ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు
- చెరువులు ధ్వంసం
- మాముళ్ల మత్తులో ఇరిగేషన్ శాఖ అధికారులు
ఓజిలి : స్వర్ణముఖినది పొర్లుకట్ట పేరుతో చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చెరువుల్లో అధికంగా మట్టిని ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. చెరువులు నుంచి పొర్లుకట్టలకు మట్టిని భారీగా తరలించి రూ.లక్షలు జేబులు నింపుకుంటున్నారు. ఈ మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు అలసత్వంతో జోరుగా వ్యాపారం సాగుతోంది. నాయుడుపేట, ఓజిలి మండలాల పరిధిలోని సుమారుగా 6 కిలోమీటర్లు పొర్లుకట్టలకు అధికారులు టెండర్‌లు నిర్వహించారు.
నెల్లూరు నగరానికి చెందిన కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నారు. జోష్యులవారి కండ్రిగ, తిమ్మాజికండ్రిగ గ్రామాల పరిదిలో మూడు కిలోమీటర్లు, కొత్తపేట, పున్నేపల్లి గ్రామాల పరిదిలో 1.50 కిలోమీటర్లు పొర్లుకట్టలను నిర్మించాల్సి ఉంది. అయితే తిమ్మాజికండ్రిగ, జోష్యులవారికండిగ పొర్లు కట్టలకు జోష్యులవారికండిగ చెరువు నుంచి 3లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించారు. అలాగే పున్నేపల్లి, కొత్తపేట వద్ద పొర్లుకట్టల పనులను నెల్లూరుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ నుంచి మల్లాం గ్రామానికి చెందిన మరో నాయకుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తున్నారు.
ఈ పనుల్లో ఒకటన్నర కిలోమీటరుకు ఇప్పటి వరకు 50 వేల క్యూబిక్ మీటర్లు మట్టిని తవ్వేశారు. దీంతో చెరువులో భారీగా గోతులు ఏర్పడ్డాయి. చెరువుల్లో సుమారుగా మూడు అడుగులు లోతు మాత్రమే మట్టిని తీయాలని అధికారులు నిబంధనలు ఉన్నా, కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టారాజ్యంగా ఆరు అడుగుల లోతు వరకు మట్టిని తరలిస్తున్నారు. ఇటీవల చిన్నపాటి వర్షంకు ఈ గోతులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ నీటి గుంతల్లో పశువులు, చిన్న పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాలు భారిన పడే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.