నాసిరకం సరుకు... బ్రాండెడ్‌ ముసుగు! | Essentials with leading company names | Sakshi
Sakshi News home page

నాసిరకం సరుకు... బ్రాండెడ్‌ ముసుగు!

Published Sun, Feb 25 2024 5:16 AM | Last Updated on Sun, Feb 25 2024 5:16 AM

Essentials with leading company names - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వివిధ మార్కెట్లలో లభించే ముడిసరుకుతో నాసిరకం నిత్యావసర వస్తువుల తయారీ... ఉత్తరాది నుంచి తీసుకువచ్చిన ప్రముఖ సంస్థల పేర్లతో ఉన్న కవర్లు, డబ్బాల్లో ప్యాక్‌ చేయడం... శివార్లలోని కిరాణా దుకాణాల ద్వారా బ్రాండెడ్‌ సరుకుల పేర్లతో విక్రయం... ఈ పంథాలో రెండేళ్లుగా దందా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును మధ్య మండల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు.

ఆరుగురు సభ్యులున్న ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన సరుకు స్వాదీనం చేసుకున్నట్లు టాస్‌్కఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మి పెరుమాల్‌ పేర్కొన్నారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఆర్‌.గిరిధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.  

ఏళ్లుగా ఇదే దందా... పలు కేసులు... 
రాజస్థాన్‌కు చెందిన శ్యామ్‌ బాటి, కమల్‌ బాటి కొ న్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వల సచ్చి కాచిగూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. తొలినాళ్లల్లో కిరాణా వ్యాపారం చేసిన ఈ ద్వయం ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం బేగంబజా ర్‌కు చెందిన జయరాంతో జట్టు కట్టింది. ఈ ము గ్గురూ బ్రాండెడ్‌ వస్తువుల పేరుతో నాసిరకం సరు కులు ప్యాక్‌ చేసి విక్రయించాలని పథకం వేశారు.

గుజరాత్, బెంగళూరు, ఢిల్లీల నుంచి నాసిరకం ముడిసరుకు ఖరీదు చేసే వాళ్లు. కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్ఖానాలో వీటిని ప్రాసెస్‌ చేసి... బెంగళూరు, ఢిల్లీ, నాసిక్‌ నుంచి తీసుకువచ్చిన వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న కవర్లు, కార్టన్లు, డబ్బాల్లో నింపి స్టిక్కర్లు వేసి మార్కెట్‌లో విక్రయించే వాళ్లు. 2019, 2022 కాచిగూడ, మైలార్‌దేవ్‌పల్లితో పాటు నల్లగొండలోనూ కేసులు నమోదయ్యాయి. తెరవెనుక ఉండిపోయిన ముగ్గురూ తమ స్నేహితుడైన మహేందర్‌ సింగ్‌ను రంగంలోకి దింపారు. రాజస్థాన్‌కే చెందిన ఇతగాడు నాగారంలో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు.  

అక్కడ తయారు చేసి.. ఇక్కడ నిల్వ ఉంచి... 
ముడిసరుకుని బ్రాండెడ్‌ కవర్లలో ప్యాక్‌ చేయడానికి కాటేదాన్‌లో ఓ కార్ఖానా ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికులను పనిలో పెట్టుకుని మిథులేష్‌ కుమార్, త్రియన్‌ కుమార్‌ నేతృత్వలో వీటిని ప్యాక్‌ చేయిస్తున్నారు. ఇలా తయారైన నిత్యావసర వస్తువుల్ని దాచడానికి మహేందర్‌ ఇంటి సమీపంలో ఓ గోదాం అద్దెకు తీసుకున్నారు. తొలుత సరుకు మొత్తం ఇక్కడకు తీసుకువెళ్లి... ఆపై శివార్లలో ఉన్న కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

వీటిలో నాసిరకం సరుకుతో పాటు కల్తీ సరుకు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. వీరి వ్యవహరంపై మధ్య మండల టాస్‌్కఫోర్స్‌కు ఉప్పందింది. ఇన్‌స్పెక్టర్‌ బి.రాజునాయక్‌ నేతృత్వంలో ఎస్సైలు ఎస్‌.సాయికిరణ్, కాచిగూడ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఆర్‌ఎల్‌ రాజు తమ బృందాలతో వలపన్నారు. అక్కడకు సరుకుతో వచ్చిన మహేందర్‌ను పట్టుకోగా... గోదాం, కార్ఖానా విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దీంతో ఆ రెంటి పైనా దాడి చేసిన పోలీసులు మిథులేశ్, త్రియన్‌లను పట్టుకుని మొత్తం రూ.2 కోట్ల విలువైన సరుకు స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్న అధికారులు ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరు ఉన్నారు?  అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

వీటితో ఆరోగ్యానికీ ముప్పు
వీళ్లు సరఫరా చేస్తున్న నాసిరకం, నకిలీ సరుకుల వల్ల వినియోగదారులకు ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్యారాచూట్, సర్ఫ్, వీల్, బ్రూక్‌ బాండ్, హార్పిక్, లైజోల్, ఎవరెస్ట్‌ తదితర కంపెనీలకు చెందిన 30 రకాల ఉత్పత్తుల్ని వీళ్లు తయారు చేస్తున్నారు.

వీటిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికే శివార్లలోని కిరాణా దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. ఇవి నాసిరకం, నకిలీ అని తెలిసే వాళ్లు అమ్ముతున్నారా? లేదా వారినీ మోసం చేస్తున్నారా? అనే అంశాలు ఆరా తీస్తున్నాం. ఈ తరహా ముఠాలపై నిఘా, దాడులు కొనసాగుతాయి.  – రష్మి పెరుమాల్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement