సాగుకు నీళ్లు!
సాక్షి, చెన్నై: వర్షాభావ పరిస్థితులు కొన్నేళ్లుగా రాష్ట్ర అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచుతున్నాయి. గత ఏడాది సంబా సాగులో నిమగ్నమైన అన్నదాతలను చివరి క్షణంలో కర్ణాటకలో కురిసిన వర్షాలు ఆదుకున్నాయి. ఈ సారి కూడా సాగు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కర్ణాటక వర్షాలు మళ్లీ డెల్టా అన్నదాతల్ని ఆదుకుంటున్నాయి. గత నెల 12వ తేదీ మెట్టూరు డ్యాంలో కేవలం 44 అడుగుల మేరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో వర్షం లేకపోయినా, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో 20 రోజులుగా రాష్ట్రంలోకి కావేరి నదీ ప్రవాహం ఉరకలెత్తుతోంది.
పెరిగిన నీటి మట్టం: కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వేలాది ఘనపుటడుగుల నీళ్లు మెట్టూరు డ్యాంలోకి చేరుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో ఆ డ్యాం నీటి మట్టం 50 అడుగులు పెరిగింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వికసిం చింది. డెల్టాలో సంబా సాగుబడికి నీళ్లు దక్కినట్టేనన్న నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ డ్యాం నుంచి నీళ్లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అన్న ఎదురు చూపులు పెరిగాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో గురువారం కృష్ణరాజ సాగర్, కబిని డ్యాంల నుంచి లక్షకు పైగా ఘనపుటడుగుల నీటిని విడుదల చేసిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మెట్టూరు డ్యాంలోకి లక్ష ఘనపుటడుగుల మేరకు నీళ్లు వచ్చే అవకాశం ఉండటంతో త్వరితగతిన పూర్తి స్థాయిలో ఆ డ్యాం నిండటం ఖాయం అన్న అంచనాకు నీటి పారుదల శాఖ అధికారులు వచ్చారు. దీంతో సంబా సాగు నిమిత్తం నీళ్ల విడుదలకు నిర్ణయించారు.
15న విడుదల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెల్టా అన్నదాతల్లో ఆనందాన్ని నింపే విధంగా సీఎం జయలలిత ప్రకటన చేశారు. పదిహేనో తేదీ నుంచి మెట్టూరు డ్యాం నీళ్లను సంబా సాగుకు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. డ్యాంలో గురువారం 94 అడుగుల నీటి మట్టం దాటిందని, 57.450 టీఎంసీల మేరకు నీళ్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఉదయానికి లేదా, సాయంత్రానికి మెట్టూరు డ్యాంకు లక్ష ఘనపుటడుగులకు పైగా నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా నీళ్లు సద్వినియోగం చేసుకునే విధంగా కావేరి, పెన్నారు, కల్లనై కాలువల ద్వారా నీటిని అనుబంధ డ్యాంలకు మళ్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు.
అలాగే, 12 లక్షల ఎకరాల్లో సంబా సాగు లక్ష్యంగా నీళ్లు విడుదల చేస్తున్నామని వివరించారు. సంబా సాగుకు నీళ్లు దక్కనుండడంతో డెల్టా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెట్టూరు డ్యాం పూర్తిగా నిండాలని, ఉబరి నీళ్లు ఇతర జలాశయాల్లోకి చేరే రీతిలో కావేరి పరవళ్లు తొక్కాలన్న ఆకాంక్షలో అన్నదాతలు పడ్డారు. హొగ్నెకల్ వద్ద కావేరి ఉగ్ర రూపం దాల్చుతోంది, సందర్శకులను ఆ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. అలాగే, నీటి ఉధృతి మరింత పెరగనున్న దృష్ట్యా, కావేరి తీరవాసులను మరింత అప్రమత్తం చేశారు. లోతట్టు గ్రామాల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.