సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.
19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు..: రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని నియమించి పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ)లను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్‌సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్‌సీ క్యాడర్‌లో బాధ్యతలు అప్పగించారు. చదవండి: (కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!)
19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు
ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం
సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
►రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాం . ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. – సీఎం కేసీఆర్
945 అదనపు పోస్టులు ...
ప్రస్తుతం ముగ్గురు ఈఎన్‌సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్‌సీ పోస్టులను మంజూరు చేశారు. సీఈ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్‌ఈల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుంచి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుంచి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుంచి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
జూన్‌లోగా ఛనాక–కొరాట పూర్తి చేయాలి..
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఛనాక–కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కాల్వలను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని కేసీఆర్ సూచించారు.
వర్షాకాలంలోగా గోదావరి కరకట్టలు..
వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని సూచించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. హుజూర్‌నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి , జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీలు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment