సాగని సాగర్ ఆధునికీకరణ | Sagar modernization | Sakshi
Sakshi News home page

సాగని సాగర్ ఆధునికీకరణ

Published Mon, Sep 8 2014 3:28 AM | Last Updated on Mon, Oct 1 2018 4:38 PM

Sagar modernization

- నత్తన నడకన పనులు
- ఈ ఏడాది 10 శాతం మేరకే..
- రెండు సార్లు గడువు ఇచ్చిన పూర్తి కాని వైనం
ఖమ్మం అర్బన్:
సాగర్ కాల్వ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాల్వ చివరి భూములకు, స్థిరీకరణ ఆయకట్టుకు వృథా లేకుండా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పనులు ఏడేళ్లవుతున్నా పూర్తి కావడం లేదు. ప్రతి ఏటా ఎదో ఒక కారణంతో అనుకన్న లక్ష్యం మేరకు పనులు చేయలేక పోవడంతో  మొదట చేసిన పనులు మళ్లీ మరమ్మతులకు వస్తున్నాయి. ఈ పనులు పూర్తయ్యేందుకు   గడువు పెంచినా, కొన్ని ప్యాకేజిల్లో అసలు ఇంతవరకూ పనులే ప్రారంభం కాలేదు.  

ఈ ఏడాది లక్ష్యంలో  పదిశాతం పనులే పూర్తికాగా  వర్షాలు ప్రారంభం కావడంతో అన్ని చోట్లా నిలిచిపోయాయి. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడంతో కాల్వలకు గండ్లు పడడం, ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు పూర్తి స్థాయిలో పంట భూములకు చేరలేకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించి సాగర్ కాల్వ ఆధునికీకరణ పనులను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. భవిష్యత్తులోనైనా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఆశించిన ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం ఈనెల 9న జిల్లాలో పర్యటించనుంది. ఆధునికీకరణ
 
400 క్యూసెక్కులకే గండి
గత రబీ సీజన్‌లో నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో గండి పడి వారం రోజులు నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. అప్పటిలో టెలిఫోన్‌లైన్ కోసం తవ్వకాలు చేయడంతో కాల్వ  గండికి కారణమని అధికారులు అప్పటిలో తేల్చారు. గత సోమవారం తెల్లవారుజామున బోనకల్లు బ్రాంచి కాల్వకు నీరు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 10 అడుగుల మేరకు గండి పడటంతో  మళ్లీ సరఫరాకు అంతరాయం కలిగింది.

1,400  క్యూసెక్కల నీరు ప్రవహించాల్సి కాల్వలో కేవలం 400 క్యూసెక్కల నీరు విడుదల చేస్తేనే గండిపడిందంటే కాల్వ అధునినీరణతో ఉపయోగమా.. నష్టమా అనేది అర్థం కావడం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో కోట్లాది రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో సాగర్ కాల్వల అధునినీకరణ పనులు చేపట్టారు. ఈఏడాది ఆ పనుల  లక్ష్యంలో  10 శాతం మేరకే  పనులు సాగాయి. ప్రధాన కాల్వ 2,3,4,5,7 ప్యాకేజీల పనులతోపాటు, మధిర, బోనకల్లు బ్రాంచి కాల్వల ఆధునికీకరణ గత ఏడాది అంచనాల్లో 65 శాతం పనులు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.  

ఈఏడాది కేవలం 10 శాతం పనులు జరగడంతో  ప్రధాన కాల్వ పనులు 75 శాతానికి చేరుకున్నాయి. డీసీల పరిధిలో 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 24 ప్యాకేజీల పరిధిలో గత ఏడాది 50 శాతం మేరకు పనులు జరిగితే ఈ ఏడాది మరో 10 శాతంతో కలిపి 65 శాతం మేరకు పనులు పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. ఈఏడాదిలో ఆధునికీకరణకు ప్యాకేజీ 20, 22ల పరిధిలో అసలు పనులే ప్రారంభం కాకపోవడంతో అక్కడ గత ఏడాది జరిగిన పనులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత ఏడాది 5నుంచి 10 శాతం పనులు జరిగిన ప్యాకేజీల్లో ఈఏడాది అత్యధికంగా పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
 
ఈ ఏడాదిలో పనులు చేయడానికి గ్యాప్ పిరియడ్ లేకపోవడంతో పనులు చేయలేక పోయినట్లు అధికారులు అంటున్నారు. గత ఏప్రిల్  వరకు రబీసాగుకు నీరు విడుదల చేయడం, తర్వాత  నీరు  కాల్వలో ఎండి పనులు మొదలు పెట్టడం, ఏప్రిల్ మాసం గడిచి పోవడం, తర్వాత పనులు ప్రారంభించగానే అడపాదడపా వర్షాలు పడడంతో పనులు చేయడానికి అంతరాయం ఏర్పడింది.  పనులు మొదలు పెట్టి చేసే సమయంలో తాగు నీటి కోసం నీరు విడుదల చేయడం,  తర్వాత సాగర్ డ్యామ్‌లోకి నీరు చేరడం, సాగుకు, తాగు అవసరాలకు  నీరు విడుదల చేయడంతో సాగర్ ఆధునికీకరణ పనులు అనుకున్న మేరకు  ముందుకు సాగడం లేదు.
 
2008లో ప్రారంభమైనా...
సాగర్ కాల్వల ఆధునికీకరణ పనుల కోసం ప్రపంచబ్యాంక్ రూ. 4వేల444 కోట్లు మంజూరు చేసింది. వాటిలో ప్రధాన కాల్వ, డీసీ  పరిధిలోని కాల్వలతోపాటు, నీటి సంఘాల పరిధిలో ఉన్న కాల్వలన్నీ ఆధునీకరించి నీరు వృథాకాకుండా  చివరి భూములకు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పనులు గడువు దాటినా పూర్తి కావడం లేదు. ప్రధాన కాల్వ పనులు 48 నెలలు, డీసీల, నీటి సంఘాల పరిధిలో పనులు అగిమెంట్ అయిన తర్వాత పూర్తి చేయాల్సి ఉంది. తొలుత ప్రారంభించిన  ప్రధాన కాల్వ పనులు గడువు 2012 ఆగస్టుతో దాటింది.

రకరకాల కారణాల వ ల్ల పనులు జాప్యం జరిగిందంటూ మరో రెండు సంవత్సరాలు గడువు పెంచాలని అధికారులు ప్రపంచ బ్యాంక్‌ను కోరడంతో అనుమతులు వచ్చాయి. ఆ గడువు కూడా గత నెల 29తో ముగిసింది. పనులు మాత్రం సగానికి కొద్దిగా ఎక్కువగా జరిగాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో ఏడాది అంటే 2015 ఏడాది ఆగస్టు వరకు ఇవ్వాలని కోరుతూ అధికారులు ప్రపంచ బ్యాంక్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు.
 
డీసీల పరిధిలో పనులు 2011-12 లో ప్రారంభమయ్యాయి.  ఆ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. నీటి సంఘాల పరిధిలో  పనులు చేయడానికి ప్రపంచ బ్యాంక్‌నుండి ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ఇందుకు కారణం నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం అంటూ ప్రపంచ  బ్యాంక్ తెలిపింది. నీటి సంఘాలు ఉంటేనే వాటి పరిధిలో పనులు చేయాలని షరత్ విధించడంతో   రెండు సంవత్సరాలుగా నీటి సంఘాలకు ఎన్నికలు జరపకపోవడంతో  అసలు ఆ పనులు ప్రారంభమే కాలేదు.  ఇటీవలే  ఐదు సంఘాల పరిధిలో పనులు చేయడానికి ప్రపంచబ్యాంక్ ఎట్టికేలకు అనుమతి ఇవ్వడంతో వాటిని ప్రారంభించడానికి అధికారులు రూ. 5  కోట్ల అంచనాలతో టెండర్లు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఈనెలలో వాటికి టెండర్లు నిర్వహించనున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
 
ప్రధాన కాల్వ పరిధిలో 67 శాతమే...
 తెలంగాణ రాష్ట్రం పరిధి  టేకులపల్లి సర్కిల్ పరిధిలోని 8 ప్యాకేజీల ఆధునికీకరణకు రూ. 423.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతన్నా  67 శాతం మాత్రమే పనులు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే.. రూ. 287.43 కోట్లమేరే పనులు జరిగాయి.  8 ప్యాకేజీల్లో 6 నంబర్ ప్యాకేజీ  పనులు మాత్రం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 7 ప్యాకేజీల పనులకు మరో ఏడాది గడువు పెంచాలని  ప్రపంచబ్యాంక్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి అనుమతులు వస్తే మళ్లీ ఎప్రిల్  తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
 
డీసీల పరిధిలో 50 శాతం పనులే పూర్తి
డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ)ల పరిధిలో గతంలో 19 ప్యాకేజిలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టేకులపల్లి సర్కిల్ పరిధిలో 11 ప్యాకెజేలు ఉన్నాయి. ఆ పనులకు రూ.197.32 కోట్లు మంజూరు కాగా వాటిలో 50 శాతం మేరకే పనులు పూర్తయ్యాయి.  రూ 98.62 కోట్ల పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.  పనులు ప్రారంభం నుంచి జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా నోటీసులు  జారీ చేశారు.  ఒక ప్యాకేజి పనుల్లో కొంత బాగం విడగొట్టి ఈఏడాది మరో కాంట్రాక్టర్‌కు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement