్టు
- ట్యాంకుర్లు లేవు
- పైపుల కొరత తీవ్రం
- కొనసాగుతున్న వర్షాభావ
- ఎండుతున్న పంటలు
కర్నూలు(అగ్రికల్చర్): ‘ఒక్క ఎకరాలో కూడా పంట ఎండరాదు... అలా ఎండితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరోవైపు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
‘ ఎండుతున్న పంటలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ట్యాంకర్లు లేవు, పైపుల కొరత ఎక్కువగా ఉంది. అసలు నీళ్లులేవు.’ అంటూ వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం ఖరీప్‌లో వేసిన కంది, పత్తి, వరిలతో పాటు రబీలో వేసిన శనగ పంటలు 56,497 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. వీటìకి అత్యవసరంగా నీటి తడులు ఇవ్వాల్సి ఉంది. వారం రోజులుగా జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా ఇంతవరకు ఒక్క ఎకరా పంటకు కూడ నీటి తడులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెయిన్‌గన్‌ల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నా.. ఫలితం మాత్రం నామమాత్రమే.
బోగస్ లెక్కలు..
ఆగస్టులో ఏర్పడిన వర్షాభావం వల్ల ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. అయితే 86వేల ఎకరాలకు నీటి తడులు ఇచ్చినట్లు జిల్లా యంత్రాంగం లెక్కలు చెబుతున్నా అంతా బోగస్ అంటూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రభుత్వం జిల్లాలో 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. కరువు మండలాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేసి ఇన్‌పుట్ సబ్సిడీకి నివేదిక పంపాలని ఆదేశించింది. కాని జిల్లాలో పంట నష్టం సర్వేను పక్కన పెట్టి రెయిన్‌గన్‌లతో పంటలకు నీటి తడులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండుతున్న పంటలకు నీటి తడులు ఇవ్వడం మంచిదే అయినప్పటికి అందుకు తగిన సదుపాయాలు కల్పిస్తే కదా సాధ్యమయ్యేది అంటూ వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ట్యాంకర్లు ఏవీ....
ఎండుతున్న పంటలను తడపటానికి రైతుల భూముల దగ్గర నీళ్లులేవు. దూరప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకొని రెయిన్‌గన్‌లతో పంటలకు తడులు ఇచ్చుకోవాలి. వారం, 10 రోజుల నుంచి హడావుడి చేస్తున్నా ఇంతవరకు ఒక్క అయిల్ ట్యాంకరు కూడా సమకూర్చిన దాఖాలాలు లేవు. ఒక్క ఎకరాలోని పంటను తడుపుకోవడానికి కనీసం 10 ట్యాంకుల నీళ్లు అవసరం. ట్యాంకులు లేకపోవడంతో పంటలకు రక్షక తడులు ఇవ్వడం ప్రశ్నార్థకం అయింది. దీనికి తోడు పైపుల కొరత వేధిస్తోంది. కర్నూలు సబ్ డివిన్‌కు 21వేల పైపులు అవసరం ఉండగా ఇంతవరకు నామమాత్రంగానే ఇచ్చారని, వీటితో ఎలా పంటలకు నీటి తడులు ఇచ్చుకుంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
దెబ్బతిన్న పంటలు..
అక్టోబరు నెల మొత్తంగా వర్షాలు లేకపోవడం వల్ల పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్టోబరులో 114.5 మిమీ సాధారణ వర్షపాతం ఉండగా 8.9 మిమీ మాత్రమే కురిసింది. నెల రోజులకు పైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో రబీ పంటల సాగు ముందుకు సాగడం లేదు. కర్నూలు సబ్ డివిజన్‌లో 19,859 హెక్టార్లు, మద్దికెర మండలంలో 10,026, డోన్ సబ్ డివిజన్‌లో 7,106, నందికొట్కూరు సబ్ డివిజన్‌లో 2,431, ఆదోని సబ్ డివిజన్‌లో 5,801, దేవనకొండ మండలంలో2,454, పత్తికొండ మండలంలో 2,550, హాలహర్వి మండలంలో 2,101, హోళగుంద మండలంలో 1,445 హెక్లార్ల ప్రకారం పంటలు దెబ్బతిన్నాయి. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే రబీ పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
Advertisement
Advertisement