సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెలాఖరున టీఆర్‌ఎస్ ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ ధర్నా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం తెలపనున్నారు.
సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోంది. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతి అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది. కేంద్రం కొనమంటుంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తెలియదు.
చదవండి: (తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..)
ఇలాంటి పరిస్థితుల్లో యాసంగిలో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలి. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలి. బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా ఎందుకు?. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదా.. వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ఎంధుకు రాకూడదు' అని సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో భారీ ధర్నా
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రేపు ప్రధానికి, సంబంధిత మంత్రికి లేఖ రాస్తా. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్లుగా.. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా చెప్పాలి. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పాలి. యాసంగిలో వరి ధాన్యం వేయాలి అని చెప్పిన బండి సంజయ్ అదే మాట మీద ఉన్నడా లేదా అనేది తేలాలి. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ భారీ ధర్నా చేస్తారు. ధర్నా తర్వాత, రాజ్ భవన్‌లో గవర్నర్‌కు మెమోరాండం ఇస్తాం. 18న ధర్నా తర్వాత కేంద్రానికి రెండు రోజుల సమయం ఇస్తాం. అప్పటికీ సమాధానం రాకపోతే రైతులకు ప్రత్యమ్నాయ పంటలను వేయాల్సిందిగా సూచిస్తాం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. లోక్‌సభలో, రాజ్యసభలో మా పార్లమెంట్ పక్షం వ్యతిరేకించింది అని సీఎం కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment