ఆటంకం
పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ఏటిగ ట్టుపై విద్యుత్ స్తంభాల ఏర్పాటుకి ఆటంకం ఏర్పడింది. నీటిపారుదలశాఖ అధికారులు ఏటిగట్టు తవ్వడానికి అనుమతించకపోవడంతో స్తంభాల ఏర్పాటు నిలిచిపోయింది. ప్రధానంగా కొవ్వూరు, తాళ్లపూడి మండలాల పరిధిలో సుమారు 100 స్తంభాలకు పైగా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా ఔరంగాబాద్, వాడపల్లి గ్రామాల మధ్య డిసెంబర్‌లో స్తంభాల ఏర్పాటు కోసం ఏటిగట్టుపై పొక్లయినర్‌తో గోతులు తవ్వారు. నీటిపారుదల శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిపివేశారు.
కొవ్వూరు :గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ (ఏపీఈపీడీఎల్)కి రూ.18, 34, 81,000లు మంజూరయ్యాయి. వీటితో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, సబ్‌స్టేషన్‌ల నిర్మాణం, స్నానఘట్టాల వద్ద విద్యుత్ సౌకర్యం, లోవోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం వివిధ లైన్ల ఏర్పాటు పనులు చేపట్టనున్నారు. డిసెంబర్ 8న విద్యుత్ శాఖ అధికారులు ఏటిగట్టుపై స్తంభాల ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాశారు. ఇప్పటి వరకు దీనిపై ఏవిధమైన స్పష్టత రాలేదు. పుష్కరాల పనులపై ప్రత్యేక అధికారి, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. ఉన్నతాధికారుల నుంచి ఈ అంశంపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఫిబ్రవరి 3న మళ్లీ పుష్కరాల ప్రత్యేక అధికారి, ఇరిగేషన్ ఎస్‌ఈకి లేఖ రాశామని విద్యుత్ శాఖ ఏపీఈపీడీఎల్ ఎస్‌ఈ తెలిపారు.
ఏటిగట్టుపై ఏర్పాటు చేసే స్తంభాలు పనులు పూర్తయితే తప్ప నూతన విద్యుత్ లైన్లకు విద్యుత్ సరఫరా అందే పరిస్థితి లేదు. అన్ని శాఖల కంటే ముందే విద్యుత్ శాఖ పనులు మొదలు పెట్టినప్పటికీ ఈ విధమైన ఆటంకం ఏర్పడడంతో పనులు జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ఈ విద్యుత్‌లైన్ పూర్తి కాకపోతే స్నానఘట్టాల వద్ద విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు ఇబ్బంది ఏర్పడనుంది. ఇప్పటికే కొవ్వూరు సబ్‌డివిజన్‌కు రూ.5.69 కోట్లు మంజూరు కాగా వీటిలో ఆరికిరేవుల సబ్‌స్టేషన్‌తో కలిపి సుమారు రూ.2.47 కోట్ల విలువైన 35 శాతం పనులు పూర్తయ్యాయి. నర్సాపురం సబ్ డివిజన్‌కు రూ.11 కోట్లు మంజూరు కాగా వీటిలో సుమారు రూ.3కోట్ల విలువైన సుమారు 25 శాతం పనులు పూర్తయ్యాయి. పుష్కరాలకు మరో నాలుగున్నర నెలలు మాత్రమే సమయం ఉంది. గడువు సమీపిస్తున్నందున ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఇప్పిస్తే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది.
అభ్యంతరానికి కారణం ఇదీ
గోదావరి పరిరక్షణ చట్టం - 1884 ప్రకారం నదిగర్భంలో గానీ, ఏటిగట్టుపైన గానీ ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ పనులు చేపట్టడానికి పలు రకాల ఆంక్షలున్నాయి. ఇరిగేషన్ అధికారుల అనుమతులు లేకుండా ఆ పనులు చేపట్టడానికి వీలు లేదు. ఏటిగట్టు తవ్వి స్తంభాలు ఏర్పాటు చేస్తే గట్టు పటిష్టత దెబ్బతినే అవకాశం ఉంటుందని అధికారుల వాదన. భవిష్యత్‌లో గోదావరి ఏటిగట్టు విస్తరణ పనులు, ఇతర పనులు చేపట్టాలంటే ఏటిగట్టుపై ఉండే విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. విద్యుత్ శాఖకి షిఫ్టింగ్ చార్జీలు చెల్లిస్తే తప్ప స్తంభాలు తొలగించే అవకాశం లేదు. ఆ భారం నీటిపారుదల శాఖ భరించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు స్తంభాల ఏర్పాటుకి అంగీకరించడం లేదు. గతంలో గోదావరి నక్లెస్ బండ్ నిర్మాణం సమయంలో పోలవరం వద్ద ఈ రకమైన పరిస్థితినే నీటిపారుదలశాఖ అధికారులు ఎదుర్కొన్నారు. అప్పట్లో సుమారు రూ.5లక్షల మేర విద్యుత్ స్తంభాల తొలగింపు కోసం నీటిపారుదల శాఖ విద్యుత్ శాఖకి చెల్లించాల్సి వచ్చింది. దీనికితోడు గట్టు దెబ్బతింటుందనేది మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఏటిగట్టుపై స్తంభాల ఏర్పాటుకి అనుమతుల కోసం ఈఎన్‌సీకి లేఖలు పంపినట్టు నీటిపారుదల శాఖ హెడ్‌వర్క్సు ఎస్‌ఈ ఎస్ సుగుణాకరరావు తెలిపారు. ఈఎన్‌సీ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే స్తంభాల ఏర్పాటు, ఇతర పనులు చేపట్టేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.
లోవోల్టేజ్ సమస్యలకు మోక్షం
గోదావరి పుష్కరాలకు జిల్లాలో ప్రధాన వేదిక కానున్న కొవ్వూరు పట్టణంతో పాటు, నర్సాపురం మునిసిపాలిటీలో లోవోల్టేజ్ సమస్యకి తెరపడనుంది. నర్సాపురంలో 100 కేవీ, 63 కేవీ సామర్థ్యం ఉన్న రెండేసి ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 40 కేవీ ఒకటి, మరో ఐదు సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. యలమంచిలిలో 11, నర్సాపురం మండలంలో ఐదు సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. కొవ్వూరు సబ్ డివిజన్‌లో 100 కేవీ -10, 63 కేవీ-6, 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లు రెండు, ఐదు సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు వేయనున్నారు. వీటిలో అత్యధిక శాతం కొవ్వూరు పట్టణంలోనే ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు ఆయా స్నానఘట్టాల వద్ద అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు తాత్కాలికంగా అమర్చనున్నారు. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంచుతామని అధికారులు చెబుతున్నారు. పోలవరంలో 63 కేవీ రెండు, 100 కేవీ ఒక ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు మండలంలో నదీతీరంలో 15 సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చనున్నారు. ఈ పనులన్నీ ఏటిగట్టుపై విద్యుత్‌లైను ఏర్పాటు పనులతో ముడిపడి ఉన్నారుు.
ఏడు సబ్‌స్టేషన్ల నిర్మాణం
పుష్కరాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏడు సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. దీనిలో కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో ఇప్పటికే రూ.1.40 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. పట్టణంలో సత్యవతినగర్‌లో మరో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖ దాన్ని విద్యుత్ శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. నర్సాపురం సబ్ డివిజన్‌లోని సీతారామపురం, పుష్కర ఘాట్, నవరసపురం, దొడ్డిపట్లరోడ్డు లలో మరో నాలుగు సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో కేపీపాలెంలో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈనెలాఖరు నాటికి సీతారామపురం సబ్‌స్టేషన్ పనులు, మార్చి నెల చివరి నాటికి మిగతా సబ్‌స్టేషన్ల పనులు పూర్తి చేయడానికి పనులు వేగంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.