క్లిక్‌ చేస్తే అంతే సంగతి! | Cybercriminals new tactic targets youth | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేస్తే అంతే సంగతి!

Published Mon, Apr 7 2025 4:35 AM | Last Updated on Mon, Apr 7 2025 4:35 AM

Cybercriminals new tactic targets youth

అశ్లీల చిత్రాలతో ఎరవేస్తున్న సైబర్‌ నేరగాళ్లు  

యువతే లక్ష్యంగా కొత్త ఎత్తుగడ 

క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల సమాచారం తస్కరణ 

ఆన్‌లైన్‌లో అందినకాడికి నగదు స్వాహా 

బహుపరాక్‌ అంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

మీరు సీరియస్‌గా బ్రౌజింగ్‌ చేస్తుండగానో... సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో మునిగిఉన్నప్పుడో... ఆకర్షించే విధంగా పాప్‌అప్స్‌ వచ్చాయా..? హఠాత్తుగా మీ ఈ–మెయిల్‌కు గుర్తుతెలియని అడ్రస్‌ నుంచి ‘ఫొటోల’తో కూడిన సందేశం వచ్చిందా..? అలాంటి వాటిని క్లిక్‌ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే అవి మిమ్మల్ని నిలువునా బుక్‌ చేసే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.   – సాక్షి, హైదరాబాద్‌

ఆ వివరాలు అత్యంత కీలకం 
ఓ వ్యక్తికి చెందిన సొమ్మును  ఆన్‌లైన్‌లో స్వాహా చేయడానికి సైబర్‌ నేరగాళ్లకు అతడి  క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబర్,  సీవీవీ కోడ్‌తోపాటు కొన్ని  వ్యక్తిగత వివరాలు అవసరం.  ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌కు  సంబంధించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కచ్చితంగా ఉండాల్సిందే.  వీటితోపాటు ఓటీపీ సైతం ఎంటర్‌  చేయాల్సి ఉంటుంది. 

ఇవి లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు కాజేయడం సాధ్యం  కాదు. సాధారణంగా ఈ వివరాల  కోసంసైబర్‌ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు  అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం,  మెయిల్స్‌ పంపడంతోపాటు సూడోసైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అశ్లీలంతో ఎర వేస్తున్నారు. 

యువతే టార్గెట్‌గా వెబ్‌సైట్లు 
సైబర్‌ నేరగాళ్ల వలలో యువకులే ఎక్కువగా పడుతున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లను సైతం నేరగాళ్లు సృష్టిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్‌అప్స్‌ను వివిధ సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లతోపాటు వెబ్‌సైట్లకు లింక్‌ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వాటిని క్లిక్‌ చేస్తోంది. ఆ తరువాతే అసలు అంకం ప్రారంభమవుతోంది. 

ఆ సైట్‌లోకి పూర్తిగా లాగిన్‌ కావాలన్నా, అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్‌ కావాలన్నా కొంత రుసుం చెల్లించాలంటూ ప్రత్యేక లింకు ఇస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించడానికి క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వివరాలు, నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు అందులో పూరిస్తున్నారు. నిగూఢంగా ఉండే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఈ వివరాలన్నీ నేరుగా సైబర్‌ నేరగాళ్లకు చేరుతున్నాయి. 

ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్‌లైన్‌ లావాదేవీలు పూర్తి చేసి.. ఓటీపీ వచ్చేలా ఆప్షన్‌ ఎంచుకుని వేచి చూస్తున్నారు. వాళ్లు తమ వెబ్‌సైట్‌లో ఓటీపీని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో ఖాతాలోని డబ్బును స్వాహా చేస్తున్నారు. 

ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా అసాధ్యంగా మారుతోందని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్స్‌ చేయడానికి సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేకంగా కొన్ని కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. 

వారికి నైతికత ఉండదు 
ఆన్‌లైన్‌ షాపింగ్, చెల్లింపులను పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్లు మీ కార్డులు, ఆన్‌లైన్‌ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దురి్వనియోగం చేస్తారు. ఈ తరహా నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం అంత కష్టం. 

అప్రమత్తంగా ఉండటం ద్వారానే సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టొచ్చు. ఇలాంటి అశ్లీల వెబ్‌సైట్ల వల్ల కొన్ని సందర్భాల్లో భయంకరమైన వైరస్‌లు కూడా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి వచ్చి చేరతాయి. ఫలితంగా అవి పాడవటంతోపాటు డేటా మొత్తం క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.  –సైబర్‌ క్రైమ్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement