సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం సేకరించబోమని కేంద్రం స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం మీడియ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందుకే తెలంగాణలో రైతులు వరి పండించొద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని తెలిపారు. తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ప్రజలు తమకు ఇచ్చారని అన్నారు. శిథిలమైన చెరువులను కూడా మిషన్ కాకతీయతో అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. తెలంగాణలో సాగుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, ఒకప్పుడు రాష్ట్రంలో విత్తనాలు కూడా దొరికేవి కావని సీఎం కేసీఆర్ తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ పెట్టిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో ఏడాదికి 55 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతోందని తెలిపారు. కరోనా సమయంలోనూ పూర్తిగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఆహార కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.
ధాన్యం తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోంది:
ధాన్యం నిల్వ చేసే వ్యవస్థ కేంద్రం వద్దే ఉందని, కేంద్రం పూర్తి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ధాన్యం తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోందని, ధాన్యం నిల్వ చేసే సదుపాయం, వ్యవస్థ రాష్ట్రాల వద్ద లేదని తెలిపారు. పంట మార్పిడి చేయాలని కేంద్రమే మూడుసార్లు చెప్పిందని గుర్తుచేశారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని హామీ ఇవ్వాలని కేంద్రం షరతు పెట్టిందని అన్నారు. వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో తెలంగాణలో వరిధాన్యం వేశారని అన్నారు. వర్షాకాలంలో పండించిన ధాన్యాన్నే.. కేంద్రం కొంటుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించామని అన్నారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోందని చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడివి పచ్చి అబద్ధాలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రైతులు వరి పంటనే పండించాలని బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నారని తెలిపారు. ఢిల్లీ బీజేపీ ధాన్యం కొనుగోలు చేయమంటోందని, రాష్ట్ర బీజేపీ ధాన్యమే పండించాలని అంటోందని దుయ్యపట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చాలా రోజులు క్షమిస్తున్నానని అన్నారు. తనను వ్యక్తిగతంగా మాటలన్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కొద్దిరోజులుగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.. తప్పుడు మాటలు విని వరిపండిస్తే నష్టపోతారని తెలిపారు. కేంద్రం రైతు విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులను కొట్టమని బీజేపీ ముఖ్యమంత్రులే చెబుతున్నారని అన్నారు. కేంద్రం రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని ఫైర్ అయ్యారు. ఏడేళ్లుగా ఏం మాట్లాడుతున్నా.. సహిస్తూ వచ్చామని హెచ్చరించారు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలకు తాకట్టు పెడితే సహించబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
బీజేపీని ప్రజలు తిరస్కరించానే భయంతో..
పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన అబద్ధం చెప్పిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయని కేంద్రం అబద్ధం చెప్పిందని అన్నారు. గత ఏడేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు కేంద్రం అమాంతం పెంచేసిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉపఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించానే భయంలో కేంద్రం పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించిందని ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూపాయి కూడా వ్యాట్ పెంచలేదన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని ఇదే బండి సంజయ్ చిల్లర మాటాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసమర్థతను, తెలివితక్కువతాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. కేసీఆర్‌ను జైలుకు పంపడం మీ తరమా? అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే బతికి బట్టకడతారా? అని నిలదీశారు. మంత్రులు, ముఖ్యమంత్రులపై పెద్దంతరం, చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు మీ ఆటలు చెల్లినాయి.. ఇకపై చెల్లవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
ఇన్నాళ్లూ ఓపికగా అన్నీ సహించాం.. ఇక సహించేది లేదు
ఏడేళ్ల పరిపాలనలో కేంద్రం ఈ దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏంటీ? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రూ.15 లక్షలు ఇస్తామని, రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని నిలదీశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దుండుకోవడం రాజకీయామా? అని మండిపడ్డారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా మన జీడీపీ తక్కువ ఎలా అయ్యిందని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తోందని మండిపడ్డారు. ప్రతి రైతు బావి దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం బలవంతంపెడుతోందని అన్నారు. ఇన్నాళ్లూ ఓపికగా అన్నీ సహించాం.. ఇక సహించేది లేదు అని హెచ్చరించారు. ‘మా మెడలు వంచుతామని చెబుతారా? మీ మెడలు విరుస్తాం బిడ్డా’ అని మండిపడ్డారు. 119 ఎమ్మెల్యేల్లో 110 ఎమ్మెల్యేలు మాతో ఉన్నారని అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే మెడలు విరుస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటున్నారు.. దమ్ముంటే విచారణ చేసుకోండని అన్నారు. ‘మేము మహామహా రాకాసులతో పోరాడాం.. మీలాంటి గోకాసురుల మాకు లెక్కకాదు’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment