కోటపల్లి : ప్రాణహిత నది మీదుగా నిత్యావసర సరుకులు సరిహద్దు దాటుతున్నాయి. లక్షలాది రూపాయలు వాణిజ్య పన్నులకు ఎగనామం పెడుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిత్యావసర సరుకులు, పప్పు దినుసులు, నూనె డబ్బాలు మహారాష్ట్రకు రవా ణా చేస్తున్నారు. మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నదీ తీరం సరిహద్దు మహారాష్ట్రకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంతో అవతలి, ఇవతలి తీరంగా ఉంది.
ఆ రాష్ట్రం లోని గడ్చిరోళి జిల్లా సిర్వంచ కేంద్రంగా అర్జునగుట్ట తీరం నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. నది అవతలి ఒడ్డున పాత తాలూకా కేంద్రం సిర్వంచ గ్రామం ఉంది. జిల్లాలోనే వెనుకబడిన ఆదివాసీ ప్రాంతం. ఇక్కడ ఏ వ్యాపార, వాణిజ్య అవసరాలు ఏర్పడినా మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఆశ్రయించాల్సిందే. ఇదే అదునుగా చెన్నూర్‌లోని వ్యా పారులు సిర్వంచ వాణిజ్య కేంద్రంగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.
అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులను విక్రయాల కోసం తరలించాలంటే పన్నులు చెల్లించాల్సిందే. కానీ ఇక్కడి వ్యాపారులు కొందరు ఆ నిబంధనలేవీ పాటించడం లేదు. నిత్యం టన్నుల కొద్దీ పప్పుదినుసులు, వందలాది లీటర్ల నూనె డబ్బాలు, నాణ్యమైన సన్నబియ్యం సహా ఇతర వస్తువులు ప్రాణహిత నది మీదుగా పడవల్లో సరిహద్దు దాటుతున్నాయి. సరుకుల రవాణాకు వ్యాపారులు ప్రత్యేకంగా జీపులు సమకూర్చుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు.
ప్రతీ రోజు సుమారు ఐదు నుంచి పది జీవుల సరుకు లోడ్ నాటు పడవల్లో తరలిపోతోంది. జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టిం చుకోవడం లేదనే విమర్శలున్నాయి. అడపా దడపా సరకుల రవాణాను నిలువరించి కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రవాణా అవుతున్న నూనె, పప్పుదినుసులు, బియ్యం తదితర సరకుల అక్రమాలపై విచారణ చేపడితే భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
సరిహద్దులు దాటుతున్న సరుకు..?
Published Tue, Nov 11 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement