ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు | Area farmers' hopes of water | Sakshi
Sakshi News home page

ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు

Published Tue, Nov 18 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు

ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు

కర్నూలు రూరల్ : రబీ ఆయకట్టుదారుల ఆశలపై ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీళ్లు చల్లారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన జరిగిన నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు.

రబీ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ నాయకులు వాస్తవాలపై చర్చ జరగకుండానే తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్‌ఎల్‌సీ) నీటిని కర్ణాటక రైతులు ఇష్టారాజ్యంగా జలచౌర్యం చేస్తున్నారన్నారు. ప్రత్యేక కమిటీ వేసి క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.

ప్రతిఏటా ఐఏబీ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నా పేపర్లకే పరిమితమవుతున్నాయని, ఆచరణకు నోచుకోవడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్‌లో దిగువ కాలువ కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కేసీ కెనాల్ నీరు అనంతపురానికి మళ్లించే ఉత్తర్వులను  రద్దు చేయాలని, టీబీ డ్యామ్‌లో కేసీకి కేటాయించిన 10 టీఎంసీల నీరు ఖచ్చితంగా హక్కుగా ఆయకట్టుదారులకు ఇవ్వాల్సిందేనని నందికొట్కూరు ప్రాంతానికి చెందిన రైతులు సమావేశం దృష్టికి తీసుకురాగా డిప్యూటీ సీఎం కల్పించుకుని తాము అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అయ్యిందని, జీఓలపై దృష్టి పెట్టే సమయం తమకు లేదన్నారు.

గతంలో జరిగిన వాటితో సంబంధం లేదంటూ దాటవేశారు. కేసీ కింద ఖరీఫ్‌లో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటి వరకు 16.4 టీఎంసీల నీటిని వినియోగించామని, ప్రస్తుతం సాగులో ఉన్న ఆయకట్టుకు నష్టం కలగకుండా నీరందించాలంటే మరో 8.91 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు వివరించారు. ఒకవేళ ఈ నీరు అందుబాటులో లేని పక్షంలో టీబీ డ్యామ్‌లోని కేసీ వాటా కింద ఈ ఏడాదికి కేటాయించిన 6.4 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తే ఖరీఫ్ పంటల చివరి తడులకు, కొంతమేరకు రబీ ఆయకట్టుకు కూడా సాగు నీరిచ్చేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.

దీనిపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసి.. సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు. ప్రభుత్వం అనుమతివ్వకుంటే మీరేమి చేస్తారంటూ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అధికారులపై చిందులేశారు. మీరు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనుమతి తీసుకొస్తేనే కేసీ ఆయకట్టు రైతులకు నీరిస్తామని లేకపోతే తామేమి చేయలేమని అధికారులు తేల్చి చెప్పారు.

ఖరీఫ్‌లో నందికొట్కూరు, పాణ్యం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో మిరప పంట అధికంగా సాగు చేశారని, జనవరి, ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా నీరిస్తేనే రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మీరడిగిన విధంగా నీరు ఇవ్వాలంటే అందుబాటులో లేదు కదా. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కేసీకి హంద్రీనీవా, ఎస్సార్బీసీ, వెలుగోడు రిజర్వాయర్ల నుంచి నీరిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.

గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి దీని గురించి ఎందుకు పట్టించుకోలేదని, దీన్నిబట్టి చూస్తే ఆయనకు రైతుల పట్ల ఎంత మమకారం ఉందో తేటతెల్లమవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు వచ్చినా నీటి చేరికలు భారీగానే వచ్చినా మీరెందుకు వెలుగోడు రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపలేకపోయారని.. అధికారులు నిర్లక్ష్యంగా పని చేస్తే రైతులకు ఎవరు సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెలుగోడు పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటిని నిల్వ చేశారంటే మీ నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతోందన్నారు. ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేయించుకోకుండా ఎందుకు ఆలస్యం చేశారని కలెక్టర్ తెలుగుగంగ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 98వ కిలోమీటరు నుంచి 130వ కిలోమీటరు వరకు 30 చోట్ల కాల్వకు రంధ్రాలు పడ్డాయని ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని బద్వేలు ఎమ్మెల్యే జయరాం నీటిపారుదల శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయి తెలుగుగంగ కాల్వకు పూర్తిగా లైనింగ్ పనులు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. హంద్రీనీవా, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, వీఆర్‌ఎస్పీ, ఎత్తిపోతల పథకాలు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన స్కీములకు రబీలో సాగు నీరిచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పేశారు.

కృష్ణా నీటి యాజమాన్య బోర్డు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతితో చర్చించామని, అయితే కోస్తా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నందు వల్ల  ఆ ప్రాంతానికి బోర్డు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. దీని గురించి చంద్రబాబుతో చర్చించి బోర్డు కర్నూలులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు, ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, బాల నాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ, ఐజయ్య, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాం, నీటి పారుదల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement