దమ్ముంటే టచ్‌ చేయండి: సీఎం కేసీఆర్‌ సవాల్‌ | Telangana CM KCR Takes On BJP State President Bandi Sanjay Kumar | Sakshi
Sakshi News home page

దమ్ముంటే టచ్‌ చేయండి: సీఎం కేసీఆర్‌ సవాల్‌

Published Sun, Nov 7 2021 8:30 PM | Last Updated on Mon, Nov 8 2021 8:08 AM

Telangana CM KCR Takes On BJP State President Bandi Sanjay Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నోటి కొచ్చినట్టు మితిమీరి అడ్డం పొడవు మాట్లాడుతున్నడు. ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా.. నాస్థాయి కాదు, చిన్న వాడన్న ఉద్దేశంతో పట్టించుకోకుండా క్షమిస్తూ వచ్చిన. కానీ ఏడేండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ రైతుల బతుకు ఆగం చేసేలా, ధర్నాలతో రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న ప్రకటనలతో బాధ కలుగుతోంది. నన్ను జైలుకు పంపుతమని అంటున్నడు. ఎందుకింత అహంకారం. దమ్ముంటే టచ్‌ చేసి చూడండి...’’ అని సీఎం కేసీఆర్‌ సవాల్‌ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. సమావేశం లో కేసీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

అవన్నీ పచ్చి అబద్ధాలు 
‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు. వరి వేయండి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనేలా మెడలు వంచుతం అంటున్నడు. నాదా, కేంద్రానిదా ఎవరి మెడ వంచుతరు. బండి సంజయ్‌ ఏది పడితే అది మాట్లాడుతున్నడు. ఈ సొల్లు మాటలతో ఏర్పడిన గందరగోళం తొలగించేందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. ఢిల్లీ బీజేపీ వరి సాగు చేయొద్దు అంటోంది. రాష్ట్రంలోని సిల్లీ బీజేపీ వరి వేయాలని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పనికిమాలిన మాటలు నమ్మి వరి వేస్తే దెబ్బతింటం. తెలంగాణ నుంచి వరి కొంటామని కేంద్రం నుంచి ఆర్డర్‌ తెస్తే.. నాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 70, 80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేలా చూస్తాం. అలా తెచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? కేంద్రం పునర్విభన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి తెలంగాణకు రూ. పది పనిచేశారా? 

మీరు కాదు.. మేమే ధర్నాలు చేస్తం.. 
రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో, ఢిల్లీలో కొట్లా డుతం. ధాన్యం కొనుగోలులో మా వాటా ఏంటో చెప్పాలని 6,200 కొనుగోలు కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తం. అవసరమైతే నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రతినిధులతో ఢిల్లీలో ధర్నాకు దిగుతాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకొనేందుకు అన్నిరకాల పోరాటానికి సిద్ధం. చిల్లరగాళ్లు, కిరికిరిగాళ్లు, కిరాయిగాళ్లు తెలంగాణను ఆగం చేస్తే కేసీఆర్‌ మౌనం పాటిస్తాడా? నా ప్రాణం పోయినా సరేనని ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని తెచ్చా. ఇకపై మన్నించం. కేంద్రంతో కొట్లాడేందుకు ఎవరిని కలుపుకోవాలో వారిని కలుపుకొంటం. 

రైతులకు అండగా ఉంటం 
వ్యవసాయ చట్టాల పేరిట రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్ని స్తోంది. ఏడాదికాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నరు. బృందాలుగా ఏర్పడి రైతులను కొట్టాలని బీజేపీ సీఎంలే  రెచ్చగొడుతున్నరు. ఉత్తర భారత్‌లో రైతుల ఆందో ళనలకు అండగా ఉంటం. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని మేమూ ధర్నాలు చేస్తం. 

ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోండి 
ఇన్నాళ్లూ పిచ్చికూతలు కూసినా క్షమించి వదిలేసినం. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బిడ్డా. మాది పవర్‌ ఫుల్‌ పార్టీ. మాకు 103 మంది ఎమ్మెల్యేలు, మా మిత్రపక్షం ఎంఐఎంకు మరో ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. 119లో 110 మందిమి మేమే. మేం ఢిల్లీ నుంచి కాకుండా.. ప్రజలు నామినేట్‌ చేస్తే వచ్చాం. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు. సిద్ధంగా ఉన్నాం. కానీ వీధుల్లో ఏం మాట్లాడుతున్నరు. కుక్కల్లా ఇష్టమొచ్చినట్లు మొరుగుతరా? మేం ఉద్యమాలు చేసినోళ్లం. బీ కేర్‌ఫుల్‌.. కుసంస్కారులు, హీనుల్లా రాజకీయ విలువలు దిగజారుస్తూ ఎంతకాలం మోసం చేస్తరు. కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచి ఓ మెడికల్‌ కాలేజీనో, ఇంకేదో తెచ్చిండా? ఆ మనిషికి ఇంగ్లిషో, హిందీయో వస్త దా? కేంద్రం నుంచి వచ్చిన లెటర్లు అర్థమైతయా? అలాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వద్దని లేఖ ఇచ్చిండు. 

ఓడితే భూమి బద్దలైతదా? 
ఉప ఎన్నికలు అన్నంక ఓ పార్టీ ఓడుతది, మరొకరు గెలుస్తరు. మొన్నసాగర్‌లో బీజేపీ ఓడి డిపాజిట్‌ పోయింది. హుజూరాబాద్‌లో ఓడితే భూమి బద్దలవుతదా. హుజూర్‌నగర్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై గెలిచినం. తెలంగాణ ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అంటున్నరా. ఈ రోజు దేశంలో 30కిపైగా సీట్లలో ఉప ఎన్నిక జరిగితే.. బీజేపీవి అన్ని పొయినయి. అంటే బీజేపీకి వ్యతిరేకంగా తీర్పువచ్చినట్టా? ఉప ఎన్నికల పరిణామాలను మేం పట్టించుకోం. అసలు మీకు రాష్ట్రంలో ఆర్గనైజేషన్‌ ఉందా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 107 చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది. అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే సోషల్‌ మీడియాలో అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. దళితులు, ఎస్టీల కోసం పెట్టిన చట్టాన్ని ఓ వెధవ లొట్టపీసు చట్టం అంటున్నడు. వారికి చట్టాలు, కోర్టులు అంటే గౌరవం లేదు. దళితులు, గిరిజనులు అంటే భయం లేదు. కేసీఆర్‌ బతికి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ దళితబంధు స్కీం ఆగదు. కేవలం హుజూరాబాద్‌లోనే కాదు, రాష్ట్రమంతటా అమలు చేస్తం.’’  

ఏడేండ్లలో దేశాన్ని నాశనం చేశారు 
టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. బీజేపీ ఏడేండ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టారు. దళితులు, ఎస్టీలు, బీసీలు, నిరుద్యోగులు, రైతులకు ఏదైనా చేశారా? అంతర్జాతీయ సరిహద్దు సమస్యలు, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రాజకీయంతో దేశాన్ని నాశనం చేశారు. చైనా మన అరుణాచల్‌ప్రదేశ్‌లో ఊళ్లకు ఊళ్లే కడుతూ దంచుతోంది. అక్కడ చేతకాక బీజేపీ తోకముడిచింది. జీడీపీ, ఆహార భద్రతను దెబ్బతీసింది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీసింది. అడ్డగోలు పన్నులతో ప్రజల మీద భారం పెంచింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశాల్లో రాష్ట్రాల మీద ఒత్తిడి పెంచి బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. ఇకపై ఇలాంటి వాటిమీద అటు కేంద్రం, ఇటు రాష్ట్ర బీజేపీ వెంట పడతం. 

కళ్లు నెత్తికొచ్చాయా? 
బీజేపీ నేతలు మితిమీరి మాట్లాడుతూ నన్ను నిందిస్తున్నా పడుతూ వచ్చినం. కానీ ‘కేసీఆర్‌ను జైలుకు పంపుతం, మా వ్యూహం మాకుంది, మా జాతీయ అధ్యక్షుడు నాకు చెప్పాడు’ అని బండి సంజయ్‌ అంటున్నడు. నన్ను జైలుకు పంపుతరా? బలుపా.. అహంకారమా? కళ్లు నెత్తికొచ్చాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారం ఎందుకు? పరిపాలించే శక్తిలేని కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాల మీద రుద్ది సీఎంలను జైలుకు పంపుతరా? కేసీఆర్‌ను జైలుకు పంపుతరా? నన్ను ముట్టి చూడు బిడ్డా.. టచ్‌ చేసి చూడు కేసీఆర్‌ను. నన్ను జైలుకు పంపి ఇక్కడ బతికి బట్టకట్టి తిరుగుత అనుకుంటున్నవా? మేం చేతులు ముడుచుకుని కూర్చున్నమా?    –కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement